Indus River Waters Agreement : సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాకిస్థాన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత్ స్పష్టం చేసింది. జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెరుగుతున్న ఉగ్రవాదం వంటి కారణాల దృష్ట్యా ఈ ఒప్పందాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. కిషన్ గంగా, రాటిల్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
కారణం ఇదే!
భారత్, పాకిస్థాన్ మధ్య గత కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింధు నదీ జలాల ఒప్పందం- ఐడబ్ల్యూటీ (IWT)ని సవరించుకుందామంటూ పాకిస్థాన్‌కు భారత్ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వస్తున్న ప్రాథమిక, ఊహించలేని మార్పులు కారణంగా ఒప్పందాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని భారత్ వెల్లడించింది. ఐడబ్ల్యూటీలోని ఆర్టికల్ 12 అధికరణం 3 ప్రకారం, ఆగస్టు 30న పాక్‌కు అధికారిక నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా జనాభా పెరుగుదల, పర్యావరణ సమస్యలు, భారతదేశ ఉద్గార లక్ష్యాలను చేరుకోవడానికి క్లీన్ ఎనర్జీ అభివృద్ధిని వేగవంతం చేయడం వంటి కారణాల కారణాల దృష్ట్యా ఒప్పందాన్ని సమీక్షించుకోవాలని వెల్లడించాయి. సరిహద్దుల్లో పెరుగుతున్న ఉగ్రవాద సమస్యలు కూడా నోటీసు జారీ చేయడానికి కారణమని తెలిపాయి. కిషన్‌గంగా, రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న విభేదాలను పరిష్కరించుకునేందుకు గత ఆరేళ్లుగా దాయాది దేశం చర్చలకు నిరాకరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఈ నోటీసును పంపాల్సి వచ్చిందని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
శాంతియుత పరిష్కారమే మార్గం!
ఈ సమస్యకు శాంతియుత పరిష్కారాన్ని అన్వేషించాలని భారత్ దాయాది పాక్‌కు సూచించింది. అయితే, పాక్ ఒత్తిడి మేరకు గతంలో ప్రపంచ బ్యాంక్ తటస్థ నిపుణుడి అభ్యర్థన, మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియ రెండింటిని ప్రారంభించింది. ఒకే అంశంపై రెండు సమాంతర చర్యలుచేపట్టడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని భారత్‌ఆరోపించింది. వివాద పరిష్కార యంత్రాంగాన్ని కూడా పునఃపరిశీలించాలని భారత్ కోరింది.
ఇదీ ఒప్పందం
సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్, పాక్ మధ్య 1960 సెప్టెంబరు 19న ఒక ఒప్పందం జరిగింది. దీనిపై భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ సంతకాలు చేశారు. తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి. సింధు నదీ జలాల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు దక్కాయి. రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు.