World Hemophilia Day 2025 : మనకు ఏదైనా గాయం తగలగానే రక్తస్రావం జరుగుతుంది. కొంత సమయం తర్వాత సాధారణంగా రక్తం గడ్డకట్టుకుపోతుంది. కానీ, ఇలా రక్తం గడ్డకట్టకుండా, ఆగకుండా రక్తస్రావమవుతూ ఉంటే దాన్ని హిమోఫీలియా అంటారు. ఇదో రకమైన వ్యాధని చాలా మందికి అవగాహన ఉండదు. ఈ రక్తస్రావ రుగ్మతను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక సమస్యలు ఎక్కువ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, దీని లక్షణాలు ముందే గుర్తించి నివారించాలని ఏటా ఏప్రిల్ 17న ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని జరుపుకొంటారు. National Library of Medicine కూడా హిమోఫీలియా వ్యాధికి సంబంధించిన పలు లక్షణాలను పేర్కొంది.
ఈ వ్యాధి ఎలా వస్తుంది? : హిమోఫిలియా అనేది ఒక అరుదైన వ్యాధి. రక్తంలో గడ్డకట్టే ప్రొటీన్లు తగినంతగా లేకపోవడం వల్ల రక్తస్రావం ఆగిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. చిన్న చిన్న గాయాలు అయితే పెద్ద సమస్య ఏమీ ఉండదని తెలిపారు. కానీ పరిస్థితి తీవ్రంగా ఉంటే శరీరంలో లోపల లేదా బయట మరీ ముఖ్యంగా మోకాలు, మోచేతుల్లో వద్ద పెద్ద గాయాలతో తీవ్ర రక్త స్రావం అవుతుందని అంటున్నారు. అంతర్గత రక్తస్రావం అయితే శరీరంలోని అవయవాలు, కణజాలాలను దెబ్బతీయడంతో పాటు ప్రాణాంతకం కావచ్చనని హెచ్చరిస్తున్నారు.
హిమోఫిలియా అనే వ్యాధి సాధారణంగా జన్యుపరమైన రుగ్మత అని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులు, తాతలు నుంచి వారసత్వంగా ఈ వ్యాధి సంక్రమిస్తుందని పేర్కొన్నారు. కొన్ని సార్లు జన్యు పరివర్తన ఫలితంగా కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఆడవాళ్లుతో పొలిస్తే మగవారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని mayoclinic పేర్కొంది.
హిమోఫిలియా సమస్యలు :
అంతర్గత రక్తస్రావం : కండరాల్లో రక్తస్రావం వల్ల శరీర అవయవాలు ఉబ్బుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో కణాల వాపు కారణంగా నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కాళ్లుల్లో తిమ్మిరి లేదా నొప్పికి దారితీస్తుంది. అంతర్గతంగా రక్తస్రావం జరుగుతున్నా ప్రాంతాన్ని బట్టి ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చనని నిపుణులు పేర్కొంటున్నారు.
గొంతు లేదా మెడలో రక్తస్రావం : ఈ సమస్య అనేది వ్యక్తి శ్వాస సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
కీళ్లకు నష్టం : అంతర్గత రక్తస్రావం కీళ్లపై ఒత్తిడి తెస్తుందని నిపుణులు అంటున్నారు. దీనితో పాటు తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందని వివరించారు. ఈ వ్యాధికి చికిత్స తీసుకోకపోతే భవిష్యత్తులో ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులకు కారణమవుతుందని clevelandclinic పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
ఈ చికిత్సకు ప్రతికూలచర్యలు : ఈ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వ్యక్తులు చికిత్స చేసే సమయంలో వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలా జరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ గడ్డకట్టే కారకాలను పని చేయకుండా చేసే ప్రోటిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇలాంటి వారిలో ఈ వ్యాధి నివారణకు చికిత్స తక్కువ ప్రభావితం చేస్తుంది.
హీమోఫిలియా లక్షణాలు :
- గాయాలు అయినప్పుడు అధిక రక్తస్రావం
- ఇంజెక్షన్లు తీసుకున్న తర్వాత అసాధారణ రక్తస్రావం
- కీళ్లలో నొప్పి, వాపు
- మూత్రం లేదా మలంలో రక్తం
- మెదడులో రక్తస్రావం
- గుండె, వివిధ అవయవాలు, కణజాలాల్లో రక్తస్రావం
- తలపై అసాధారణమైన గడ్డలు ఏర్పడటం
- నిద్రలేమి సమస్యలు
- దీర్ఘకాల తలనొప్పి
- తరుచు వాంతులు, బలహీనత
- దృష్టి సమస్యలు
- ముక్కులో నుంచి రక్తం రావడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"బ్రోకలీ క్యాన్సర్‌ను అడ్డుకుంటుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?"
ఈ ప్రాణాంతక మహమ్మారి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? - అయితే నిర్లక్ష్యం చేయకండి!