మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
-శారీరకంగానే కాకుండా మెంటల్‌గా కూడా హెల్దీగా ఉండాలా? - నిపుణులు చెబుతున్న ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

Published : October 10, 2025 at 4:52 PM IST
How to Improve Mental Health: శరవేగంగా మారుతున్న ప్రపంచంలో నిత్యం ఎన్నో సమస్యలు. వాటి వల్ల పెరిగే ఒత్తిళ్లు.. మానసిక రుగ్మతలను ప్రేరేపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటివి రోజురోజుకు పెరిగిపోతున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో మానసికరంగా హెల్దీగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!
మనసు, శరీరం పరస్పర ఆధారితాలు. ఒకటి బాధపడితే మరొకటి దుఃఖిస్తుంది. ఒకవేళ మనస్సు ఆనందిస్తే శరీరం సంతోషిస్తుంది. అందుకే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అది కొరవడితే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వేటిలోనూ రాణించలేమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలు కోల్పోతామని వివరిస్తున్నారు. అందుకే తరచూ మనలోకి మనం తొంగిచూసుకోవాలని పేర్కొంటున్నారు. మనసు చెప్పే మాటలను వినాలని తెలియజేస్తున్నారు. అప్పటికే చేయిదాటి అది కుంగుబాటు వంటి సమస్యల్లో కూరుకుపోతే అవసరాన్ని బట్టి చికిత్సా చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు.
కారులో 'వాటర్ బాటిల్' పెట్టడం ప్రమాదకరమా? - నిపుణులు ఏమంటున్నారంటే!
మీ ప్రాణ స్నేహితులు, మీరే : మీరు చేసే పనుల్లో పదే పదే అపజయాలు ఎదురవుతున్నాయనుకోండి. 'నాకేం చేతకాదు, దేనికీ పనికిరాను' అని మనసులో మిమ్మల్ని మీరే నిరాశపరచుకుంటే ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉందని చెబుతున్నారు. ఇవే మాటలను మన బెస్ట్ ఫ్రెండ్స్‌తో అనలేం కదా! వారు ఎక్కడ బాధపడతారోనని సందేహిస్తాం. 'తర్వాత ప్రయత్నంలో కచ్చితంగా విజయం వరిస్తుంది' అని మనసుకు ఊరట కలిగించే మాటలు చెబుతాం. ఈ క్రమంలో మనల్ని మనమే నేస్తంగా భావించుకుంటే, ఇవే మాటలను మనకు చెప్పుకుంటాం కదా. దీంతో ఆత్మ విశ్వాసంతో పాటు ఆనందమూ సొంతమవుతుందంటున్నారు నిపుణులు.
ఒంటరితనమే శాపం!: వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల పేరుతో పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం కలవరపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. తమకేదైనా అనారోగ్య సమస్యలు వస్తే పిల్లలు రాగలరో లేరో అనీ మథనపడుతుంటారని అంటున్నారు. ఒంటరితనంతో కుంగుబాటుకూ లోనవుతుంటారని వివరిస్తున్నారు. అంతేకాకుండా, జీవితంలో అలా చేసి ఉండకపోతే బాగుండేదేమోననే ఆలోచనలు వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయని తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో అనవసర ఆలోచనలకు తావివ్వకుండా వాస్తవాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలంటున్నారు. గతాన్ని తలచుకొని బాధపడటం వల్ల ఒరిగేదేమీ లేదని అర్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ కాసేపు ధ్యానం చేస్తే అనవసర ఆలోచనలు తగ్గుతాయని సలహా ఇస్తున్నారు. అలాగే, సాయంత్రం పూట తమ వయసువారితో కలిసి కాసేపు మాట్లాడితే ఒంటరితనం దూరమవుతుందని పేర్కొంటున్నారు. వీటితో పాటు చిన్ననాటి స్నేహితులతో కూర్చుని ఆడే చదరంగం వంటి ఆటలు ఆడాలని, దీంతో మనసుకు ఉల్లాసంగా ఉండటంతో పాటు ఒంటరి భావన తగ్గుతుందని సలహా ఇస్తున్నారు. ఇతరులతో గడపడానికి, ఆనందించే పనులు చేయడానికి సమయం కేటాయించుకోవాలని cdc అధ్యయనం పేర్కొంది.
నవ్వు ఆరోగ్యానికి మేలు : నవ్వు ఆయుష్షును పెంచుతుందని అందరికి తెలిసిన విషయమే. ఎక్కువ కాలం జీవించిన, జీవిస్తున్న వారిని పరిశీలించినప్పుడు వీరంతా దైనందిన జీవితంలో సహజంగా, ఇష్టంగా నవ్వుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. భయం, కోపం వంటి ప్రతికూల భావనలతో మన శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి కలిగించే హార్మోన్ ఎక్కువగా విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవ్వినప్పుడు పుట్టుకొచ్చే ఎండార్ఫిన్లు ఈ హార్మోన్ ప్రభావాన్ని తగ్గిస్తాయని తెలియజేస్తున్నారు. నవ్వు ఒత్తిడి, నిరాశ, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుందని mayoclinic అధ్యయనం పేర్కొంది.
క్రమం తప్పకుండా భోజనం, వ్యాయామం : సమతుల్య ఆహారం, పుష్కలంగా నీరు తీసుకోవడం వల్ల రోజంతా శక్తి, దృష్టి మెరుగుపడుతుందని National Institute of Mental Health అధ్యయనం పేర్కొంది. కొంతమందికి కెఫెన్, ఆల్కహాల్ వినియోగం తగ్గించడం సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కేవలం 30 నిమిషాలు నడవడం వల్ల మానసిక స్థితి, ఆరోగ్యం మెరుగుపడుతుందంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండాలా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!

