Shukla Axiom 4 Mission Ready : 41 ఏళ్ల తర్వాత భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా రోదసియాత్రకు సర్వం సిద్ధమైంది. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి మంగళవారం సాయంత్రం 5:52 గంటలకు నిమిషాలకు శుక్లా నింగిలోకి పయనం కానున్నారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజులు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. శుక్లా అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది.
నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియమ్-4 మిషన్ నింగిలోకి దూసుకెళ్లనున్నారు. యాక్సియమ్ స్పేస్ సంస్థ చేపట్టనున్న నాలుగో మావన సహిత అంతరిక్ష యాత్ర ద్వారా నలుగురూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు వెళ్లనున్నారు. అందుకే ఈ మిషన్‌కు యాక్సియమ్-4గా పేరు పెట్టారు. స్పేస్‌ఎక్స్ కొత్త డ్రాగన్ వ్యోమనౌక ద్వారా నలుగురు బయలుదేరిన 28 గంటల తర్వాత ISSకు చేరుకుంటారు. భారత కాలమానం ప్రకారం జూన్ 11న రాత్రి 10గంటలకు అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్ వ్యోమనౌక డాకింగ్ జరుగుతుంది. శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్‌కు చెందిన మరో నిపుణుడు స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ అంతరిక్ష కేంద్రానికి చేరిన తర్వాత వివిధ ప్రయోగాలు చేపట్టనున్నారు.
🚀 Countdown to liftoff!
— All India Radio News (@airnewsalerts) June 9, 2025
🚀The #Ax4 crew and @SpaceX teams successfully complete a full launch day rehearsal ahead of Tuesday’s mission to the @Space_Station.
🚀Indian astronaut #ShubhanshuShukla, serving as the mission pilot of the Axiom-4 (Ax4) commercial mission to the #ISS,… pic.twitter.com/YydwJPNcpp
అంతరిక్ష కేంద్రంలో 14రోజులు
యాక్సియమ్-4 మిషన్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చాలా కీలకంగా భావిస్తోంది. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ గతవారం యాక్సియమ్ స్పేస్‌ను సందర్శించి ప్రయాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శుక్లా సహా నలుగురు వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్‌లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు.ఈక్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. నలుగురు వ్యోమగాములు మొత్తం 14 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, విద్యార్థులు, అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో నలుగురు అంతరిక్షం నుంచే మాట్లాడనున్నారు.
అంతరిక్షంలోకి బయలుదేరనున్న వేళ నలుగురు తమ శిక్షణ, ఇతర వివరాలను పంచుకున్నారు. ఈ యాత్రకు తాము అన్ని రకాలుగా సిద్ధమయ్యాయమని, అంతా బాగుందని విట్సన్ చెప్పారు. ఏడాది పాటు ఇచ్చిన శిక్షణ పరివర్తన కలిగించేది తప్ప మరొకటికాదని శుక్లా అన్నారు. ఇదో అద్భుత ప్రయాణమని వివరించారు. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకెళ్తున్నట్లు శుక్లా తెలిపారు.
'నాకు తెలిసి ఈ మిషన్‌లో అన్ని కోణాలపై ఉత్సాహంగా ఉన్నాను. కేవలం కొద్దిమంది మాత్రమే చూసిన అనుకూలమైన పాయింట్ నుంచి మేము తొలిసారి భూమిని పరిశీలించడం ప్రారంభిస్తాం. తర్వాత సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మేము గాలిలో తేలుతాం. మీకు తెలుసా మనం ప్రతిరోజూ సులభంగా చేసే పనులైన నడక, నిద్ర, ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం వంటివి అంతరిక్షంలో ఉన్నప్పుడు చాలా భిన్నంగా మారిపోతాయి. ఆ అనుభవం కోసం నేను ఎదురుచూస్తున్నా' అని శుక్లా అన్నారు.
India returns to space after 41 years 🇮🇳🚀
— Kwisatz Haderach (@Zoomerjeet) June 8, 2025
Group Captain Shubhanshu Shukla will be representing India on the Axiom-4 mission and will be conducting food and nutritional experiments on the ISS. He is also the Mission pilot. pic.twitter.com/XIFmzsEBvp
శుక్లాతో ఏడు ప్రయోగాలు
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా సహకారంతో ఇస్రో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సమన్వయంతో అంతరిక్షంలో ఆహారం, పోషకాలకు సంబంధించిన పరీక్షలను శుక్లా నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు ధీర్ఘకాల అంతరిక్ష యాత్రల్లో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు, అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకం కానున్నాయి. అంతరిక్షంలో శుక్లాతో మొత్తం ఏడు ప్రయోగాలను చేయించాలని ఇస్రో నిర్ణయించింది. అలాగే ఇతర క్రూమెంబర్లతో కలిసి నాసా చేపట్టే ఐదు సంయుక్త పరిశోధనల్లోనూ శుక్లా పాల్గొంటారు. ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై శుక్లా ప్రయోగాలు చేస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మెంతులు, పెసర్ల మొలకలను పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. మైక్రోబయాటిక్ పరిస్థితులకు విత్తనాలను గురిచేసి వాటిని తిరిగి భూమి మీదకు తెచ్చే తరాలపాటు సాగు చేసే ప్రణాళికలు రచించారు.
యాక్సియమ్-4 ద్వారా అంతరిక్షంలో శుక్లా సంపాదించే అనుభవాన్ని 2027లో చేపట్టే గగన్‌యాన్ మానవసహిత రోదసీయాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. యాక్సియమ్-4 మిషన్ కోసం ఇస్రో రూ.550 కోట్లు ఖర్చు చేస్తోంది. భారత వ్యోమగామి రాకేశ్ శర్మ 1984లో రష్యాకు చెందిన సోయజ్ మిషన్ ద్వారా రోదసీలోకి వెళ్లిన 41 ఏళ్ల తర్వాత మరో భారతీయుడు శుక్లా అంతరిక్ష యాత్ర చేయనుండడంతో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.