Myanmar Earthquake Today : భారీ భూకంపం ధాటికి మయన్మార్, థాయ్‌లాండ్ విలవిల్లాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 186కి చేరినట్లు సమాచారం. ఒక్క మయన్మార్‌లోనే 181 మరణాలు నమోదు కాగా, థాయ్‌లాండ్‌లో ఐదుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మయన్మార్, థాయ్‌లాండ్‌లలో వందలాది మంది గాయపడటంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
అపార ప్రాణ, ఆస్తి నష్టం
మయన్మార్‌లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు అపార నష్టం కలిగించాయి. రాజధాని నెపిడాతోపాటు మరికొన్ని నగరాల్లో కనుచూపు మేరలో ఎక్కడచూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రిక్టర్ స్కేల్‌పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఆ తర్వాత మరో నాలుగు ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.5నుంచి 6.6 మధ్యన ఉన్నట్లు మయన్మార్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మయన్మార్‌లోని ఓ ఆస్పత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. మయన్మార్‌లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం ధాటికి మయన్మార్‌లో అనేక భవనాలతోపాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. మాండలే, సాగింగ్ నగరాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతోపాటు టెలిఫోన్ స్తంభాలు నేలకొరిగినట్లు రెడ్ క్రాస్ కటించింది. విద్యుత్తు సరఫరా లేకపోవటం వల్ల సహాయక చర్యలకు ప్రతికూలంగా మారినట్లు తెలిపింది. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1,000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా నిర్మించిన ఈ ఆస్పత్రికి ఇంకా పేరు పెట్టలేదు. ఈ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

మయన్మార్‌లో చాలాచోట్ల గుళ్లు, గోపురాలు కుప్పకూలాయి. రాజధాని నేపిడాలో చాలాచోట్ల రోడ్లు బీటలు వారాయి. కొన్నిచోట్ల భారీగా పెచ్చులు లేచాయి. దెబ్బతిన్న రోడ్ల మధ్య వాహనాలు చిక్కుకున్నాయి. అందులోని వారు వాహనాలు దిగి పరుగులు పెట్టారు. 2021 నుంచి మయన్మార్ సైనిక పాలనలో ఉంది. స్థానిక రేడియోలు, టీవీలు, ప్రింట్, ఆన్లైన్మీడియాపై మిలిటరీ పాలకుల ఆంక్షల కారణంగా అక్కడి నుంచి సమాచారం అందటం ఆలస్యమవుతోంది. ఇంటర్నెట్ వాడకంపై కూడా ఆంక్షలు ఉన్నాయి. మయన్మార్‌లోని ఆరు రీజియన్లలో అత్యవసర పరిస్థితి విధించిన సైనిక పాలకులు మానవతాసాయం అందించాలని అంతర్జాతీయ సమాజాన్ని అర్థించారు.

థాయ్‌ల్యాండ్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంటా ముప్పై నిమిషాలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. బ్యాంకాక్లోనూ నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. పలు చోట్ల బహుళ అంతస్థుల భవనాల పైఅంతస్తుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు ఎగసిపడ్డాయి. పలు అపార్ట్మెంట్లలో అలారం మోగడం వల్ల ప్రజలు బతుకు జీవుడా అంటూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు ఊగిపోయాయి. మయన్మార్, థాయ్‌ల్యాండ్‌లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. పెద్ద క్రేన్లు, జేసీబీలతో శిథిలాలు తొలగించే పనులు కొనసాగుతున్నాయి. రెడ్ క్రాస్ తదితర స్వచ్ఛంద సంస్థలు చర్యల్లో పాల్గొంటున్నాయి.