Israel Attack On Gaza : గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గాజా పట్టీపై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో హమాస్ కీలక నేత సహా 19 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐరోపా, కువైట్ ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఖాన్ యూనిస్ సమీపంలో జరిగిన దాడిలో తమ రాజకీయ బ్యూరో సభ్యుడైన సలా బర్దావిల్ మరణించారని హమాస్ స్వయంగా ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడుల్లో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బర్దావీల్, అతడి భార్య చనిపోయినట్లు పాలస్తీనా మీడియా తొలుత వెల్లడించింది. మిలిటెంట్ సంస్థకు చెందిన మీడియా సలహాదారు తాహెర్ అల్ నోనో సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. బర్దావీల్, అతడి భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడికి గురై చనిపోయినట్లు తెలిపారు. ఇది తమ సంకల్పాన్ని విచ్ఛిన్నం చేయలేదని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. మిలిటెంట్ సంస్థకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్ అధిపతి ఒసామా తబాష్‌ను తమ బలగాలు హతమార్చాయని టెల్‌అవీవ్ శుక్రవారం ప్రకటించింది.
మరోవైపు యెమెన్‌కు చెందిన హూతీ రెబల్స్ సాయంతో, హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై క్షిపణిని ప్రయోగించారు. దాన్ని ఇజ్రాయెల్ సమర్ధంగా కూల్చివేసింది. క్షిపణిని ప్రయోగించిన సమయంలో ఇజ్రాయెల్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. గత వారం హమాస్‌తో ఇజ్రాయెల్ తన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ముగించింది. ఆ తర్వాత గాజాపై ఆకస్మిక వైమానిక దాడులను ప్రారంభించింది. దీని ఫలితంగా ఆ భూభాగం అంతటా వందలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఈ క్రమంలో పాలస్తీనియన్లకు సంఘీభావంగా ఇజ్రాయెల్‌పై హూతీలు తమ దాడులను తిరిగి ప్రారంభించారు.
ఇదిలా ఉండగా హెజ్‌బొల్లా- ఇజ్రాయెల్ మధ్య గత నవంబరులో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందమూ ఉల్లంఘనకు గురైంది. శనివారం లెబనాన్ నుంచి ఆరు రాకెట్లు తమ భూభాగంలోకి దూసుకొచ్చాయని ఐడీఎఫ్ ఆరోపిస్తూ, దక్షిణ లెబనాన్‌పై బాంబుల వర్షం కురింపిచింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారని, 12 మందికి గాయాలయ్యాయని అక్కడి అధికారులు తెలిపారు.