"గుండె కోత" లేకుండా - అధునాతన పద్ధతిలో కవాటం మార్పు - నిపుణులు ఏమంటున్నారంటే!
కవాటం ఎందుకు సన్నబడుతుంది? - 'టావి' విధానంలో ఎలా చికిత్స చేస్తారు?

Published : September 29, 2025 at 3:53 PM IST
World Heart Day 2025 : పిడికెడంత గుండె నిలువెత్తు మనిషిని నడిపిస్తుంది. క్షణం ఆగకుండా నిరంతరం శరీర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అవయవాల నుంచి వచ్చే చెడు రక్తాన్ని ఊపిరితిత్తుల్లోకి చేరవేసి, అక్కడ ఆక్సిజన్‌తో నిండిన మంచి రక్తాన్ని అవయవాలకు పంప్ చేస్తూ ప్రాణాలను నిలబెడుతోంది. కానీ, హృదయ వాల్వ్ సమస్యల వల్ల ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే భయపడతాం. అందులోనూ వృద్ధులకంటే రిస్కూ ఎక్కువే! కానీ, అంగుళం కోత లేకుండానే హృదయ వాల్వ్ సమస్యలను పరిష్కరించొచ్చు అంటున్నారు నిపుణులు. రెండు మూడు రోజుల్లోనే కోలుకునే కొత్త చికిత్స మన దగ్గరా అందుబాటులో ఉందని చెబుతున్నారు. మరి, ఆ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
నడుస్తుంటే ఆయాసం, తల తిరగడం, అలసట లాంటివి గుండెలోని బృహద్ధమని కవాటం సన్నబడినప్పుడు(అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్) కనిపించే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అయితే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి దెబ్బతిన్న వాల్వ్‌ను మార్చాల్సి ఉంటుందని, అయితే రోగి వయసును దృష్టిలో పెట్టుకొని వైద్యులు ట్రాన్స్కాథటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ (టావి) విధానంలో ఒక అంగుళం కూడా కత్తి కోత కూడా లేకుండా సులభంగా మార్చవచ్చని తెలిపారు. ఈ చికిత్స జరిగిన రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి, వారం రోజుల్లోనే సాధారణ జీవనాన్ని కొనసాగించవచ్చని పేర్కొన్నారు. బృహద్ధమని కవాటం మరమ్మతు కోసం పరిమిత ఎంపికలు ఉన్న వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి TAVI ఒక ప్రభావవంతమైన ఎంపిక అని American Heart Association అధ్యయనంలో పేర్కొంది.
ఉదయాన్నే 'బీపీ' ఎందుకు పెరుగుతుంది? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
అధునాతన పద్ధతిలో కవాటం మార్పు : టావి విధానంలో మన తొడ దగ్గర చిన్న రంధ్రం చేసి, అక్కడి ఒక రక్తనాళం ద్వారా గుండెలోకి క్యాధటర్ను పంపించి, గుండె కవాటానికి మరమ్మతు చేస్తారని సీనియర్ కార్టియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా చెబుతున్నారు. బెలూన్ పెట్టి పెద్దదిగా చేసి, అక్కడ ఈ వాల్వ్‌ను అమర్చుతారని పేర్కొన్నారు. సాధారణంగా మెటల్, టిష్యూ వాల్వ్లని రెండు రకాలు ఉంటాయని, ఈ టావీ విధానంలో టిష్యూ వాల్వ్లనే వినియోగిస్తారని వివరించారు. ఈ క్రమంలో 'అయోటిక్ వాల్వ్ స్టెనోసిస్' సమస్య ఒక్కటి మాత్రమే ఉంటేనే, ఈ టావీ ప్రొసీజర్ చేస్తారని, గుండె ప్రధాన రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండి బైపాస్ చేయాల్సిన పరిస్థితులున్నా, మైట్రల్ వాల్వ్ లీక్ అవుతున్నా, టావీ సాధ్యం కాదని పేర్కొన్నారు.
