Indians Get Singapore Lifesaver Award : సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం నుంచి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడితో పాటు పలువురుని కాపాడిన కార్మికులకు అక్కడి ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. నలుగురు భారతీయ కార్మికులతో సహా 18మందికి 'లైఫ్ సేవర్' అవార్డును ప్రదానం చేసింది. వారి ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించినందుకు ఈ అవార్డును ఇచ్చినట్లు సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ తెలిపింది.
సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపంలోని రివర్ వ్యాలీ రోడ్‌లో గల ఓ మూడంతస్తుల భవంతిలో ఏప్రిల్ 8 ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 మంది పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. ప్రమాదం సమయంలోనే ఈ వలస కార్మికులు ఘటనాస్థలికి సమీపంలోనే పని చేస్తున్నరు. భవనం నుంచి పిల్లల అరుపులు వినపడటం, మూడో అంతస్తు నుంచి పొగలు రావడం గమనించి వెంటనే రంగంలోకి దిగారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ సంఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే ఆ 18 మంది వ్యక్తులు దాదాపు 10మందిని రక్షించి చికిత్సను అందించారు.
ఈ అగ్నిప్రమాదంపై కార్మికులు మాట్లాడుతూ, వెళ్లి చూసేసరికి గదిలో పిల్లలు భయంతో వణుకుతూ, అరుస్తూ కనిపించారని చెప్పారు. ' మూడో అంతస్తు నుంచి కొందరు పిల్లలు దూకేయాలని చూశారు. మేం వాళ్లతో మాట్లాడి దూకకుండా చూశాం. తర్వాత వారిని కిందకు తీసుకొచ్చాం. మూడో అంతస్తుకు వరకు వెళ్లడానికి ప్రయత్నించామని, కానీ వెళ్లలేకపోయాం. తర్వాత ఎలాగోలా పిల్లలు ఉన్న గదికి వెళ్లాం. ఇక ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెను కాపాడలేకపోయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం' అని కార్మికులు విచారం వ్యక్తంచేశారు.
ఇక ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లకు కాలిన గాయాలతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ చూరింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మార్క్ ఆరోగ్య పరిస్థితిపై పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. అలాగే మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పలువురు పోస్టులు పెట్టారు. ప్రస్తుతం గాయపడిన మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.