Role of Ayurveda in Helping Manage Diabetes : ఆయుర్వేద శాస్త్రంలో కేవలం అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాన్నీ కూలంకశంగా వివరించారు. మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉండే వాటి నుంచి అరుదుగా లభించే వస్తువుల వరకు వాటి ప్రయోజనాలను ఆయుర్వేదంలో క్షుణ్ణంగా తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం డయాబెటిస్ నియంత్రణలో "ఆహారం, ఔషధం, జీవనశైలి" మూడు అడుగుల లాంటివి. ఈ మూడు అంశాలపై ఆధారపడి షుగర్ నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇపుడు తెలుసుకుందాం!
"షుగర్ తగ్గడానికి మందులతో పాటు ఇవీ ముఖ్యమే" - వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

మధుమేహంతో బాధపడుతున్న వారికి ఆహార సమతుల్యం నియమం ఆయుర్వేద చికిత్సలో ప్రధానమైనదని నిపుణులు అంటున్నారు. నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారాలకు ఆయుర్వేదం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి ఆహార వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉండటంతో పాటు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తుందని వివరించారు.

ఆహారం : తృణధాన్యాలు, చిరుధాన్యాలైన బార్లీ, గోధుమ, పాత బియ్యం, సజ్జలు, జొన్నలు ఆహారంలో భాగంగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి స్థిరమైన శక్తిని విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా బార్లీ బరువు నిర్వహణకు, రక్తంలో గ్లూకోజ్ స్థాయి హెచ్చుతగ్గులు లేకుండా నిర్వహించడానికి దోహదం చేస్తుందని వివరించారు.
చేదు, వగరు రుచులు : ఆయుర్వేద చికిత్సలో భాగంగా కాకరకాయ, వేప, తులసి, ఉసిరి, మెంతి, నల్ల మిరియాలు, అల్లం వంటి చేదు, వగరు రుచులు కలిగిన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పండ్లు : నేరేడు, బొప్పాయి వంటి కొన్ని పండ్లు క్లోమానికి మద్దతు ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
నేరేడు పండ్లలోని ఆంథోసైనిన్‌లు, ఎలాజిక్ ఆమ్లం వంటి సమ్మేళనాలు స్టార్చ్‌ను చక్కెరగా మారకుండా నిరోధించే సామర్థ్యం ఉంటుందని, తద్వారా ఇది యాంటీ డయాబెటిక్ లక్షణాన్ని ప్రదర్శిస్తుందని National Library of Medicine పేర్కొంది.
ఔషధం : ఆయుర్వేదంలో మధుమేహాన్ని నియంత్రించడానికి అనేక మూలికలు, సూత్రీకరణలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మెంతులు, వేప, పసుపు, ఉసిరి, గురుమార్, దాల్చిన చెక్క వంటివి శరీర స్థితిస్థాపకతను పెంచుతూ, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని వివరించారు.

జీవనశైలి : జీవనశైలిలో మార్పు చేసుకుంటే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చనని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యోగా, నడక, జాగింగ్, ఈత లాంటి వ్యాయామలను క్రమం తప్పకుండా చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుందని gradyhealth అధ్యయనంలో పేర్కొంది. రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండడానికి రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

నిద్రలేమి : తక్కువ నిద్ర వల్ల ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందని sleepfoundation పేర్కొంది. కాబట్టి రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన నిర్వహణ కూడా ముఖ్యమని పేర్కొన్నారు.
పరిమితం చేయవలసినవి: తాజాగా వండిన, వెచ్చని ఆహారాన్ని సమయానికి తీసుకోవడం జీవక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొవ్వు పదార్థాలు, వేయించినవి, చల్లటి పదార్థాలు, పాలు, పాల ఉత్పత్తులు, తీపి పదార్థాలు, బంగాళదుంపలు, కాయధాన్యాలు, మైదా ఉత్పత్తులను తగ్గించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
NOTE : షుగర్‌కు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"లివర్" డేంజర్లో ఉన్నట్లు చెప్పడానికి ట్రై చేస్తుందని మీకు తెలుసా? - ఈ లక్షణాలన్నీ అందులో భాగమే!
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలా? - వీటి జోలికి పోవద్దంటున్న నిపుణులు!