ప్రశాంతమైన నిద్ర కావాలా? - ఈ అపోహలు వీడాలంటున్న నిపుణులు!
-నిద్ర గురించి ఉన్న అపోహలు తొలగించుకోవాలంటున్న నిపుణులు - ఇలా చేయడం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మంచిగా ఉంటుందని సలహా - ఆ అపోహలు ఏంటో తెలుసా?

Published : October 11, 2025 at 2:49 PM IST
Myths and Facts about Sleep: సంపూర్ణ ఆరోగ్యానికి కంటి నిండా నిద్రపోవడం చాలా ముఖ్యం. అయితే తీరిక లేని పనులు, నైట్ షిఫ్టులు, జీవనశైలిలో మనం చేసే కొన్ని పొరపాట్లతో పాటు నిద్ర గురించి ఉండే కొన్ని అపోహలు మనల్ని సుఖ నిద్రకు దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో శారీరకంగా, మానసికంగా పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయని పేర్కొంటున్నారు. అలా జరగకూడదంటే, నిద్ర గురించి ఉండే కొన్ని అపోహలు, వాటి వెనకున్న వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
సగటు మనిషి జీవితకాలంలో 1/3 వంతుల సమయాన్ని నిద్రకే కేటాయిస్తామంటున్నారు నిపుణులు. అయితే, మన జీవనశైలిలోని కొన్ని మార్పులు, తెలిసో, తెలియకో చేసే కొన్ని పొరపాట్ల కారణంగా నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతోందని చెబుతున్నారు. దీని ప్రభావం మన రోజువారీ పనులు, ఆరోగ్యంపై తీవ్రంగా పడుతోందని హెచ్చరిస్తున్నారు. మరికొందరిలో నిద్ర గురించి ఉండే కొన్ని అపోహలు వారిని ప్రశాంతమైన నిద్రకు దూరం చేస్తున్నాయంటున్నారు. అందుకే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం అని వివరిస్తున్నారు.
రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్ ఇదే!
పెద్దలకు ఐదు గంటల నిద్ర చాలు : ఇది పూర్తిగా అపోహేనని, చాలా మందిలో నెలకొన్న ఈ భావనే వారిలో నిద్రలేమికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో హైపర్‌టెన్షన్, గుండె సమస్యలు, డిప్రెషన్ వంటి లేనిపోని అనారోగ్యాలకు దారితీస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్దలు కూడా రాత్రుళ్లు ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాలని సెంటర్స్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అధ్యయనం పేర్కొంది.
పడుకునే ముందు మద్యం తాగడం : రాత్రిపూట మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని కొంతమంది అనుకుంటారు. కానీ, దీంతో ముంచుకొచ్చే మత్తు తాత్కాలికమే అంటున్నారు నిపుణులు. మద్యం మొదట్లో మత్తును కలిగించినా, ఆ తర్వాత నిద్రకు ఆటంకం కలిగిస్తుందని పేర్కొన్నారు. అధిక మొత్తంలో మద్యం సేవించే వ్యక్తుల్లో నిద్ర నాణ్యత తక్కువగా ఉంటుందని National Library of Medicine అధ్యయనం పేర్కొంది.
ఏ వేళలోనైనా సరే : ఇతర పనులు, నైట్ షిఫ్టుల రీత్యా రాత్రుళ్లు పూర్తిగా నిద్ర లేకపోవడం, లేదంటే ఆలస్యంగా పడుకోవడం మనలో చాలామందికి అలవాటుగా ఉంటుంది. అలా అప్పుడు త్యాగం చేసిన నిద్రను ఏ ప్రయాణాల్లోనో, మధ్యాహ్నమో కవర్ చేద్దామని, దీంతో రోజులో ఎప్పుడైనా ఎనిమిది గంటలు నిద్రపోతే సరిపోతుందని అనుకుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు. పైగా ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తే పర్లేదు కానీ, రోజు ఇదే రొటీన్‌గా కొనసాగిస్తే మాత్రం డిప్రెషన్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే నిద్రకంటూ ఒక సమయం కేటాయించుకోవడం, అది కూడా రాత్రి సమయమే సరైనదని సూచిస్తున్నారు. అలాగే, పగటి పూట ఓ కునుకు తీసినా దాన్ని రాత్రి నిద్ర వేళలతో కలపకుండా రాత్రిళ్లు ప్రశాంతంగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవడం ఆరోగ్యదాయకమని సూచిస్తున్నారు.
బెడ్‌లైట్‌లో నిద్రపోవడం మంచిదే : రాత్రిపూట బెడ్‌లైట్ లేనిదే కొందరికి నిద్ర పట్టదు. చీకటి అంటే భయం వంటివి ఇందుకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కానీ వెలుతురులో పడుకుంటే పదే పదే మెలకువ రావడం, ఆ తర్వాత నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువంటున్నారు. ఇది క్రమంగా నిద్రలేమికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, వెలుతురు కళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతూ ఇతర కంటి సమస్యలకూ కారణమవుతుందని వివరిస్తున్నారు. కాబట్టి బెడ్‌లైట్ లేకుండా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలని అంటున్నారు.
నిద్ర దానంతటదే వస్తుంది : కొంతమందికి బెడ్‌పై పడుకోగానే నిద్ర పట్టేస్తుంది. అదే మరికొంత మంది అయితే నిద్ర కోసం పాట్లు పడుతుంటారు. మంచంపై పడుకొని అటూ ఇటూ దొర్లుతుంటారు. ఇలా చేస్తే కాసేపటికి నిద్రపోతారని అనుకుంటారు. కానీ, ఇది కరక్ట్ కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, నిద్ర రాకపోయినా మంచంపై దొర్లడం, బలవంతంగా కళ్లు మూసుకొని పడుకోవడం వల్ల చిరాకు ఆవహిస్తుందంటున్నారు. ఎంతకీ నిద్ర పట్టట్లేదన్న ఒత్తిడి కలుగుతుందని వివరిస్తున్నారు.
కాబట్టి, ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే, మంచం మీద అటూ ఇటూ తిరగడానికి బదులుగా లేచి, స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించకుండా.. పుస్తకం చదవడం, మసక వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఏదైనా చేయడం మంచిదని sleepfoundation అధ్యయనం పేర్కొంది. గ్యాడ్జెట్స్‌తో గడపడం, టీవీ చూడడం అనేవి నిద్రను ప్రేరేపించవని, దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. అందుకే ఇలా కాసేపు రిలాక్స్ అయ్యారంటే ఎంచక్కా నిద్ర దానంతటదే వస్తుందని, ఆపై హాయిగా పడుకోవచ్చని సూచిస్తున్నారు.
NOTE : నిద్రకు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే బెటర్ అంటున్న నిపుణులు!
అలర్ట్: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - 'పోషకాహార లోపం' కావొచ్చట!

