Cancer Symptoms in Your Body : ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మందిని క్యాన్సర్ మహమ్మారి వేధిస్తోంది. ఏటా ప్రతి 5 మంది క్యాన్సర్ రోగుల్లో ముగ్గురు దీన్ని వల్ల మరణిస్తున్నారని ఐసీఎంఆర్ (indian council of medical research) గణాంకాల్లో తేటతెల్లం చేస్తున్నాయి. అయితే, ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల మరణం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ వ్యాధిని సూచించే 10 హెచ్చరిక సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. National Cancer Institute కూడా పలు లక్షణాలను పేర్కొంది.
అతిగా బరువు తగ్గిపోవడం : క్యాన్సర్ ఉన్న చాలామంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతారని cancer council వెల్లడించింది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ కేజీల బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్ తొలి సంకేతంగా చూడొచ్చనని నిపుణులు వివరిస్తున్నారు. కడుపు, లంగ్ క్యాన్సర్, పాంక్రియాస్, అన్నవాహిక క్యాన్సర్ (Esophageal cancer) వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని పేర్కొంటున్నారు.

జ్వరం : క్యాన్సర్ బారిన పడిన రోగుల్లో జ్వరమనేది సర్వసాధారణమైన లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర నుంచి ఇతర శరీర భాగాలకు, అవయాలకు వ్యాప్తి చెందేటప్పుడు జ్వరం తరచూ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఎక్కువగా వస్తుందని Cleveland Clinic పేర్కొంది. ఈ వ్యాధి రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు సూచిస్తున్నారు. లుకేమియా లేదా లింపోమా క్యాన్సర్ వ్యాధిగ్రస్థులకు జ్వరం ప్రాథమిక లక్షణమని వివరిస్తున్నారు.

అలసట : క్యాన్సర్ బారిన పడిన వారికి అలసట విపరీతంగా ఉంటుందని mayo clinic పేర్కొంది. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరని నిపుణులు అంటున్నారు. శరీరంలో క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. లుకేమియా లాంటి కొన్ని క్యాన్సర్లలో అలసటే ప్రధాన లక్షణంగా ఉంటోందని పేర్కొంటున్నారు. పెద్దపేగు లేదా కడుపు క్యాన్సర్లు రక్తహీనతకు కారణమవుతాయని తెలిపారు.

శరీరంలో మార్పులు : చర్మ క్యాన్సర్లతో పాటు కొన్ని ఇతర క్యాన్సర్లు కూడా శరీరంలో మార్పులకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. శరీర రంగు నల్లగా మారిపోవడం(హైపర్ పిగ్మెంటేషన్), కళ్లు పసుపు పచ్చగా మారడం(జాండిష్), చర్మం ఎర్రగా మారడం, దురద రావడం లాంటి లక్షణాలు ఉంటాయని వివరిస్తున్నారు.
ప్రేగు, మూత్రాశయ తీరులో మార్పులు : మలబద్ధకం, డయేరియా, ఎక్కువ కాలం పాటు మలంలో మార్పులు పెద్దపేగు క్యాన్సర్కు సంకేతాలు కావొచ్చనని నిపుణులు సూచిస్తున్నారు. మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి రావడం, మూత్రంలో రక్తం పడటం, మూత్రాశయ తీరులో మార్పులు అంటే పదే పదే మూత్రానికి వెళ్లాలనిపించడం లేదా తక్కువగా వెళ్లడం లాంటి లక్షణాలు బ్లాడర్ లేదా ప్రొస్టేట్ క్యాన్సర్లకు సంబంధించి ఉండొచ్చనని నిపుణులు అంటున్నారు.
గాయాలు మానకపోవడం : పుట్టుమచ్చలు పెరిగి, వాటి నుంచి రక్తం కారడం చర్మ క్యాన్సర్ లక్షణం. కానీ, చిన్న చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం కూడా క్యాన్సర్కు సంకేతమని నిపుణులు వివరిస్తున్నారు. నాలుగు వారాల కంటే ఎక్కువ కాలం అయినా చిన్న, చిన్న గాయాలు మానకపోతే వాటిని విస్మరించవద్దని హెచ్చరిస్తున్నారు. నోటి క్యాన్సర్ వల్ల నోట్లో పుండు కూడా త్వరగా మానదని అంటున్నారు. నోట్లో దీర్ఘకాలం పాటు ఏదైనా మార్పులు కనిపిస్తే, వెంటనే సంబంధిత డాక్టర్ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.
రక్తస్రావం : ఒకవేళ మలంలో రక్తం పడితే అది పెద్ద పేగు క్యాన్సర్కు లేదా మల క్యాన్సర్కు సంకేతం కావొచ్చనని నిపుణులు అంటున్నారు. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్కు సంకేతమని వివరిస్తున్నారు. ఎండోమెట్రియంకి చెందిన గర్భాశ్రయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కూడా అవుతుందని పేర్కొంటున్నారు.
శరీరంలో ఏదైనా భాగం గట్టిగా మారిపోవడం : చర్మంలో మార్పుల వల్ల చాలా క్యాన్సర్లను గుర్తించవచ్చనని నిపుణులు వివరిస్తున్నారు. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో, గ్రంథులు, కణజాలల్లో ఏర్పడుతుంటాయని తెలియజేస్తున్నారు. క్యాన్సర్ ప్రారంభంలో లేదా చివరి దశలో ఏదైనా శరీర భాగం గట్టిగా మారిపోతుందని నిపుణులు వివరిస్తున్నరు.
మింగడం కష్టమవ్వడం : నీటిని తాగడం లేదా ఆహారాన్ని మింగడం వంటి ఇబ్బందులు వస్తాయని American cancer society వివరించింది. మీరు ఎదుర్కొంటుంటే అది కచ్చితంగా అన్నవాహిక క్యాన్సర్కు, గొంతు క్యాన్సర్ లేదా కడుపు క్యాన్సర్కు సంకేతంగా చూడొచ్చనని నిపుణులు సూచిస్తున్నారు.

విపరితమైన దగ్గు లేదా గొంతు బొంగురుపోవడం : విపరీతంగా దగ్గు రావడం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం కావొచ్చనని నిపుణులు వివరిస్తున్నారు. మూడు వారాలకు మించి దీని వల్ల ఇబ్బంది పడుతుంటే డాక్టర్ను సంప్రదించడం మంచిదని సలహా ఇస్తున్నారు. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్కు గొంతు బొంగురుపోవడం కూడా ఒక లక్షణంగా ఉంటుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఉప్పు ఎక్కువగా వాడినా షుగర్ వస్తుందా? - నిపుణులు ఏమంటున్నారంటే?
యువతలో లక్షణాలు లేకుండా హార్ట్ ఎటాక్ - సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకవుతుంది?