China Visas To Indians : అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్న చైనా, ఇప్పుడు అనివార్యంగా భారతదేశానికి తన స్నేహ హస్తం చాస్తోంది. ఇందుకు సూచనగా భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం, 2025 జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 మధ్య భారతీయ పౌరులకు 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేసింది. ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందించడానికి చైనా చేస్తున్న ప్రయత్నంగా దీనిని చెప్పుకోవచ్చు.
స్నేహ పూర్వకంగా!
"ఈ ఏడాది చైనాను సందర్శించాలని అనుకుంటున్న భారతీయుల కోసం 2025 ఏప్రిల్ 9 నాటికి 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేశాం. భారతీయ స్నేహితులారా చైనాను సందర్శించండి. ఓపెన్‌గా, సురక్షితమైన, ఉత్సాహభరితమైన, నిజాయితీగల, స్నేహపూర్వక చైనా వాతావరణాన్ని అనుభవించండి. ఇదే మీకు మా స్వాగతం."
- జు ఫీహాంగ్, చైనా రాయబారి
As of April 9, 2025, the Chinese Embassy and Consulates in India have issued more than 85,000 visas to Indian citizens traveling to China this year. Welcome more Indian friends to visit China, experience an open, safe, vibrant, sincere and friendly China. pic.twitter.com/4kkENM7nkK
— Xu Feihong (@China_Amb_India) April 12, 2025
భారీగా పెరిగిన వీసాలు
గతంలో ఎన్నడూ లేని విధంగా చైనా ఇప్పుడు భారతీయులకు అధికంగా వీసాలు ఇస్తోంది. చైనా 2023 సంవత్సరం మొత్తానికి 1,80,000 ఇస్తే, ఈ 2025 మొదటి 4 నెలల్లోనే 85,000కు పైగా వీసాలు జారీ చేసింది. దీనికి ప్రధాన కారణం, గతేడాది చైనా వీసా దరఖాస్తు విధానాన్ని మార్చింది. అనేక సడలింపులు కూడా ఇచ్చింది.
ఈ నయా వీసా నిబంధనల ప్రకారం, భారతీయ దరఖాస్తుదారులు ఇకపై చైనా వీసా కోసం దరఖాస్తు సమర్పించే ముందు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వీసా కేంద్రాల్లోనే ఆ పని పూర్తి చేయవచ్చు. 180 రోజుల కంటే తక్కువ కాలం చైనాలో బస చేయడానికి వీసా కావాలన్నా, స్వల్పకాలిక, సింగిల్, డబుల్ ఎంట్రీ వీసాలు కావాలన్నా గతంలో వేలిముద్రలు, బయోమెట్రిక్ డేటాను అందించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. అంతేకాదు చైనా రాయబార కార్యాలయం వీసా దరఖాస్తు రుసుములను కూడా తగ్గించింది.
ట్రంప్ టారిఫ్ వార్
అమెరికా అధ్యక్షుడు పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించి వాణిజ్య యుద్ధం ప్రారంభించారు. దీనితో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దీనితో కాస్త వెనక్కు తగ్గిన ట్రంప్, చైనా మినహా మిగతా దేశాలకు 90 రోజులపాటు టారిఫ్ రిలీఫ్ ఇచ్చారు. కానీ చైనాపై సుంకాల మోత మోగించారు. చైనాపై ఏకంగా 145 శాతానికి సుంకాలు పెంచారు. దీనితో అమెరికాపై 125 శాతం మేర సుంకాలు విధించి చైనా ప్రతీకారం తీర్చుకుంది. దీనితో ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక శక్తుల మధ్య వాణిజ్య యుద్ధం తారస్థాయికి చేరింది.
ఈ నేపథ్యంలోనే అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో, తమకు మద్దతుగా నిలవాలని భారత్, సహా పలుదేశాలను చైనా కోరింది. భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యు జింగ్ గతవారం మాట్లాడుతూ, "చైనా, భారత్ ఆర్థిక, వాణిజ్య సంబంధం పరస్పర ప్రయోజనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే రెండు అతిపెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఇండియా, చైనాలు ఐక్యంగా ఉండి, అమెరికా వాణిజ్య యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలి" అని అన్నారు.
ఖర్చులకు డబ్బులు, ఫ్లైట్ టికెట్స్ ఇస్తాం- వెళ్లిపోండి : శరణార్థులకు ట్రంప్ ఆఫర్