Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు అమెరికా, ఐరోపా దేశాలు యత్నిస్తున్న వేళ ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. సుమీ నగరంపై రష్యా జరిపిన క్షిపణి దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 83 మందికి పైగా గాయపడినట్టు చెప్పారు. పామ్ సండే పండగ సందర్భంగా స్థానికులంతా ఒకచోట చేరిన వేళ రష్యా రెండు క్షిపణులతో దాడి చేసిందని ఆరోపించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు.
అలా జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులు
ఘటనాస్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను ఉక్రెయిన్ విడుదల చేసింది. ఒకవైపు శిథిలాలు, భారీగా వెలువడుతున్న పొగ ఉండగా మరోవైపు జనం భయంతో పరుగులు తీస్తున్నట్టు ఉంది. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు రెండు దేశాల మధ్య అమెరికా ఇంతకుముందు మధ్యవర్తిత్వం వహించింది. ఆ చర్చల సందర్భంగా తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్నారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ దాడులు చోటుచేసుకున్నాయి.
'ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరం'
మరోవైపు సుమీ నగరంపై దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా ఖండించారు. సాధారణ పౌరులను రష్యా లక్ష్యంగా చేసుకుందని, ఈ దాడుల్లో నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు వంటివి ధ్వంసమయ్యాయని మండిపడ్డారు. పదుల సంఖ్యలో పౌరులు మృతి చెందారని చెప్పారు. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని జెలెన్‌స్కీ కోరారు. మాస్కో విషయంలో చర్చలు ఎప్పుడూ క్షిపణులు, వైమానిక దాడులను నిలువరించలేకపోయాయని తెలిపారు. ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరమన్నారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన అసాధ్యమన్నారు. యుద్ధం ముగించేందుకు చర్చలు జరుగుతున్నప్పటి నుంచి రష్యా తమపై 70 క్షిపణులను, 2 వేల 200 పేలుడు డ్రోన్లను, 6 వేల బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
ఉక్రెయిన్‌పై రష్యా ఎయిర్ ఎటాక్- దీని గురించి ట్రంప్‌తో మాట్లాడుతా: జెలెన్‌స్కీ
రష్యా Vs ఉక్రెయిన్ వార్- అణుబాంబులు వాడకుండా పుతిన్‌ను ఒప్పించింది మోదీనే!