NATO Leader Warns Russia : నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేశారు. తమ కూటమిలోని పోలాండ్‌పై కానీ లేదా మరేదైనా దేశం జోలికిగానీ వస్తే వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పుతిన్ అయినా, మరెవరైనా సరే, తాము ఏదైనా సాధించగలమని అనుకుంటే పొరపాటే అవుతుందని అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగింపు విషయంలో అమెరికా- రష్యాల మధ్య సాగుతున్న చర్చల్లో మాస్కోదే పైచేయిగా నిలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
"నాటో - పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు కట్టుబడి ఉంది. మాపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది పెద్ద తప్పిదమే అవుతుంది. మా కూటమి సభ్యులపై ఎవరైనా దాడి చేస్తే, వారిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడతాం. మా ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవు. పుతిన్‌తోపాటు మాపై దాడి చేయాలనే ఉద్దేశం ఉన్న ఇతరులకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాను" అని పోలాండ్ పర్యటనలో ఉన్న మార్క్ రుట్టే వ్యాఖ్యానించారు. మరోవైపు పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడుతూ, అమెరికా- రష్యాల చర్చల ఫలితాలు ఏ విధంగా వచ్చినా, వాటికి సిద్ధంగా ఉండటం ముఖ్యమని చెప్పారు.
పుతిన్‌కు అనుకూలంగా చర్చలు!
ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా, అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ చర్చల్లో పుతిన్‌కు అనుకూల ఫలితం వస్తుందేమోనని ఐరోపా దేశాల్లో ఆందోళన నెలకొని ఉంది. మాస్కో తన సైన్యాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు, రానున్న సంవత్సరాల్లో ఈ ప్రాంతంలోని ఇతర దేశాలను బెదిరించేందుకు ఇది అవకాశం కల్పిస్తుందేమోనని భయపడుతున్నాయి. ముఖ్యంగా పోలాండ్, ఎస్తోనియా, లిథువేనియా, లాత్వియాలు తీవ్రంగా కలవరపడుతున్నాయి. అయితే ఉక్రెయిన్ సమస్యకు పరిష్కారమనేదీ ఇతర దేశాలపై రష్యా దాడులకు దారితీస్తుందనే విషయాన్ని తాను ఏ మాత్రం నమ్మడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తెలిపారు.
కావాలనే సాగదీత!
ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిపై సానుకూలంగా వ్యవహరిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ కావాలనే సాగదీస్తున్నారని అన్నారు. వాషింగ్టన్ మధ్యవర్తిత్వాన్ని మాస్కో తారుమారు చేస్తోందని ఆరోపించారు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ దీని గురించి మాట్లాడారు. "రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని మాస్కో కోరుకుంటోందని నేను అనుకుంటున్నా. కానీ, ఇప్పుడు వారి కాళ్లను వారే లాక్కుంటున్నారని అనిపిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం పై అమెరికా మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ పుతిన్ ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకుంటున్నట్లు కన్పిస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ మారణహోమాన్ని నేను ఆపాలనుకుంటున్నా. కీవ్‌కు అందిస్తున్న ఆర్థిక సాయానికి ముగింపు పలకాలనుకుంటున్నా" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.