India Humanitarian Aid To Myanmar : ఇటీవల తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాండలే, నేపిడాలో రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా శోధిస్తున్నారు. సహాయక చర్యల కోసం ఇప్పటికే "ఆపరేషన్ బ్రహ్మను" ప్రారంభించిన భారత్, తాజాగా రెస్క్యూ ఆపరేషన్ కోసం నాలుగు కాళ్లుండే రోబోటిక్స్ మ్యూల్స్‌ను, నానో డ్రోన్లను పంపింది. వీటి సాయంతో శిథిలాల కింద వెతుకుతున్నారు. సిబ్బంది వెళ్లలేని చోటుకి వీటిని పంపి గాలిస్తున్నారు.
#WATCH | Myanmar Earthquake | Under Operation Brahma, the Indian Signal Detachment has deployed SAR (Search and Rescue) Robo Mules and Nano Drones to enter damaged buildings in Myanmar for building intervention and casualty assessment.
— ANI (@ANI) April 10, 2025
(Source: Indian Army) pic.twitter.com/QtyWDyEZWk
భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
మయన్మార్‌లో గత నెల 28న సంభవించిన తీవ్ర భూకంపం కారణంగా 3,600 మందికి పైగా మరణించారు. ఇంకా పలువురు శిథిలాల కింద ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే శిథిలాల్లో చిక్కుకున్న వారిని భద్రతా బృందాలు వెలికితీయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అందులో భాగంగా రెస్క్యూ ఆపరేషన్ కోసం భారత ఆర్మీకి చెందిన సిబ్బంది అధునాతన సామగ్రిని వినియోగిస్తున్నారు. నాలుగు కాళ్లుండే రోబోటిక్స్ మ్యూల్స్‌తో శిథిలాల కింద వెతుకుతున్నారు. నానో డ్రోన్లతోనూ అణువణువూ గాలిస్తున్నారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి.
భారత్ ఆపన్నహస్తం!
భారత్ ఇప్పటికే ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా 31 టన్నుల సామగ్రిని సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో మయన్మార్‌కు పంపింది. మాండలేలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన భారత ఆర్మీ ఆసుపత్రికి అవసరమైన సామగ్రిని కూడా అందజేసింది. భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ ఆసుపత్రి భూకంప క్షతగాత్రులకు వైద్య సేవలను అందిస్తోంది. భారత నౌకాదళానికి చెందిన "ఐఎన్‌ఎస్ ఘరియాల్" వందల టన్నుల ఆహారాన్ని తిలావా ఓడరేవుకు చేర్చింది. మరోవైపు క్వాడ్ దేశాలైన భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లు- మయన్మార్‌ను ఆదుకునేందుకు ఇటీవల 20 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించాయి.
అతలాకుతలమైన మయన్మార్
గతనెల 28న రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం దెబ్బకు మయన్మార్ పూర్తిగా అతలాకుతలమైంది. దీనితో ఆ దేశానికి సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకువచ్చాయి. ఇటీవల బిమ్‌స్టెక్ సదస్సు సందర్భంగా థాయ్‌లాండ్‌కు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ మయన్మార్‌లోని ప్రజలను ఆదుకునేందుకు భారత్ తరఫున అన్నివిధాలా సాయం చేస్తామని బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్‌కు హామీ ఇచ్చారు.