Love Letter in a Trade War : ఓ వైపు చైనాతో వాణిజ్య ఘర్షణకు కాలు దువ్విన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- మరోవైపు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. "ప్రపంచంలోని తెలివైన వ్యక్తుల్లో షీ జిన్‌పింగ్ ఒకరు. తప్పకుండా ఆయనతో మంచి ఒప్పందానికి వచ్చి తీరుతాం" అని ట్రంప్ కొనియాడారు. విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"షీ జిన్‌పింగ్ ఎలాంటి మనిషంటే- ఇకపై కచ్చితంగా ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు మాతృ దేశమంటే ప్రేమ. ఇటీవలే జిన్‌పింగ్ స్పందించిన తీరు కూడా బాగుంది. నేను తప్పకుండా నేరుగా ఆయనతో మాట్లాడుతా. తగిన సమయంలో మనకు ఫోన్ కాల్ వస్తుంది." --అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
స్టాక్ మార్కెట్లలో జోష్ నింపిన ట్రంప్
ట్రంప్ ఈ విధంగా షీ జిన్‌పింగ్‌పై ప్రశంసలు కురిపించడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చైనా దిగుమతులపై సుంకాలను 125 శాతానికి పెంచిన ట్రంప్, అకస్మాత్తుగా ఇలా ఎందుకు మాట్లాడారు అనేది ఎవరికీ అంతుచిక్కలేదు. మొత్తం మీద దేశాధ్యక్షుడి మాటలు పాజిటివ్‌గా ఉండటం వల్ల అమెరికా స్టాక్ మార్కెట్లు ఇవాళ పాజిటివ్‌గా కదలాడాయి. రోజుల తరబడి తీవ్ర క్షీణత తర్వాత స్టాక్ సూచీలు పైకి లేచాయి.
చైనా విషయంలో చేసి చూపించానంటూ..
"అమెరికా దిగుమతి సుంకాలను పెంచినందుకు, ప్రతీకార సుంకాలను విధించే దేశాలను మేం ఉపేక్షించం. మాపై ప్రతీకారానికి దిగని మిత్రదేశాలకు 90 రోజుల గడువు ఇచ్చాం. ప్రతీకారానికి దిగే దేశాలపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేస్తాం. చైనా విషయంలో అదే చేసి చూపించాను" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 75కుపైగా మిత్రదేశాలపై విధించిన దిగుమతి సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన ట్రంప్- చైనాపై మాత్రం కసితీరా సుంకాలను విధించారు. చైనాను ఆర్థికంగా ఒంటరిని చేయడానికే అమెరికా ఈ విధానాన్ని అనుసరిస్తోందని ఆర్థిక రంగ పరిశీలకులు అంటున్నారు.