Looting at Apple stores In Los Angeles: అక్రమ వలసదారుల అరెస్టుకు నిరసనగా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్‌లో చెలరేగిన ఆందోళనలు అదుపు తప్పాయి. ఆందోళనలను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు యాపిల్ స్టోర్లతో సహా పలు వ్యాపార కేంద్రాలను లూటీ చేశారు. పలు ప్రాంతాల్లో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్‌లోకి ప్రవేశించి స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్‌లను దోచేశారు. మరికొన్ని దుకాణాల్లో కూడా చొరబడి ధ్వంసం చేశారు. ఫలితంగా పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు.
ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేసినట్లు లాస్ ఏంజెలెస్‌లోని పోలీస్ అధికారి క్రిస్ మిల్లర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పరిస్థితులు చేయి దాటడంతో డౌన్‌టౌన్‌లోని పలు ప్రాంతాల్లో పరిమిత కర్ఫ్యూ విధిస్తున్నట్లు లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. పరిస్థితులు సద్దుమణగ కుంటే మరికొన్ని రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. దుకాణాలను లూటీ చేసినవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె హెచ్చరించారు.
లాస్ ఏంజెలెస్‌లో కర్ఫ్యూ :
లాస్ ఏంజెలెస్ మేయర్ కర్ఫ్యూ ప్రకటించగానే పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు.కర్ఫ్యూ నిబంధనలను అతిక్రమించిన అనేక మందిని అరెస్టు చేశారు. ఫలితంగా నిరసనకారులు కొద్దిగా వెనక్కి తగ్గారు. అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన నేషనల్ గార్డ్స్ మాత్రం పరిమిత స్థాయిలోనే కనిపిస్తున్నారు. అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్న ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బందికి రక్షణగా నిలుస్తున్నారు. ఫెడరల్ ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, డిటెన్షన్ సెంటర్ రక్షణ కోసమంటూ ట్రంప్ నేషనల్ గార్డ్స్‌ను లాస్ ఏంజెలెస్‌కు తరలించారు. మెుదట రెండు వేల మందిని పంపించగా తాజాగా మరో రెండు వేల మందిని, 700 మంది మెరీన్లను తరలించారు.
నేషనల్ గార్డ్స్ కారణంగానే ఆందోళనలు:
లాస్ ఏంజెలెస్‌లో సైన్యం మోహరింపును ప్రజాస్వామ్యంపై దాడిగా కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ అభివర్ణించారు. నేషనల్ గార్డ్స్ ప్రజలను రక్షించేందుకు రాలేదని వారిని భయపెట్టడానికి వచ్చారని అన్నారు. సైన్యాన్ని ఉపసంహరించేలా ఆదేశాలివ్వాలని న్యూసమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేషనల్ గార్డ్స్ కారణంగానే ఆందోళనలు చెలరేగాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టడానికి నిరాకరించిన కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.అటు ఆందోళనలు అమెరికాలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. డల్లాస్, టెక్సాస్, ఆస్టిన్, న్యూయార్క్‌లో అక్రమ వలసదారుల అరెస్టును నిరసిస్తూ వేలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. టెక్సాస్‌లో పలువురు ఆందోళనలకు పిలుపునివ్వటంతో ఆ ప్రాంత గవర్నర్ నేషనల్ గార్డ్స్‌ను రంగంలోకి దించారు.
జంతువులు,విదేశీ శత్రువులతో పోల్చిన ట్రంప్:
లాస్ ఏంజెలెస్‌లో ఆందోళనలు చేస్తున్నవారిని జంతువులు, విదేశీ శత్రువులతో ట్రంప్ పోల్చారు. అమెరికా 250వ ఆర్మీడే సందర్భంగా పోర్ట్ బ్రాగ్‌లో ప్రసంగించిన ఆయన.నేషనల్ గార్డ్స్ మోహరింపును సమర్థించుకొన్నారు. అక్రమ వలసదారుల నుంచి లాస్ ఏంజెలెస్‌కు విముక్తి కల్పిస్తామన్నారు. విదేశీ శత్రువులు అమెరికాలోని ఓ నగరాన్ని ఆక్రమించడానికి తాను అంగీకరించనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ చెత్తకుప్పలా మారిందని అన్నారు. ఆ నగరంలోని పలు ప్రాంతాలు క్రిమినల్స్ ఆధీనంలో ఉన్నాయని ఆరోపించారు. అక్కడ సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు అన్నిరకాల వనరులను వినియోగిస్తామని తెలిపారు.
అమెరికాలో వలసదారుల ఏరివేత- ట్రంప్ చర్యలతో భగ్గుమన్న లాస్‌ఏంజెల్స్
రగులుతున్న లాస్ ఏంజెలెస్- 700 మెరైన్స్ మోహరింపు- అదనంగా 2000 నేషనల్ గార్డ్స్ కూడా!