Anti War Protests in US : ఇరాన్‌పై అమెరికా దాడుల తర్వాత న్యూయార్క్ నగరంలో యుద్ధ వ్యతిరేక నిరసనలు జరిగాయి. అమెరికా ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్‌లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ అణు కేంద్రాలపై శనివారం రాత్రి అమెరికా దాడులు నిర్వహించింది. అయితే దాడులకు వ్యతిరేకంగా నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా అనేక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఆదివారం వందల మంది రోడ్లపైకి వచ్చి న్యూయార్క్ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. పాలస్తీనియా జెండాలను పట్టుకుని 'హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్', 'ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపండి' అనే ప్లకార్డులు ప్రదర్శించారు. అలాగే నిరసనకారులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితికి ఇజ్రాయెల్ కారణమని ఆరోపణలు గుప్పించారు. గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక దాడులపై కూడా గళమెత్తారు.
#WATCH | New York, US | Anti-war protests staged in New York City following the US strikes on Iran.
— ANI (@ANI) June 22, 2025
Major cities in the US, including New York, are on high alert following airstrikes on Iranian nuclear facilities. pic.twitter.com/gVtsTUgAw6
ఆందోళనల నేపథ్యంలో న్యూయార్క్ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. 'ఇరాన్‌లోని ప్రస్తుత పరిణామాలను మేం దగ్గరగా గమనిస్తున్నాం. భద్రతా దృష్టితో నగరంలోని మత, సాంస్కృతిక, దౌత్య స్థలాల్లో అదనపు బలగాలు మోహరించాం. ఫెడరల్ ఏజెన్సీలతో కలిసి సమన్వయం చేస్తున్నాం' అని పేర్కొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు, అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ అణు కేంద్రాలపై కచ్చితమైన వైమానిక దాడులు జరిపింది. ఈ విషయాన్ని ఆదివారం అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియా సమావేశంలో ధృవీకరించారు. ఇదొక అద్భుతమైన విజయవంతమైన ఆపరేషన్ అని హెగ్సెత్ పేర్కొన్నారు. 'మేం ఇరాన్ అణు ప్రోగ్రామ్‌ను ధ్వంసం చేశాం. తీవ్రంగా బలహీనపరచాం. ఈ దాడిలో ఇరాన్ సైనికులు లేదా ప్రజలపై మేము దాడి చేయలేదు. లక్ష్యం కేవలం అణు స్థావరాలే' అని పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. ఈ మిషన్‌లో 125 విమానాలు పాల్గొన్నాయని జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కేన్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో 7 బీ-2 స్టెల్త్ బాంబర్లు పాల్గొన్నాయి. ఇది ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్ అణు కేంద్రాలపై 13,608 కిలోల బస్టర్ బాంబులను జారవిడిచింది.
ఇరాన్‌పై అమెరికా 'మిడ్ నైట్ ఆపరేషన్' జరిగిందిలా! అణ్వాయుధాలపై రష్యా కీలక వ్యాఖ్యలు