Muhammad Yunus mulls resignation : బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు కలిసి రాకపోవడం, మరోవైపు పక్కలో బల్లెంలా ఎన్నికలను నిర్వహించాలని ఆర్మీ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజీనామా గురించి ఆలోచిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ పార్టీ చీఫ్ నిద్ ఇస్లాం చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
యూనస్ రాజీనామా గురించి తాను కూడా వింటున్నానని, ఇదే విషయంపై చర్చించడానికి తాను ఆయన దగ్గరికి వెళ్లినట్లు ఇస్లాం 'బీబీసీ'తో పేర్కొన్నారు. అయితే రాజీనామా గురించి తాను ఆలోచిస్తున్నది నిజమే అని యూనస్ చెప్పారని వివరించారు. రాజకీయ పార్టీలు ఒకే తాటిపైకి రాకపోతే తాను ఒక్కడిని ఏమీ చేయలేనన్న అభిప్రాయన్ని ఇస్లాంతో యూనస్ వ్యక్తం చేసినట్లు బీబీసీ బంబ్లా నివేదించింది.
గత ఏడాది ఆగస్టు 5, 2024న షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో భారీ నిరసనలు జరిగాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో షేక్ హసీనా దేశం విడిచి భారతదేశానికి వచ్చారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్‌ను విద్యార్థి నాయకులు, ఆర్మీ, ఇతర రాజకీయ పార్టీలు నియమించారు.
వాస్తవానికి డిసెంబర్‌లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జనరల్ వకీర్ ఉజ్ జమాన్ ఇప్పటికే యూనస్‌కు అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ నాయకురాలు ఖలీదా జియా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో యూనస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆర్మీకి నచ్చలేదు. దీంతో ఆర్మీ చీఫ్‌కు యూనస్‌కు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. వాస్తవానికి షేక్ హసీనా ప్రభుత్వం కూలిన ఆర్మీ చీఫ్‌కు యూనస్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. రానురానూ అవి సన్నగిల్లుతూ వచ్చాయి. ఇంతలో, దేశంలో తీవ్రమైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక సవాళ్లు యూనస్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముట్టిన నేపథ్యంలో తాను ఇక ప్రభుత్వాధినేతగా కొనసాగలేనని యూనస్ విద్యార్థి పార్టీ నాయకుడు ఇస్లాంతో చెప్పినట్లు తెలుస్తోంది.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్‌ను నిషేధించాలని మే 10న బంగ్లాదేశ్‌లో ఒక పెద్ద నిరసన జరిగింది. ఢాకాలో మళ్ళీ నిరసనలు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ వాతావరణం, నిరసనల కారణంగా తాను పని చేయలేకపోతున్నానని యూనస్ చెప్పినట్లు సమాచారం. ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసి రాకపోతే తాను రాజీనామా చేయడం కంటే గత్యంతరం లేదన్న యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. యూనస్‌తో కలిసి ప్రభుత్వంలోకి వచ్చిన చాలామంది నాయకులు ఇప్పటికే రాజీనామా చేశారు. తాను కూడా ఇక పదవిలో కొనసాగడానికి ఇష్టపడటం లేదని, అందుకే కొత్త తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యూనస్ విద్యార్థి నాయకులను కోరినట్లు సమాచారం. యూనస్ రాజీనామా వార్తలపై నిపుణులు మరో విధంగా స్పందిస్తున్నారు. యూనస్‌పై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తానని బెదిరించి మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.