Algeria Elections 2024 : అల్జీరియా ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దెల్మద్జిద్ టెబోనీ మరోసారి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏకంగా 94.7 శాతం ఓట్లు సాధించారని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. టెబోనీ ప్రత్యర్థుల్లో ఒకరు 3.2 శాతం, మరోకరు 2.2 శాతం ఓట్లు సాధించినట్లు పేర్కొంది. దీంతో మరోసారి అల్టీరియా అధ్యక్షుడిగా అబ్దెల్మద్జిద్ టెబోని గెలుపొందినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అయితే ఈ ఎన్నికల్లో పలు అక్రమాలు జరిగాయని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.
అక్రమాలు జరిగాయ్!
అల్జీరియాలో మొత్తం 24 మిలియన్ల ఓటర్లు ఉన్నారు. కానీ 5.6 మిలియన్ ఓటర్లు మాత్రమే ఓట్లు వేశారు. అంటే సుమారు 56,30,000 ఓట్లు పోల్ అవ్వగా, టెబోనికి 94.7 శాతం (సుమారు 5,32,000) ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థులు ఇద్దరికీ కలిపి 5.4 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి.
ప్రధానంగా మూవ్మెంట్ ఆఫ్ సొసైటీ ఆఫ్ పీస్ (ఎంఎస్పీ) పార్టీ చీఫ్, ఇస్లామిస్ట్ అయిన అబ్దేలాలీ హస్సానీ చెరిఫ్కు 3.2 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. సోషలిస్ట్ ఫోర్సెస్ ఫ్రంట్ (ఎఫ్ఎఫ్ఎస్) పార్టీకి చెందిన యూసెఫ్ ఔచిచేకు కేవలం 2.2 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలపై విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఎన్నికల్లో ఎన్నో అవకతవలకు జరిగాయని ఆరోపించాయి. ఎలక్షన్ ఛైర్మన్ ముందు ప్రకటించిన గణాంకాలు, తరువాత వెల్లడించిన ఎన్నికల ఫలితాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నాయి. అయితే ఈ విపక్ష పార్టీలు చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తాయా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
వాస్తవానికి అల్జీరియా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసే సమయానికి 48 శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ తరువాత కేవలం 23.33 శాతం ఓటింగ్ మాత్రమే జరిగినట్లు తెలిపారు. కానీ ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఎన్నికల అధికారులు చెప్పకపోవడం గమనార్హం.
పుతిన్ను మించి
ఫిబ్రవరిలో జరిగిన అజర్బైజాన్ ఎన్నికల్లో ఇల్హామ్ అలీయేవ్ 92 శాతం ఓట్లతో గెలుపొందారు. మార్చి నెలలో జరిగిన రష్యా ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్ 87 శాతం ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు వారిద్దరి కంటే అత్యధిక మెజారిటీ (94.7 శాతం)తో అబ్దెల్మద్జిద్ టెబోనీ గెలవడం విశేషం.