Best Foods for Vitamin D : శరీరానికి విటమిన్లు రక్షణ కవచాలుగా నిలుస్తాయి. అయితే.. ఇవి ఉండాల్సిన దానికంటే తక్కువ మొత్తంలో ఉంటే మెటబాలిజం దెబ్బతిని ఆర్గాన్స్ పనితీరు మందగిస్తుంది. వీటిలో విటమిన్ D(Vitamin D) చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే ఎముకల బలం క్షీణించడమే కాకుండా గుండె పనితీరు కూడా నెమ్మదిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే.. కొన్ని ఆహార పదార్థాలు తప్పనిసరిగా తినడం ద్వారా డి విటమిన్ పెంచుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
చేపలు : చేపలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా కొవ్వు చేపలైన(National Institutes of Health రిపోర్టు) సాల్మన్, ట్యూనా, మాకేరెల్, సార్డినెస్ వంటి వాటిల్లో విటమిన్ Dతోపాటు కాల్షియం, ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లక్ష్మి కిలారు. కాబట్టి.. వీటిని వానాకాలంలో తరచుగా తీసుకోవడం ద్వారా విటమిన్ D లోపం బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
పుట్ట గొడుగులు : ఎండలో పెరిగే కొన్ని రకాల పుట్టగొడుగుల్లో విటమిన్ ‘డి’ లెవల్స్ ఎక్కువగా ఉంటాయంటున్నారు డాక్టర్ లక్ష్మి. దీంతో పాటు కాల్షియం, బి1, బి2, బి5, కాపర్.. వంటి పోషకాలు కూడా వీటిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే.. వానాకాలం వీటిని తీసుకున్నా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
గుడ్డు పచ్చసొన : ఇందులోనూ విటమిన్ ‘డి’ తో పాటు ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయి. అయితే, కొవ్వులు కూడా ఎక్కువే. కాబట్టి.. డైలీ ఒక ఎగ్ యెల్లో తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
కమలా పండ్లు : వీటిలోనూ విటమిన్ సి, డి పుష్కలంగా ఉంటుంది. ఇవి బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా బాగా సహాయపడతాయి. కాబట్టి, మీరు డైలీ ఒక కమలా పండు తిన్నా లేదంటే దాన్ని జ్యూస్ చేసుకొని తాగినా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు డాక్టర్ లక్ష్మి.
విటమిన్ 'డి' తక్కువైతే ఇన్ని సమస్యలా! సొల్యూషన్ ఏంటో తెలుసా?
పాలు, పెరుగు : బాడీకి కావాల్సిన విటమిన్ Dని అందించడంలో పాలు, పెరుగు చాలా బాగా సహాయపడతాయి. అలాగే వీటిలో ప్రొటీన్స్, కాల్షియం కూడా ఉంటాయి. కాబట్టి వానాకాలం వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ డి లోపం బారినపడకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
పొద్దుతిరుగుడు గింజలు : 'విటమిన్ డి' లెవెల్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో ఇవి ఒకటి. అందుకే వానాకాలం పొద్దుతిరుగుడు గింజలను సలాడ్స్, యోగర్ట్‌తో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఇవేకాకుండా.. కాడ్ లివర్ ఆయిల్, తృణధాన్యాలు, చీజ్, సోయాపాలు, ఓట్స్ వంటి వాటిలో కూడా విటమిన్ ‘డి’ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వర్షాకాలం మీ డైలీ డైట్లో వీటిని చేర్చుకున్నా శరీరానికి కావాల్సినంత విటమిన్ డి లభిస్తుందంటున్నారు డాక్టర్ లక్ష్మి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.