Vitamin D Deficiency Include these Foods in Your Diet : ఆరోగ్యంగా ఉండడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచుకోవడానికి మనం తీసుకునే ఆహారం ప్రధానం. ముఖ్యంగా ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ డి పాత్ర ఎంతో కీలకమని నిపుణులు చెబుతున్నారు. 'డి' విటమిన్ లోపం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? ఏయే ఆహార పదార్థాల్ని తీసుకోవాలి? ఇలాంటి విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, జింక్, అయాన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి అనేక పోషకాలు అవసరం. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు విటమిన్ డి కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఇది రక్తం, ఎముకల్లో కాల్షియం సమతుల్యతను కాపాడుకోవడానికి, ఎముకలు దృఢంగా ఉంచడానికి సహాయపడుతుందని వివరించారు. ఈ విటమిన్ లోపం వల్ల కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, కండరాల నొప్పులు, అలసట, ఆందోళన, ఒత్తిడి, జుట్టు రాలడం, తిమ్మిర్లు, దీర్ఘకాలిక జీర్ణ సంబంధిత సమస్యలు వంటివి తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
"లివర్" డేంజర్లో ఉన్నట్లు చెప్పడానికి ట్రై చేస్తుందని మీకు తెలుసా? - ఈ లక్షణాలన్నీ అందులో భాగమే!

ఎముకలు, దంతాల ఆరోగ్యం : విటమిన్ డి కాల్షియం, ఫాస్పరస్‌ను శరీరం గ్రహించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. విటమిన్ డి సమృద్ధిగా ఉండటం వల్ల పిల్లలలో రికెట్స్, పెద్దలలో ఆస్టియోమలాసియాను నివారిస్తుందని, వృద్ధుల్లో బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షించడంలో సహాయపడుతుందని National Institutes of Health పేర్కొంది.
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది : విటమిన్ డి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. ఇది బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడటానికి శరీర సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. అంతే కాకుండా కణాల పెరుగుదలకు, అభివృద్ధికి విటమిన్ డి అవసరమని వివరించారు.
కండరాలు, నరాల పనితీరు : కండరాలు సరిగ్గా పనిచేయడానికి, మెదడు, శరీరానికి మధ్య సందేశాలు తీసుకెళ్లడానికి నరాలకు విటమిన్ డి అవసరమని medlineplus పేర్కొంది. దీనితో పాటు శరీరంలో వాపును తగ్గించడంలో కూడా విటమిన్ డి సహాయపడుతుందని పేర్కొన్నారు.
మానసిక ఆరోగ్యం : విటమిన్ డి మానసిక స్థితిని నియంత్రించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు వివరించారు. ఈ విటమిన్ లోపం వల్ల అలసట, బలహీనంగా ఉండటం, మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయని clevelandclinic పేర్కొంది.
విటమిన్ డి అనేది మనకు సూర్యరశ్మి నుంచి సహజంగా లభిస్తుందని అందరికీ తెలిసిన విషయమే! కానీ, ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ఉదయం ఎప్పుడో నిద్ర లేవడం కారణంగా సహజంగా లభించే ఈ విటమిన్ చాలా మంది మిస్ అవుతుంటారు. దీని వల్ల అనేక అనారోగ్యాల సమస్యతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో విటమిన్ డి లోపం లేకుండా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాల్ని మెనూలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

పుట్టగొడుగులు : శాకాహారులకు పుట్టగొడుగులు ఒక వరం లాంటివి అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ డి పుష్కలంగా ఉంటుందంటున్నారు. పుట్టగొడుగుల్లో విటమిన్ డి స్థాయి ఎక్కువగా ఉంటుందని వివరించారు. వీటితో పాటు విటమిన్లు బి1, బి2, బి5, కాపర్ వంటి పోషకాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల విటమిన్ డి లోపం బారిన పడకుండా ఉంటామని సలహా ఇస్తున్నారు.

గుడ్డు : ఇందులో ప్రొటీన్లతో పాటు విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో కొవ్వులు కూడా ఎక్కువగా ఉండటం వల్ల రోజుకు ఒక గుడ్డు కంటే ఎక్కువ తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు. కావాలంటే ఇందులో రుచి కోసం కొన్ని కాయగూర ముక్కల్ని కలుపుకొని ఆమ్లెట్ లేదా కర్రీలాగా చేసుకోవాలని సూచిస్తున్నారు.

చేపలు : వీటిలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాల్మన్, ట్యూనా, మాకేరెల్ వంటి కొవ్వు చేపలు విటమిన్ డి కి చాలా మంచి వనరులు అని medlineplus పేర్కొంది. అలాగే చేపల్లో ఉండే కాల్షియం, ప్రొటీన్లు, ఫాస్ఫరస్ వంటి పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి సహకరిస్తాయని తెలిపారు.

పాలు, పెరుగు : ఆవు పాలలో విటమిన్ డి అధికంగా ఉంటుందని, రోజుకు ఒక గ్లాసు వెన్నతో కూడిన ఆవు పాలు తాగడం వల్ల రోజులో కావాల్సిన మొత్తంలో 20 శాతం దాకా విటమిన్ డి ని శరీరానికి అందించవచ్చనని పేర్కొన్నారు. అంతేకాకుండా పాలలో ఉండే క్యాల్షియం కూడా ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరమని తెలిపారు. అలాగే పెరుగులో కూడా ప్రొటీన్లతో పాటు విటమిన్ డి ఎక్కువగా ఉంటుందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"మూడు అడుగులతో షుగర్ కంట్రోల్"! - స్పష్టంగా వెల్లడించిన ఆయుర్వేదం
మందులు వేసుకోకుండానే BP తగ్గించుకోవాలా? - నిపుణులు ఏం చెప్తున్నారంటే!