Israel Effect On Irans Nuclear Plan : ఇరాన్‌కు చెందిన మరో ముగ్గురు కమాండర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్‌పై తమ యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో వాళ్లు హతమయ్యారని వెల్లడించింది. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌తో ఇరాన్‌ను సమన్వయం చేసే రెవల్యూషనరీ గార్డ్ విభాగం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న సయీద్ ఇజాదీని ఖోమ్ పట్టణంలో హతమార్చామని తెలిపింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన మరో ఇద్దరు కమాండర్లు కూడా తమ దాడుల్లో చనిపోయారని పేర్కొంది. జర్మనీ ఓ వార్తాపత్రిక ‘ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడేన్ సార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఇరాన్ అణుబాంబు తయారీ ప్రణాళికలో దాదాపు రెండు నుంచి మూడేళ్లు జాప్యం జరుగుతుందన్నారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణు ముప్పును తొలగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై తమ దాడి కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఇస్తాంబుల్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 350 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. మృతిచెందిన వారిలో మిలిటరీ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలతో పాటు పెద్దసంఖ్యలో సాధారణ పౌరులు ఉన్నారని తెలిపింది. అయితే ఇరాన్‌లో చనిపోయిన వారి సంఖ్య 657కుపైనే ఉంటుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శనివారం తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు. శని, ఆదివారాల్లో (జూన్ 21-22) అక్కడ జరగనున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల 51వ సదస్సులో అబ్బాస్ అరగ్చి పాల్గొననున్నారు. ‘‘మారుతున్న ప్రపంచంలో ఓఐసీ’’ అనే థీమ్‌తో ఈసారి సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధమే ప్రధాన ఎజెండాగా ఉందని సమాచారం.
అరగ్చితో ‘ఐరోపా’ విదేశాంగ మంత్రులు-స్పందించిన ట్రంప్
అంతకుముందు శుక్రవారం రోజు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చితో యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. అణు ఒప్పందం గురించి అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించాలని అరగ్చిని వారు కోరారు. దాడుల విరమణ అంశాన్ని పక్కన పెట్టి ఈ సైనిక ఘర్షణలోని అన్ని పక్షాలు (అమెరికా సహా) చర్చలను మొదలుపెడితే బాగుంటుందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్ తెలిపారు. ఈ సమావేశం తర్వాత అబ్బాస్ అరగ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగినన్ని రోజులు, ఇక అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ వ్యవహారంలో ఐరోపా దేశాలు ఏమీ చేయలేవన్నారు. ఐరోపా దేశాలతో ఇరాన్ మాట్లాడదని, తమతోనే మాట్లాడుతుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చల కోసం, దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌కు చెప్పేది లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఎవరైనా గెలవబోతుంటే, అడ్డుకోవడం కష్టతరమైన అంశమన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దంలోకి ఎంట్రీ ఇచ్చే అంశంపై రెండువారాల్లో ఒక నిర్ణయానికి వస్తానని ఇటీవలే ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.
యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ? ఇరాన్‌పై సైనిక చర్యపై వైట్‌హౌజ్ కీలక ప్రకటన
ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవానికి ఆధ్యుడు - సినిమాను తలపించే సుప్రీం లీడర్ ఖమేనీ ఫ్లాష్ బ్యాక్!