China Revenge Tariffs On US Imports : యూఎస్- చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఎగుమతులపై 145 శాతం విధించినందుకు ప్రతీకారంగా, చైనా శుక్రవారం అమెరికా దిగుమతులపై సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచింది.
ఇంతకు ముందు అమెరికన్ దిగుమతులపై చైనా 84 శాతం వరకు సుంకాలు విధించింది. దీనితో యూఎస్ దిగుమతులపై చైనా కొన్ని ఆంక్షలు విధించింది. తరువాత ఈ సమస్య పరిష్కారానికి డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలు జరపడానికి కూడా సిద్ధమైంది. కానీ ట్రంప్ చైనా ఉత్పత్తులపై విధించే సుంకాలను 145 శాతానికి పెంచుతూ కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ట్రంప్ మొండి వైఖరితో చైనా తీరులో మార్పు వచ్చింది. తాము ఎక్కడా తగ్గబోమని స్పష్టం చేసింది. తాజాగా అమెరికా దిగుమతులపై సుంకాలను 125 శాతానికి పెంచేసింది. శనివారం నుంచే ఇవి అమల్లోకి వస్తాయని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
నంబర్ గేమ్!
ట్రంప్ టారిఫ్‌లను ఒక నంబర్ గేమ్‌గా అభివర్ణించిన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ, దీని వల్ల తమపై ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ ప్రతీకార సుంకాలకు ఆచరణాత్మక ప్రాధాన్యత లేనిదని, దీర్ఘకాలంలో రెండు దేశాలపైనా ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. చైనా వస్తువులపై విధించిన ప్రతీకారర సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని కోరింది. అంతేకాదు ఇకపై ట్రంప్ వేసే టారిఫ్‌లను తాము పట్టించుకోమని స్పష్టం చేసింది.
చైనా దావా
అమెరికా సుంకాలు పెంచడంపై తాము కూడా డబ్ల్యూటీఓలో దావా వేసినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, అమెరికా టారిఫ్ నోటిఫికేషన్ ప్రకారం, చైనాపై మొత్తం వాణిజ్య సుంకాలు 145 శాతంగా ఉన్నాయి. దీనితో చైనీయుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థలు లేదా కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది.
తగ్గేదేలే!
ట్రంప్ రివెంజ్ టారిఫ్‌లపై చైనా ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేసింది. బెదిరింపులకు తాము లొంగేది లేదని పేర్కొంది. అమెరికా సుంకాల యుద్ధమే చేయాలనుకుంటే, తుది వరకు తాము పోరాడతామని చైనా వాణిజ్యశాఖ అధికార ప్రతినిధి యాంగ్‌కియాన్ తేల్చిచెప్పారు. 'చైనాతో డీల్ చేయాలంటే, ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేయడం సరైన మార్గం కాదు. రెండు దేశాలు కలిసి కూర్చుని విభేదాల పరిష్కారానికి కృషి చేయాలని ఆశిస్తున్నాం. పరస్పర గౌరవం అనే సిద్ధాంతాల ఆధారంగానే చర్చలు జరగాలి' అని యాంగ్‌కియాన్ అన్నారు.
జిన్‌పింగ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!
ట్రంప్ టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మొదటిసారి స్పందించారు. అమెరికా విధించిన 145 సుంకాలు ఏకపక్ష బెదిరింపు అని అన్నారు. ఇలాంటి బెదిరింపులను ప్రతిఘటించడానికి ఐరోపా యూనియన్ (ఈయూ) తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు. అప్పుడే చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందన్నారు. దీని వల్ల అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కాపాడవచ్చని చెప్పారు. బీజింగ్‌లో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో భేటీ సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ట్రంప్ చైనా, భారత్‌తో సహా చాలా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. కానీ ఏ దేశం కూడా యూఎస్‌పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధపడలేదు. కానీ ఒక్క చైనా మాత్రం అమెరికాను ఢీకొంటూ పోటాపోటీగా ప్రతీకార సుంకాలు విధిస్తోంది.