Standing on One Leg Test Age : మీరు ఒంటి కాలి మీద నిల్చోగలరా? నిల్చుంటే ఎంతసేపు ఉండగలరు? ఇవి అర్థం లేని ప్రశ్నలుగా అనిపిస్తున్నాయా? కానీ వృద్ధాప్య ప్రక్రియ వేగాన్ని అంచనా వేయటానికిది తేలికైన, విశ్వసనీయమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (రిపోర్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రస్తుతం వైద్యరంగం సాధిస్తున్న పురోగతి మూలంగా ప్రపంచవ్యాప్తంగా మనిషి ఆయుష్షు పెరుగుతోంది. కానీ వయసుతో పాటు శారీరక సామర్థ్యాలు క్షీణిస్తూ వస్తాయనే సంగతి మార్చిపోవద్దు. బలం, నియంత్రణ, నడక నైపుణ్యాలు బలహీనం అవుతుంటాయి. ఇవి వయసుతో పాటు ఎలా క్షీణిస్తాయన్న విషయం కచ్చితంగా తెలియదు. దీన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.
ఇద్దరిలోనూ ఒకే వేగంతో బలం సన్నగిల్లుతూ : ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు (NIH) చెందిన పరిశోధకుల బృందం ఆరోగ్యంగా ఉన్న కొందరి సామర్థ్యాలను అంచనా వేసింది. వీరిలో సగం మంది 50 నుంచి 64 ఏళ్లు వయస్సు పైబడిన వారే. వీరి అందరికీ కదలికలను అంచనా వేసే ల్యాబ్‌లో కొన్ని పరీక్షలు పెట్టారు. ఇందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వీరందరిలో నడక తీరు మారటంలో పెద్ద తేడా ఏమీ కనపించలేదు. ఆడవారిలో కన్నా మగవారిలో పిడికిలి పట్టు 30 శాతం, మోకాలి బలం 27 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. కానీ ఇద్దరిలోనూ ఒకే వేగంతో బలం సన్నగిల్లుతూ రావడం గమనార్హం
అధ్యయాన ఫలితాలు ఏం చెబుతున్నాయంటే? : ప్రతి పదేళ్ల వయసు మీద పడుతున్న కొద్దీ పిడికిలి పట్టు 4 శాతం, మోకాలి బలం సుమారు 1% చొప్పున తగ్గింది. వయసుతో పాటు శరీర నియంత్రణ కూడా అవసరం. ముఖ్యంగా ఒక కాలి మీద 30 సెకండ్ల పాటు నిల్చునే సామర్థ్యం గణనీయంగా తగ్గుతూ వస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. తరచుగా వాడని కాలు మీద నిల్చునే సమయం ప్రతి పదేళ్లకూ 21 శాతం చొప్పున తరచూ వాడే కాలు మీద నిల్చునే సమయం 14 శాతం చొప్పున తగ్గుతూ వస్తోంది. తరచూ వాడని కాలు మీద ఎంత సేపు నిల్చుంటున్నారనేది వృద్ధుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి తేలికైన విధానంగా ఉపయోగపడగలదని ఈ అధ్యయాన ఫలితాలు చెబుతున్నాయి. శరీర నియంత్రణలో మార్పులు చాలా ముఖ్యమైనవి. నియంత్రణ కోల్పోతే కింద పడిపోయే ముప్పు పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధులు కింద పడితే తీవ్ర దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎండలతో చర్మం నల్లగా మారిపోతుందా? ఇలా చేస్తే సూపర్ స్కిన్ మీ సొంతం!
మీకు 'ఫన్ యోగా' తెలుసా? ఇలా చేస్తే నవ్వుతో పాటు సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమట!