India tariff Cuts on US Imports : ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రానున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రతీకార సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. అమెరికా దిగుమతులపై పన్నులు తగ్గించేందుకు భారత్ సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 23 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారత్ సుంకాల కోత విధించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందని దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించాయి.
రెండు దేశాల మధ్య కుదరనున్న వాణిజ్య ఒప్పందంలో భాగంగానే అమెరికా వస్తువులపై భారత్ సుంకాల కోత విధించే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దాదాపు 23 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన అమెరికా వస్తువులపై కోత విధిస్తుందని పేర్కొంది. అంటే అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఇవి సగంతో సమానం. అమెరికాకు భారత ఎగుమతులను దెబ్బతీసే ప్రతీకార సుంకాలను నిరోధించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన చర్చల దశలో ఉందని, దీనిపై భారత ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని రాయిటర్స్ వివరించింది.
ఆ వస్తువులపై నో టారిఫ్
సుమారు 66 బిలియన్ డాలర్ల విలువైన అంటే 87 శాతానికిపైగా ఎగుమతులపై అమెరికా ప్రతీకార సుంకాలు ప్రభావం చూపగలవని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ ప్రభావాన్ని నివారించడానికి అమెరికా వస్తువులపై సుంకాలు కోత విధించనున్నట్లు తెలుస్తోంది. 5 నుంచి 30 శాతం పన్ను విధిస్తున్న 55 శాతం అమెరికా దిగుమతులపై సుంకాలను తగ్గించడానికి భారత్ సిద్ధంగా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొన్ని వస్తువులపై సుంకాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. మరికొన్ని వస్తువులపై పూర్తిగా సుంకాలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాదంపప్పు, పిస్తా, ఓట్‌మిల్, క్వినోవా వంటి వస్తువులపై సుంకాలను ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉంది. మాంసం, మెుక్కజొన్న, గోధుమలు, డైరీ ఉత్పత్తులపై ఎటువంటి కోతలు ఉండవు. ఆటోమెుబైల్ వస్తువులపై క్రమంగా సుంకాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. అమెరికా ప్రతీకార సుంకాలు ఔషధాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ పరికరాలు, యంత్రాలు వంటి కీలక ఎగుమతి పరిశ్రమలను దెబ్బతీస్తాయని భారత్ ఆందోళన చెందుతోంది.
అమెరికా, భారత్ మధ్య సుధీర్ఘ వాణిజ్య చరిత్ర ఉంది. ప్రపంచ వాణిజ్య సంస్థ లెక్కల ప్రకారం అమెరికా సుంకాల సగటు 2.2 శాతం ఉండగా, భారత టారిఫ్ సగటు 12 శాతంగా ఉంది. భారత్‌తో అమెరికాకు 45.6 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. ఈ ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య నెలకొన్న సుంకాల వివాదాలను పరిష్కరించుకోవడానికి ముందుస్తు వాణిజ్య ఒప్పంద చర్చలు ప్రారంభించాలని అంగీకరించాయి.