Summer Heart Patients Tips : వేసవి కాలాన్ని పిల్లలకు, వృద్ధులకు కష్టకాలంగా చెబుతాం. వీరితో పాటు గుండె జబ్బులతో బాధపడే వారికి కూడా వేసవిని గడ్డు కాలంగా పేర్కొంటున్నారు డాక్టర్లు. తీవ్రమైన వేడి ఉక్కపోతల మూలంగా ఒంట్లోంచి నీరు సోడియం వంటి లవణాల ధారాపాతంగా బయటకి వెళ్లిపోతుంటాయి. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బకు గురవుతూ ఉంటారు. దీనికి తోడు ఒంట్లో నీరు లవణాల మధ్య సమతుల్యత లోపించడం వల్ల రక్తం చిక్కగా మారే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ఈ పరిస్థితి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎండాకాలం ముగిసే వరకు హృద్రోగులు తమ జీవనశైలి అలవాట్లు ఇతరాతర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. (రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వేసవి కాలం ఉష్ణోగ్రత కారణంగా చెమట ఎక్కువగా రావటం, శరీరం నుంచి ఫ్లూయిడ్స్ ఎక్కువగా బయటకి వెళ్లిపోవటం లాంటివి జరుగుతుంటాయి. అందుకే గుండె జబ్బులతో బాధపడేవారు వీలైనంత వరకు ఫ్లూయిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తాం. కొన్ని రకాల గుండె సమస్యలు ఉన్నవారు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గుండె వీక్‌గా ఉన్నవారిలో ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో నిలిచి లంగ్స్‌లో వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇలాంటి వారు ఫ్లూయిడ్స్ తక్కువగా తీసుకోమని సలహా ఇస్తాం.
-- రమేష్ గూడపాటి, సీనియర్ కార్డియాలజిస్ట్
మరీ ఎక్కువ తాగినా ప్రమాదమే : గుండె బలహీనమైన వారిలో, విఫలమైన వారిలో హార్మోన్ల మార్పుల మూలంగా అదనపు నీరు శరీరంలోనే ఉండిపోతుంటుందరట. దీని వల్ల గుండె మీద అదనపు భారంతో పాటు ఆయాసం వస్తుందని, ఊపిరితిత్తుల్లో నీరు చేరుకుంటుందని నిపుణులు అంటున్నారు. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు నీరు, ఉప్పు తక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. కొందరు అయితే లీటరు కన్నా తక్కువే తాగాల్సి ఉంటుంది. వేసవికాలంలో ఇది కాస్త విచిత్రమైన పరిస్థితే. ఎక్కువ వేడికి గురైనపప్పుడు శరీరంలో నుంచి నీరు ఎక్కువగా బయటకు పోతుంది. అందువల్ల నీరు ఎక్కువగా అవసరం అవుతుంది. అలాగని మరీ ఎక్కువ తాగినా ప్రమాదమే అంటున్నారు నిపుణులు.

చెమటలు బాగా పడుతున్నా కూడా వైద్యులు ఎక్కువ నీరు తాగొద్దని చెప్పారు కదాని తాగకుండా ఉన్నా ప్రమాదమే. దీంతో శరీరంలో నీటి శాతం తగ్గిపోవచ్చు. కాబట్టి ఎండాకాలంలో ఎంత నీరు తాగాలనేది వాతావరణాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎండ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించేవారు కాస్త ఎక్కువగా, ఏసీ గదుల్లో ఉన్నవారు పరిమితి పాటించాలి. మరి అవసరమైతే మీ వ్యక్తిగత డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. గుండె పనితీరు సక్రమంగా ఉన్నవారు మామూలుగానే నీటిని తాగవచ్చని సూచిస్తున్నారు.

వాటి జోలికి పోవద్దు : ఎండ ఎక్కువగా కాసే వేళల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు బయటకు వెళ్లకపోవటమే మంచిది. ఈ సమయంలో ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మంచిది. వదులైన, నూలు దుస్తులు ధరించడంతో పాటు ఇంట్లో, ఆఫీసులో చల్లగా ఉండేలా చూసుకోవాలి. శీతల పానీయాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి జీర్ణకోశ వ్యవస్థ నుంచి రక్తంలోకి ద్రవాలు త్వరగా వెళ్లకుండా అడ్డుకుంటాయని పేర్కొంటున్నారు. మద్యం, కాఫీ వల్ల శరీరం నుంచి నీరు ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. కాబట్టి ఇలాంటి ద్రవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మజ్జిగ, పళ్లరసాల వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే : ఒకేసారి ఎక్కువెక్కువ తినకుండా కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వికారం, వాంతి, తలనొప్పి, నిస్సత్తువ, తికమక, ఏకాగ్రత లోపించటం, కండరాలు పట్టేయటం వంటివి డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు. గుండె జబ్బులు గలవారిలో కొంత మందికి మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందులు అవసరం అవుతాయి. అలాంటివి వేసుకునేవారు వేసవికాలంలో లవణాల స్థాయిలను గమనించుకోవాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎండాకాలంలో షుగర్ పేషెంట్లు ఇబ్బందులు- ఈ టిప్స్ పాటిస్తే కంట్రోల్లో ఉంటుందట!
మీకు 'ఫన్ యోగా' తెలుసా? ఇలా చేస్తే నవ్వుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమట!