Iran Attacks US Base : పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలపై దాడి చేసింది. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. అమెరికాకు సర్వశక్తులతో బదులిస్తామని హెచ్చరించిన ఇరాన్, అందుకు తగ్గట్లే దోహాలోని యూఎస్ స్థావరంపై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధ్రువీకరించింది.
గగనతలాన్ని మూసేసినట్లు ఖతర్ ప్రకటించిన కాసేపటికే పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ ప్రకటించింది. అంతే కాదు ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిచువేషన్ రూమ్‌కు వెళ్లారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై గమనించారు. శక్తిమంతమైన మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి.
ఇరాన్ దాడులను తిప్పికొట్టాం: ఖతార్
తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిసైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అల్-ఉదీద్ ఎయిర్ బేస్‌పై క్షిపణి దాడిని తాము అడ్డుకున్నట్లు పేర్కొంది. దాడులను ఖండించింది. ఇరాన్ దురాక్రమణకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని హెచ్చరించింది.యుద్ధం తాము ప్రారంభించలేదని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ తెలిపారు. దాడులు చేపట్టకముందు ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఖతార్‌కు సంఘీభావం తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
ఇరాన్ ప్రతిదాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పందించారు. ఖతార్‌కు సంఘీభావం ప్రకటించారు. ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపిన మెక్రాన్, వెంటనే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించారు. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని, చర్చలు ప్రారంభించాలని అన్నారు. అయితే ఖతార్‌లోని తమ మిలిటరీ స్థావరాలను ఇరాన్ క్షిపణులు తాకలేదని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు.
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సోమవారం కూడా హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రారంభించింది అగ్రరాజ్యమని, కానీ తాము ముగింపు పలుకుతామాని పేర్కొంది. ఈ క్రమంలో త్వరలోనే పశ్చిమాసియాలోని తమ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టే అవకాశం ఉందని అమెరికా వర్గాలు ఇటీవల అంచనా వేశాయి. 48 గంటల్లో దాడులు చేస్తాయని చెప్పాయి. ఇంతలోనే టెహ్రాన్ ప్రతీకార దాడులు చేసింది.
పశ్చిమాసియాలో దాదాపు 40 వేలమంది సైనికులను అమెరికా మోహరించింది. ఈజిప్టు, ఇరాక్, జోర్డాన్, ఖతార్, సిరియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని దాదాపు 19 ప్రాంతాల్లో వాషింగ్టన్ సైనిక స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 వేల మంది సైనికులు ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్‌లో ఉంటారు. దానినే ఇరాన్ టార్గెట్‌గా చేసుకుంది!