వర్షాకాలంలో "ఆకుకూరలు" తినకూడదా? - నిపుణుల సమాధానమిదే!
-వర్షాకాలంలో ఆకుకూరలు తింటే విరేచనాలు అవుతాయా? - వీటిని తినాలా? వద్దా?

Published : July 31, 2025 at 5:10 PM IST
Rainy Season Green Leafy Vegetables Avoid or Not: ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే. ఇందులో హెల్త్‌కు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే నిత్యం ఏదో ఒక ఆకుకూరను ఆహారంలో భాగం చేసుకోమని నిపుణులు చెబుతుంటారు. అయితే ఆకుకూరలు ఆరోగ్యానికి మంచివే అయినా, వర్షాకాలంలో వీటిని తింటే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని భావించి చాలా మంది వీటికి దూరంగా ఉంటుంటారు. ఈ క్రమంలోనే వర్షాకాలంలో ఆకుకూరలు తినొచ్చా? లేదా? తింటే ఏం జరుగుతుంది? అనే విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం!
ఎందుకు తినకూడదంటారు: వానాకాలంలో ఆకుకూరలు తింటే కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయనేది అపోహ మాత్రమే అని పోషకాహార నిపుణులు డా. జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. ఈ కాలంలో వీటిని తినకూడదని ఎందుకంటారంటే, 'మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు భూమికి దగ్గరగా పెరుగుతాయి. వర్షపు జల్లుల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆకుకూరలపై మట్టి, కీటకాలు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని కారణాలుగా పేర్కొంటూ ఆకుకూరలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి' అని భావిస్తుంటారని డాక్టర్ జానకీ చెబుతున్నారు. అయితే ఆకుకూరలు మంచివే అయినా వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటంటే,
కూరగాయలు నీళ్లలో ఉడికిస్తున్నారా?, ఆవిరి పడుతున్నారా? - ఎలా తింటే మంచిదో తెలుసా?
ఎక్కువసేపు ఉడికించాలి : వర్షాకాలంలో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పోలిక్ ఆమ్లాలు ఆకుకూరల నుంచి ఎక్కువ మొత్తంలో లభిస్తాయని డా. జానకీ శ్రీనాథ్ చెబుతున్నారు. అందుకే, రోజువారీ ఆహారంలో 50 గ్రాముల చొప్పున ఏదో ఒక ఆకుకూరని చేర్చుకోవాలని సూచిస్తున్నారు. అయితే వీటిని వండేముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి ఎక్కువసేపు ఉడికించాలని తెలిపారు. ఈ కాలంలో పచ్చి ఆకుకూరలు తినడం కంటే, వాటిని బాగా ఉడికించి తినడం మంచిదని, ఇలా చేయడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని సలహా ఇస్తున్నారు.
అనేక ప్రయోజనాలు : ఆకుకూరల్లో పీచు పదార్థంతో పాటు ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటివి అధికంగా ఉంటాయని పేర్కొంటున్న్నానారుు. ఇవన్నీ రక్తం సమృద్ధిగా ఉంచేందుకు సహయపడతాయంటున్నారు. పీచు అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుందని అంటున్నారు. అలాగే ఇందులో ఎ, సి విటమిన్‌తో పాటు కెరోటినాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, ఇందులో అధిక స్థాయిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియంతో పాటు తక్కువ కార్బోహైడ్రేట్లు, సోడియం, కొలెస్ట్రాల్ ఉంటుందని Agriculture Research Service. USDA అధ్యయనంలో పేర్కొంది. అందుకే వారంలో కనీసం మూడు సార్లు ఆకుకూరలను ఆహారంలో చేర్చుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఇలా చేస్తే చాలా రకమైన ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని, శరీరానికి అధిక పోషకాలు అంది రక్తహీనత రాకుండా కాపాడుకోవచ్చంటున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి : కానీ, ఆకులు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మురికిగా లేదా వాడిపోయిన వాటిని కొనుగోలు చేయకుండా, తాజాగా కనిపించే ఆకుకూరలనే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆకుకూరలను ఎంచుకోవడం మంచిదని, ఎందుకంటే వాటిపై రసాయన అవశేషాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆకుకూరలను ఇంట్లో నిల్వ చేసేటప్పుడు తేమ లేకుండా చూసుకోవాలని, తేమ ఉంటే అవి త్వరగా పాడవుతాయని తెలుపుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"ఒంటరిగా కూర్చోవడం, అనవసర భయాలు" - ఇలా ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!
మొక్కలు త్వరగా ఎండిపోతున్నాయా? - ఈ టిప్స్ ట్రై చేస్తే బెటర్ అంటున్న నిపుణులు!

