డీజే సౌండ్ ఎక్కువ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
-డీజే శబ్దాలతో ప్రాణాలకు ముప్పు - శాశ్వత వినికిడి లోపాలు తలెత్తే ప్రమాదమని నిపుణుల హెచ్చరిక!

Published : September 26, 2025 at 3:13 PM IST
Noise Induced Hearing Loss: పండుగైనా, పార్టీ అయినా నేటి తరానికి డీజే ఉండాల్సిందే! గంటలపాటు పెద్దశబ్దాల నడుమ గంతులు వేయాల్సిందే! అయితే ఇలా అధిక శబ్దాలను దగ్గర నుంచి గంటల తరబడి వినడం వల్ల శాశ్వత వినికిడి లోపం బారిన పడడం లాంటి సమస్యలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. వీరిలో అధికంగా చిన్నారులు, యువత ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా వేడుకల వేళ వినియోగించే డీజే శబ్దాలు వినికిడి శక్తిని పూర్తిగా హరిస్తున్నాయి. కొంత మంది యువత మద్యం మత్తులో, ఆనందంతో గంటల తరబడి డీజే పక్కనే నిలబడి నృత్యాలు చేస్తూ, వైకల్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో శబ్ద తీవ్రత తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ఇప్పుడు తెలుసుకుందాం!
చాలా ముఖ్యం : చెవిలో మూడు భాగాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. బయట, మధ్య, లోపలి చెవి. వీటిలో శబ్దాలను గ్రహించి, మెదడుకు పంపించి వినేలా చేయడంలో కీలకంగా ఉండేది లోపలి చెవిలో ఉండే కాక్లియా. ఇదే ప్రధాన శ్రవణ గ్రాహకం అంటున్నారు. దీనిపై ఉండే సున్నితమైన గ్రాహకాలకు డామేజ్ జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. శబ్దాలు చాలా బిగ్గరగా, ఎక్కువసేపు ఉన్నప్పుడు హానికరం కావచ్చని, ఈ శబ్దాలు లోపలి చెవిలోని సున్నితమైన నిర్మాణాలను దెబ్బతీస్తాయని, శబ్దం-ప్రేరిత వినికిడి నష్టం (NIHL) కు కారణమవుతాయని National Institute on Deafness and other Communication Disorders అధ్యయనంలో పేర్కొంది.
'గుండెకు' ముప్పు తెచ్చే అలవాట్లు ఇవే! - వీటికి దూరంగా ఉండాలంటున్న నిపుణులు
ఎంత శబ్దాలను వినొచ్చు : సాధారణంగా 70 డెసిబుల్స్ లోపు ఉండే శబ్దాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా చెవులు వినగలవని, అదే 85 డెసిబుల్స్ దాటే శబ్దాలను వినడం వల్ల వినికిడి లోపం బారినపడతారని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో 85 డెసిబుల్స్ పైగా ఉండే శబ్దాలను రెండు గంటలకు మించి వినకూడదని, అదే 100 డెసిబుల్స్ దాటితే 15 నిమిషాలకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో పేర్కొంది. ఇందుకు విరుద్ధంగా వినియోగిస్తున్న డీజే శబ్దాలు వింటే చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు.
హెడ్‌ఫోన్స్ మంచి కంపెనీలకు చెందిన నాణ్యమైనవి మాత్రమే వాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు హెడ్‌ఫోన్, ఇయర్ఫోన్ల కంటే, ఫోన్ స్పీకర్‌ను ఉపయోగించడం మేలు. అలాగే ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఫోన్లకు హెడ్‌ఫోన్ , ఇయర్ బడ్స్‌ను పెట్టుకుని వినేటప్పుడు 60 డెసిబుల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. అలాగే బాణసంచా కాల్చే సమయంలో కొబ్బరినూనెలో దూది తడిపి, బాగా పిండేసి చెవిలో పెట్టుకుంటే, శబ్ద ప్రభావం కనీసం 30 శాతం తగ్గుతుంది. అధిక శబ్దాల మధ్య ఉండాల్సి వస్తే, శబ్దాన్ని నిరోధించేందుకు చెవి రక్షణ పరికరాలను వాడాలి-డాక్టర్ సింగరి ప్రభాకర్, ఈఎన్టీ వైద్య నిపుణులు
తాత్కాలిక వినికిడి లోపం : 85 dB కంటే ఎక్కువ శబ్దానికి అకస్మాత్తుగా లేదా ఎక్కువసేపు గురికావడం, అలా వచ్చే శబ్దం వల్ల వినికిడి లోపం సంభవించవచ్చని American Academy of Audiology అధ్యయనంలో పేర్కొంది. అక్కడ ఐదు నిమిషాలకు మించి ఉన్నప్పుడు, కొంతసేపు ఏ శబ్దాలు వినబడవని తెలిపారు. అలాగే, డీజే పక్కన కూడా ఐదు నిమిషాలు దాటి ఉంటే, ఇలాగే అవుతుందంటున్నారు నిపుణులు. దీనినే తాత్కాలిక వినికిడి లోపం అని, ఓ రెండు మూడు గంటల తర్వాత మళ్లీ సాధారణస్థితికి వస్తుందని వివరించారు.

శాశ్వత వినికిడి లోపం : ప్రస్తుతం డీజేల శబ్దాలను కనీసం 100-130 డెసిబుల్స్ వరకూ పెట్టి మోత మోగిస్తున్నారు. ఇంత తీవ్రమైన శబ్దాల వద్ద ఓ రెండు గంటలు ఉంటే చాలు, శాశ్వతంగా వినికిడి శక్తిని కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొంతమంది ఏకంగా 90 డెసిబుల్స్ వరకూ శబ్దాలను వినలేనంత శాశ్వత లోపం ఏర్పడుతోందంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది 85 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలను హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వినేవాళ్లు 40 నుంచి 50 డెసిబుల్స్ వరకూ వినే శక్తిని కోల్పోతున్నారని తెలిపారు.
వినికిడి కోల్పోతే : వినికిడి శక్తిని కోల్పోయిన వారిలో కొంతకాలానికి మానసిక సమస్యలు తీవ్రమవుతున్నాయని డాక్టర్లు సూచిస్తున్నారు. చెవిలో గుయ్ మంటూ చికాకు కలిగించే శబ్దంతో విసుగు, నిద్రలేమి, తలనొప్పి సహా ఆర్థికంగానూ తీవ్ర భారం పడుతుందంటున్నారు.
ఏ శబ్దాలు ఎంత డెసిబుల్స్ :
- మాట్లాడేటప్పుడు -60 డెసిబుల్స్
- ట్రాఫిక్‌లో వాహనాల శబ్దాల మధ్య -80 డెసిబుల్స్
- డీజే శబ్దం - 110-130 డెసిబుల్స్
- బాణసంచాలో కాల్చే తీవ్రమైన బాంబులు 120-140 డెసిబుల్స్
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులివేనట!
రోజువారీ వాకింగ్‌లో ఈ "షార్ట్‌కట్స్" పాటించండి - తక్కువ టైంలో ఎక్కువ బెనిఫిట్స్!


