Trump Warning To Apple : ఐఫోన్ల తయారీ సంస్థ యాపిల్, యూరోపియన్ యూనియన్ (ఈయూ)లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఈయూ నుంచి అమెరికాకు జరిగే దిగుమతులపై 50 శాతం పన్నులు విధిస్తామని ఆయన ప్రకటించారు. జూన్ 1 నుంచే వాటిని అమల్లోకి తెస్తామన్నారు. చైనా, భారత్‌లలో ఐఫోన్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తున్న యాపిల్ కంపెనీకి కూడా ట్రంప్ షాకిచ్చారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే యాపిల్ ఉత్పత్తులపై 25 శాతం దాకా పన్నులు విధిస్తామని ఆయన తెలిపారు. అమెరికాలో తయారయ్యే ఉత్పత్తులపై పన్నులేం ఉండవన్నారు. ఈమేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు.
"ఇండియాలో తయారు చేస్తే కుదరదు"
"ఐఫోన్లు, దాని అనుబంధ టెక్ ఉత్పత్తులను అమెరికాలోనే తయారు చేస్తే మంచిది. ఒకవేళ కుదరదు అంటే దిగుమతులపై కనీసం 25 శాతం పన్నును అమెరికా ప్రభుత్వానికి యాపిల్ చెల్లించాల్సి ఉంటుంది. చాలా కాలం క్రితమే నేను యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్‌కు ఒక విషయం క్లియర్‌గా చెప్పాను. అమెరికాలో విక్రయించే ఐఫోన్లు అన్నీ అమెరికాలోనే తయారు కావాలన్నాను. ఎక్కడో ఇండియాలో లేదా మరోచోట వాటిని తయారు చేస్తే 25 శాతం పన్ను కట్టేందుకు సిద్ధం కావాలన్నాను" అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.
ఈయూతో అమెరికా చర్చలపై ట్రంప్ అసహనం
"ఈయూ మాకు చాలా పాత మిత్రపక్షం. అయినా దిగుమతి సుంకాలపై వాళ్లతో అమెరికా చర్చలు ఎంతకూ కొలిక్కి రావడం లేదు. మాతో అంతగా పొసగని చైనా కూడా రాజీకి వచ్చింది.మేం 30 శాతం దిగుమతి సుంకాలు వేస్తామంటే ఓకే చెప్పింది. ఈయూ వెంటనే రాజీకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్‌పై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించాలని నేను సిఫారసు చేస్తున్నాను" అని ట్రంప్ ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ సర్కారు విధిస్తున్న భారీ దిగుమతి సుంకాల వల్ల తమ వ్యాపారాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయని ఇటీవలే అమెజాన్, వాల్‌మార్ట్ లాంటి పలు అమెరికా దిగ్గజ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ట్రంప్ తాజా చర్యలతో ఇక యాపిల్ కూడా టారిఫ్ బాధిత కంపెనీల జాబితాలో చేరనుంది.
హార్వర్డ్‌లోకి విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై బ్యాన్- చైనా ఆగ్రహం
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంపై ట్రంప్ సర్కారు నిషేధం విధించడాన్ని చైనా ప్రభుత్వం ఖండించింది. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాల వల్ల అమెరికా అంతర్జాతీయ ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందని వ్యాఖ్యానించింది. "విద్యా రంగంలో పరస్పర సహకారం వల్ల అమెరికా, చైనా రెండింటికీ ప్రయోజనం కలుగుతుంది. అయితే విద్యా రంగాన్ని కూడా అమెరికా ప్రభుత్వం రాజకీయం చేయడాన్ని చైనా వ్యతిరేకిస్తుంది" అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. "చైనా విద్యార్థులు, మేధావుల హక్కులు, ప్రయోజనాల పరిరక్షణకు మేం ప్రాధాన్యత ఇస్తాం. అందుకోసం చర్యలు చేపడుతాం" అని ఆమె వెల్లడించారు. బీజింగ్‌లో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను మావో నింగ్ తెలిపారు.
హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్లు కోల్పోయిన చైనా విద్యార్థులకు సీట్లు ఇచ్చేందుకు తాము సిద్ధమని హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకటించింది. బేషరతుగా వారందరికీ తమ వర్సిటీలో వెంటనే సీట్లు ఇస్తామని పేర్కొంది. అయితే ఈ వర్సిటీ చేసిన ప్రకటనపై చైనా సోషల్ మీడియాలో పలువురు సెటైర్లు వేస్తూ పోస్ట్‌లు పెట్టారు. చైనాలోని హార్బిన్ నగరంలో యూనివర్సిటీ తెరుచుకుంది. వచ్చేయండి అంటూ కొందరు ఫన్నీగా పోస్ట్‌లు పెట్టారు. ఈ పోస్ట్‌లోనే త్వరలో ఓపెన్ కాబోతున్న ఆ వర్సిటీ పేరు హార్వర్డ్ అని చైనా భాషలో రాశారు.
రాజీనామా యోచనలో బంగ్లాదేశ్ ప్రభుత్వాధినేత యూనస్- ఆర్మీ ఒత్తిడే కారణమా?
హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు 'నో' అడ్మిషన్- ట్రంప్ సర్కారు నిర్ణయం