Threat To Kill Trump : ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిపై పలు క్రిమినల్ నేరం కింద అభియోగాలు మోపి విచారిస్తున్నట్లు అమెరికా న్యాయశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ట్రంప్‌తో సహా ఇతర అమెరికా అధికారులపై బెదిరిపులకు పాల్పడినట్లు పేర్కొంది.
తనను తాను మిస్టర్ సాతాన్‌గా పేర్కొన్న బట్లర్ టౌన్‌షిప్‌నకు చెందిన షాన్ మోన్పర్ అనే వ్యక్తి యూట్యూబ్‌లో పలు వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో తమ దారికి అడ్డుగా వచ్చిన వారందరినీ హతమారుస్తా అంటూ పేర్కొన్నాడు. అంతే కాకుండా డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌తో సహా ఇతర అధికారుల పేర్లను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే మార్చి 4న ట్రంప్‌ను హత్య చేసేది తానేనంటూ మరో వీడియోను పోస్ట్ చేశాడు. ఈ బెదిరింపు వీడియోలు గురించి ఎఫ్‌బీఐ అధికారుల దృష్టికి రావడం వల్ల అప్రమత్తమయ్యారు. శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మోన్పర్పై పలు క్రిమినల్ అభిమోగాలు నమోదు చేసినట్లు న్యాయశాఖ పేర్కొంది.
పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడితో షాన్‌కు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాక జనవరిలో ట్రంప్ ప్రమాణస్వీకారానికి కొద్దిసేపటి ముందే నిందితుడు ఒక తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టాక మరికొన్ని తుపాకీలు, మందు సామగ్రిని కూడా కొనుగోలు చేశాడని తెలిసింది. అయితే, హత్య లేదా సామూహిక హింసకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడేవారిని వదిలిపెట్టమని అటార్నీ జనరల్ పామ్ బోండీ పేర్కొన్నారు. షాన్‌కు తగిన శిక్ష పడుతోందన్నారు.
కాగా, గతేడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటుచేసిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా ఓ భవనంపై నుంచి ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే స్పందించిన అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్‌ను కాపాడారు. ఆ తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్‌బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో వచ్చారు. అతడిని గుర్తించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి అరెస్టు చేశారు.