Israel Attack On Gaza : ఇజ్రాయెల్ దాడులతో గాజాపట్టి మళ్లీ దద్దరిల్లుతోంది. రెండ్రోజులక్రితం దాడులు మొదలుపెట్టిన ఇజ్రాయెల్ సైన్యం వాటిని మరింత విస్తరించింది. మళ్లీ భూతల దాడులు మొదలుపెట్టింది. మంగళవారం 400 మందికిపైగా చనిపోగా తాజాగా మరో 85మంది మృతి చెందినట్లు హమాస్ ప్రకటించింది. బందీల విడుదలకు హమాస్ నిరాకరించినందునే మళ్లీ దాడులు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ దాడులను తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్న హమాస్ ఇది బందీల ప్రాణాలను ప్రమాదంలోకి పడేస్తుందని హెచ్చరించింది.
గాజాలో పాక్షికంగా స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో భూతల దాడులు జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజాలో సెక్యూరిటీ జోన్ విస్తరించటంతోపాటు ఉత్తర, దక్షిణ గాజా మధ్య పాక్షిక బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా మధ్య, దక్షిణ గాజాపట్టీలో భూతల దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నెట్‌జరిమ్ కారిడార్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరో 85మంది మృతి చెందారు. వారిలో 65మంది ఉత్తర, మధ్య గాజాలో మిగితా 20 మంది దక్షిణ గాజాలోని రఫా, ఖాన్‌యూనిస్ నగరాల్లో చనిపోయినట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ దాడులపై హమాస్ తీవ్రంగా మండిపడింది. తాజా దాడులను ప్రమాదకర ఉల్లంఘనగా పేర్కొంది. జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తాము ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్లు హమాస్ పేర్కొంది. బందీలందరినీ తిరిగివ్వడానికి ఇదే చివరి అవకాశమని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఇక మంగళవారం ఐడీఎఫ్ భారీ స్థాయిలో నిర్వహించిన వైమానిక దాడుల్లో400 మందికిపైగా చనిపోయారు. వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ దాడులతో ఇజ్రాయెల్-హమాస్ మధ్య 2నెలలుగా కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందానికి కాలం చెల్లినట్లయింది. మిగతాబందీల విడుదలకు హమాస్ నిరాకరించటమే కాకుండా మధ్యవర్తుల ప్రతిపాదనలను తిరస్కరించినందుకు గాజాపై తిరిగి దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై హమాస్ తీవ్రంగా స్పందించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏకపక్షంగా ఉల్లంఘించారని ఆరోపించింది.