చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? - నిపుణులు ఏమంటున్నారంటే!
రాత్రిపూట చెమటలతో ఎన్నో జబ్బులు - జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన

Published : July 17, 2025 at 12:17 PM IST
Sweating is Good for Health or Not: పని, వ్యాయామాలు ఎక్కువ చేసినా, వేడి ప్రదేశాల్లో ఉన్నా చాలా మందికి చెమట పడుతుంటుంది. మరికొద్దిమందికి వెదర్ చల్లగా ఉండి ఫ్యాన్, ఏసీ ఆన్‌లో ఉన్నప్పటికీ రాత్రుళ్లు నిద్రలో విపరీతంగా చెమటలు పడుతుంటాయి. అయితే ఇలా చెమట పట్టడం వల్ల రెండూ రకాలుగా అంటే లాభాలు, నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రుళ్లు నిద్రలో చెమట పట్టడాన్ని చిన్న సమస్యే కదా అని నిర్లక్ష్యం చేయొద్దంటున్నారు. ఎందుకంటే ఇది వివిధ అనారోగ్యాలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం!
చెమట పట్టడం వల్ల కలిగే లాభాలు:
డీటాక్స్ : ప్రస్తుతం మైక్రో ప్లాస్టిక్స్, కాలుష్యం వల్ల శరీరం మీద ఎన్నో విషపదార్థాలు పేరుకుపోతున్నాయి. క్రమం తప్పకుండా స్నానం చేయడం ద్వారా కొన్నింటిని వదిలించుకోవచ్చు. ఇది బయట వరకు ఓకే, మరి చర్మంలోకి చొచ్చుకుపోయిన వాటి సంగతేంటి? అయితే చెమట వీటిని డీటాక్స్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. చెమట అనేది సీసం, పాదరసం, కాడ్నియం, అర్సెనిక్ లాంటి విషపదార్థాల్నీ, ప్లాస్టిక్ రసాయనాల్నీ చర్మం లోతుల్లోంచి తొలగిస్తుందని పేర్కొంటున్నారు. క్రమం తప్పకుండా చెమట పట్టడం అనేది ఇతర రకాల ముఖ్యమైన హోమియోస్టాటిక్ విధులకు బాధ్యత వహిస్తుందని, వీటిలో అధిక సూక్ష్మపోషకాలు, జీవక్రియ ప్రక్రియల వ్యర్థ ఉత్పత్తులు, శరీరం నుంచి విషపదార్థాల తొలగిస్తుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.
చర్మం నిగారింపు కోసం : మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకునేందుకూ చెమట ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా స్కిన్ బ్రీథింగ్ ప్రక్రియను మెరుగుపరుస్తుందని తెలిపారు. పొడారిన చర్మంతో బాధపడేవారికి చెమట మంచి ఉపశమనమని వివరిస్తున్నారు. ఈ రకంగానైనా చర్మానికి తేమ అంది హైడ్రేటెడ్‌గా ఉంటుందని, చర్మం మృదువుగా కనపడేందుకూ ఇది సహకరిస్తుందని తెలుపుతున్నారు. వాకింగ్, యోగా, వ్యాయామాలు చేసినప్పుడు చెమట పట్టడం వల్ల రక్తప్రసరణ వేగవంతమై, ఆక్సిజన్ సరఫరా కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా చర్మం నిగారిస్తుందని పేర్కొన్నారు.
అయితే చెమట ఆరోగ్యానికి ఒకరకంగా మంచిదే అయినా, రాత్రుళ్లు నిద్రలో పడుతున్నాయంటే కొన్ని ఆరోగ్య సమస్యలు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్య తీవ్ర రూపం దాల్చక ముందే మేల్కొని సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. ఆ సమస్యలు ఏంటంటే,
థైరాయిడ్ జబ్బు : థైరాయిడ్ గ్రంథి జీవక్రియలతో పాటు ఇతర శారీరక విధులు నిర్వర్తించడంలో సమర్థంగా పనిచేస్తుందంటున్నారు. అయితే ఇది అత్యంత చురుగ్గా మారినప్పుడు హైపర్ థైరాయిడిజం (Hyperthyroidism) బారిన పడతామని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా శరీరం వేడికి తట్టుకోలేక రాత్రిళ్లు చెమటలు పడుతుంటాయని పేర్కొన్నారు. హైపర్‌థైరాయిడిజమ్ వారిలో ఆకలి ఎక్కువగా వేయటం, బరువు తగ్గటం, గుండె దడ, అలసట, విరేచనాలు, చేతులు వణకటం, శరీరం వేడిగా అనిపించటం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొంటున్నారు.
మీలో "ఈ లక్షణాలు" కనిపిస్తున్నాయా? - బ్రెయిన్ స్ట్రోక్‌కు అవకాశమంటున్న నిపుణులు!
ఒత్తిడి : నిద్ర సమయంలో కొంతమంది ఉన్నట్లుండి ఒత్తిడి, ఆందోళనలకు గురవతుంటారు. అయితే దీని ప్రభావం మెదడు, శరీరంపై పడుతుందని, ఫలితంగా నిద్రలో చెమటలు పడుతుంటాయని చెబుతున్నారు.
మానసిక రుగ్మతలు : కొన్ని రకాల మానసిక రుగ్మతలు ఉన్నప్పుడు మనసులో ఒక రకమైన యాంగ్జైటీ, ఆందోళన మొదలవుతుంటాయని, ఇవి నిద్రలో చెమటలు పట్టేలా చేస్తాయని వివరిస్తున్నారు.
మెనోపాజ్ : 40 దాటిన మహిళల్లో రాత్రుళ్లు నిద్రలో చెమటలు పడుతున్నాయంటే, వారు మెనోపాజ్‌కు చేరువవుతున్నారనడానికి సంకేతమని clevelandclinic అధ్యయనంలో పేర్కొంది.
వీటి వల్ల కూడా : అంతేకాకుండా కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా నిద్రలో చెమటలు పడుతుంటాయని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. కాఫీ లేదా టీలను మితిమీరి తీసుకోవడం వల్ల కూడా రాత్రుళ్లు చెమటలు పట్టే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఈ జాగ్రత్తలు : రాత్రిపూట నిద్రలో చెమటలు పట్టడమనేది తరచూ తలెత్తినా, అసౌకర్యంగా అనిపించినా ఆలస్యం చేయకుండా డాక్టర్లును సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. తద్వారా సమస్యేంటో తెలుసుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వరి అన్నం తింటే షుగర్ వస్తుందా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
షుగర్ లెవల్స్‌ను ఎప్పుడు చెక్ చేసుకోవాలో తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

