India Opposes ADB Financing To Pak : పాకిస్థాన్‌కు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ఆర్థిక సాయం అందిస్తుండటాన్ని భారత్ మరోసారి తీవ్రంగా వ్యతిరేకించింది. ఏడీబీ నుంచి రుణంగా పొందే నిధులను పాక్ దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపించింది. ఆ నిధులతో పాకిస్థాన్ సైనిక వ్యయాలు చేసే ముప్పు ఉందని భారత్ పేర్కొంది. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేస్తామని గతంలో ఏడీబీకి ఇచ్చిన హామీలను పాక్ ఎంతమేరకు నెరవేర్చిందని నిలదీసింది. ఈమేరకు పాక్‌పై తమకు ఉన్న ఆందోళనలను ఏడీబీ ఉన్నతాధికారులకు తెలియజేశామని భారత అధికార వర్గాలు వెల్లడించాయి. పాక్‌కు రుణాలపై భారత్ వ్యక్తం చేసిన ఈ ఆందోళనలపై ఇప్పటి వరకైతే ఏడీబీ స్పందించలేదు. భారత్ లేవనెత్తిన ఈ అభ్యంతరాలు తదుపరి దశల్లో మరిన్ని రుణాల సమీకరణకు పాక్ చేసే ప్రయత్నాలకు ఆటంకాల్లా ఎదురునిలిచే అవకాశం ఉంది.
పాకిస్థాన్ జీడీపీలో పన్ను వసూళ్ల వాటా డౌన్
"పాక్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం తిరోగమనంలో ఉంది. అక్కడ పన్ను వసూళ్లు తగ్గిపోయాయి. ఏడీబీ నిధులను పాక్ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు బదులుగా సైనిక అవసరాలకు మళ్లించే అవకాశం ఉంది. గతంలోనూ ఏడీబీ నిధులను పాక్ దుర్వినియోగం చేసింది. అందుకే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది" అని ఏడీబీకి భారత అధికార వర్గాలు తెలిపాయి. "పాకిస్థాన్ జీడీపీలో పన్ను వసూళ్ల వాటా 2018 ఆర్థిక సంవత్సరం నాటికి 13.0 శాతంగా ఉండేది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది కాస్తా 9.2 శాతానికి తగ్గిపోయింది. ఆసియా పసిఫిక్ దేశాల జీడీపీలో పన్ను వసూళ్ల వాటా 19.0 శాతం దాకా ఉంది. కానీ పాక్‌లో ఇది చాలా తక్కువగా ఉంది. 2018 నుంచి 2023 మధ్యకాలంలో పాకిస్థాన్ ప్రభుత్వ రెవెన్యూ(రాబడి) తగ్గిపోగా, రక్షణరంగ వ్యయం పెరిగిపోయింది. సైనిక అవసరాలకు పాక్ వినియోగిస్తున్న నిధులు దేశీయంగా, అంతర్గతంగా సమకూర్చుకున్నవేం కాదు’’ అని భారత అధికార వర్గాలు ఏడీబీ ఉన్నతాధికారులకు వివరించాయి. "అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్థాన్ పాలసీ బేస్డ్ రుణాలను తీసుకుంటోంది. వాటిని సైనిక అవసరాలకు దారి మళ్లిస్తోంది. అలా జరగకుండా ఏడీబీ మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టాలి. రుణ నిధులను పాక్ ఎందుకు తీసుకుందో, అందుకు మాత్రమే వాడేలా పర్యవేక్షించాలి" అని ఏడీబీకి భారత ప్రభుత్వ వర్గాలు సూచించాయి.
పాక్‌లో ఆర్థిక సంస్కరణలకు ఆర్మీయే అడ్డుగోడ
"గతంలోనూ ఏడీబీ, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థల నుంచి తీసుకున్న రుణాలను పాక్ దుర్వినియోగం చేసింది. చాలా ఏళ్లుగా ఐఎంఎఫ్ నుంచి సహకారాన్ని పొందుతున్న పాక్, 24వ సారి దివాలా తీశామంటూ ఐఎంఎఫ్‌ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్ అందించే బెయిల్ అవుట్ ప్యాకేజీని పాక్ ఎలా వినియోగిస్తోందో పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది" అని భారత్ డిమాండ్ చేసింది. పాక్‌లో ఆర్థిక సంస్కరణలకు అక్కడి ఆర్మీయే ప్రధాన అడ్డుగోడగా నిలుస్తోందని ధ్వజమెత్తింది. "పాక్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో ఆర్మీ తలదూరుస్తోంది. పాక్‌లోని పౌర ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాలనూ ఆర్మీ ప్రభావితం చేస్తోంది. ఆ దేశ రాజకీయాల్లోనూ ఆర్మీయే ప్రధాన పాత్ర పోషిస్తోంది" అని భారత అధికార వర్గాలు ఆరోపించాయి. పాక్ సర్కారుకు చెందిన 'స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్'లోనూ ఆర్మీయే ప్రధాన పాత్ర పోషిస్తోందని ఏడీబీ ఉన్నతాధికారులకు భారత ప్రతినిధులు వివరించారు. పాక్ ప్రభుత్వ అడ్డదిడ్డమైన పాలనా వ్యవహారాల వల్ల ప్రాంతీయ శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాక్‌కు అప్పులిస్తే- ఏడీబీకే ముప్పు
పాక్‌లా నిధులు దుర్వినియోగం చేసే దేశాలకు అప్పులు ఇవ్వడం అనేది ఏడీబీ ఆర్థిక ఆరోగ్యానికి ముప్పును కొని తెస్తుందని భారత్ హెచ్చరించింది. పాకిస్థాన్ జీడీపీ, అప్పుల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉందని, క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉందని గుర్తుచేసింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) నిబంధనల అమలులో పాక్ విఫలమైందని భారత్ ధ్వజమెత్తింది. ఉగ్రవాద సంస్థలకు నిధులపై దర్యాప్తు, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన పాక్ ఉగ్రవాదుల విచారణ, ఉగ్రవాదుల నిధులను స్తంభింపజేయడం వంటి అంశాల్లో పాక్ విఫలమైందని భారత అధికార వర్గాలు ఆరోపించాయి.
భారత్, పాక్ నిఘా సంస్థలు కలిసి పనిచేస్తే ఉగ్రవాదం తగ్గుతుంది: బిలావల్ భుట్టో