Indian Embassy Issues Advisory For Nationals In Israel : పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు చాలా అప్రమత్తంగా ఉండాలని మన రాయబార కార్యాలయం తాజాగా అడ్వైజరీ జారీ చేసింది. కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని సూచించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది. భారత పౌరుల ప్రయాణాలకు సంబంధించి లెబనాన్‌లోని భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీచేసిన మరుసటి రోజు ఇజ్రాయెల్‌లోని కార్యాలయం మన పౌరులను అప్రమత్తం చేసింది.
‘‘ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు జాగ్రత్తగా వ్యవహరించండి. దేశంలో అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండండి. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. మన దేశ పౌరుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషల్లోనూ అడ్వైజరీ జారీ చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన నంబర్లను పోస్టు చేసింది.
హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురయ్యారు. మరోవైపు హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. ఇక, లెబనాన్‌లోని హెజ్‌బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్ర్ ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతిచెందినట్లు వెల్లడైంది. ఈ వరుస పరిణమాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఇరాన్ , దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్)పై ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉంది. దీంతో ఐడీఎఫ్ అప్రమత్తమైంది. మరోవైపు, టెల్ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా కూడా రంగంలోకి దిగింది. పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది.
అమెరికా సిబ్బందితో పాటు ఇజ్రాయెల్ రక్షణ కోసం అదనపు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను అగ్రరాజ్యం పంపించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వీటితో పాటు బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యం కలిగిన అదనపు క్రూజర్లు, డిస్ట్రాయర్లను కూడా పంపించేందుకు పెంటగాన్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.