Iran Israel Were Once Friends Now Sworn Enemies : ఇజ్రాయెల్-ఇరాన్ ఈ రెండు దేశాల పేర్లు చెబితే బద్ధ శత్రువులని ఎవరైనా చెబుతారు. కానీ ఒకప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మంచి మిత్రులు. ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు చాలా ముస్లిం దేశాలు నిరాకరించినప్పుడు తుర్కియేతో పాటు ఇరాన్ గుర్తించాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఆయుధాలు, చమురు రవాణా, పరస్పర ఇంటెలిజెన్స్ సహకారం ఉండేవి. 1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు బద్ధ శత్రువులుగా మారిపోయాయి.
ఇరాన్-ఇజ్రాయెల్ ఒకప్పుడు మిత్ర దేశాలు. తుర్కియే తర్వాత ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరాన్. 1948 నుంచి ఇజ్రాయెల్‌తో ఇరాన్‌కు సత్సంబంధాలే ఉండేవి. రెండు దేశాల మధ్య ఆయుధాలు, చమురు రవాణ ఇంటెలిజెన్స్ ఇచ్చిపుచ్చుకోవడం వంటివి జరిగేవి. కానీ 1979లో రాచరిక పాలనకు వ్యతిరేకంగా ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవం ఈ రెండు దేశాల సంబంధాలను అనూహ్య మలుపు తిప్పింది. ఇస్లామిక్ విప్లవానంతరం ఇరాన్‌లో అధికారంలోకి వచ్చిన నేతలు ఇజ్రాయెల్ అస్తిత్వాన్నే ప్రశ్నించడం ప్రారంభించారు. ఇజ్రాయెల్ ఉనికి పశ్చిమాసియాలో ప్రమాదకరమని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య పరోక్ష యుద్ధం కొనసాగుతూనే ఉంది.
1979 తర్వాత ఇజ్రాయెల్ పాస్‌పోర్టులను అంగీకరించేందుకు ఇరాన్ నిరాకరించింది. పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆధీనంలోని ప్రాంతాలకు వెళ్లకుండా తమ ప్రజలపై ఇరాన్ నిషేధం విధించింది. ఇస్లాంకు ఇజ్రాయెల్ వ్యతిరేకమని ప్రకటించింది. 1980, 1990లలో సాయుధ గ్రూపులకు ఇరాన్ స్పాన్సర్ చేసింది. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, యెమెన్‌లోని హూతీలు, గాజాలోని హమాస్ వంటి గ్రూపులకు నిధులు సమకూర్చింది. అంతేకాకుండా వారికి శిక్షణ కూడా ఇచ్చి ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రోత్సహించింది. ఈ పరిణామాలు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దూరాన్ని మరింత పెంచాయి.
మరోవైపు ఇజ్రాయెల్ తమ దేశానికి ముప్పుగా భావించే ఇరాన్ సైన్యానికి చెందిన కీలక అధికారులను, ఆ చోట ఆశ్రయం పొందుతున్న ఉగ్ర నేతలను మట్టుబెడుతూ వచ్చింది. ఇరాన్ అణుశాస్త్రవేత్తలనూ వదిలిపెట్టలేదు. ఈ పరిణామాలతో ఇరాన్-ఇజ్రాయెల్ దేశాలు బద్ధ శత్రువులుగా మారిపోయాయి. 2023 అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధంతో రెండు దేశాల మధ్య శత్రుత్వం పతాకస్థాయికి చేరుకుంది. తాజాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడి చేయడంతో రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
'టెహ్రాన్‌ను తగలబెట్టేస్తాం'- ఇరాన్‌కు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి డెడ్లీ వార్నింగ్