రక్తనాళం లోపలి భాగం 5-7 మి.మీ మాత్రమే ఉంటుంది. వాల్వ్ సైజ్ 22-28 మి.మీ వరకూ ఉంటుంది. దీని ద్వారా వాల్వ్‌ను పంపించాలంటే, కణజాల కవాటం(టిష్యూ వాల్వ్) అయితేనే మడతపెట్టి పంపించడానికి అవకాశం ఉంటుంది. మెటల్ వాల్వ్ అయితే మడత పెట్టలేం. - డాక్టర్ లోకేశ్వరరావు, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్
మొదట్లో ఈ టావీ చికిత్సను హైరిస్కు ఉన్న వారికి మాత్రమే చేసేవారని డాక్టర్ లోకేశ్వరరావు పేర్కొన్నారు. ముఖ్యంగా 85 ఏళ్లు పైబడి ఉండి, ఎముకలు బలహీనంగా ఉండి, ఊపిరితిత్తుల్లో ఫైబ్రోసిస్ వంటి సమస్య ఉండి, ఇతర రిస్కు జాబితాలో ఉన్న వారికి మాత్రమే ఈ టావీ చేసే వారని తెలిపారు. కానీ, ఇప్పుడు 70 ఏళ్లు దాటిన వారికి కూడా చేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో బైపాస్ సర్జరీతో పోల్చితే టావీ చికిత్సకు ఖర్చు ఎక్కువవుతుందని, కానీ తర్వగా కోలుకుంటారని వివరించారు. పైగా వయసు పైబడిన వారు ఓపెన్ హార్ట్ సర్జరీ తట్టుకోలేరని తెలిపారు. కాబట్టి, టావి మంచి ప్రత్యామ్నాయంటున్నారు.
కవాటం ఎందుకు సన్నబడుతుంది? : అయోటిక్ వాల్వ్ వద్ద కాల్షియం నిల్వలు పేరుకుపోయినప్పుడు, రుమాటిక్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా వాల్వ్‌లు దెబ్బతింటాయని Harvard Health Publishing అధ్యయనంలో పేర్కొంది. కీళ్ల నొప్పులతో జ్వరం వచ్చి కవాటాలు దెబ్బతిన్నవారికి, వయసు 60 ఏళ్లు లోపు వారికి 'టావీ' పనికి రాదని, వీరికి ఓపెన్ సర్జరీ ద్వారా కవాటాన్ని మార్చాలని పేర్కొన్నారు. ఈ టిష్యూ కవాటాలు 5-6 ఏళ్లు వరకూ బాగా పనిచేస్తాయని, మరింత ఎక్కువ కాలం మన్నిక ఉండే టిష్యూ కవాటాలు 5-6 ఏళ్లు వరకూ బాగా పనిచేస్తాయని, మరింత ఎక్కువ కాలం మన్నిక ఉండే టిష్యూ కవాటాలు మున్ముందు రానున్నాయని వెల్లడించారు.
ఎందుకంత ముఖ్యం : అయోటిక్ వాల్వ్ దెబ్బతిందని గుర్తించిన తర్వాత, వీరు చికిత్స ఆలస్యం చేస్తే, సుమారు 30 నుంచి 40 శాతం రోగుల హృదయ కండరాలు శాశ్వతంగా బలహీనమవుతాయని హెచ్చరిస్తున్నారు. సుమారు 25 నుంచి 30 శాతం రోగులలో పరిమాణం పెరిగి హృదయం విఫలమవుతుందని పేర్కొన్నారు. పల్మనరీ హైపర్‌టెన్షన్, అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం వంటి ముప్పు పొంచి ఉంటుందని చెబుతున్నారు. ఏ చికిత్స పొందకపోతే సుమారు 50 శాతం మంది రెండేళ్లలోపే మృతిచెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో అయోటిక్ స్టెనోసిస్ ఉన్న రోగులకు కేవలం మందులు మాత్రమే ఫలప్రదంగా పనిచేయవని తెలిపారు. మందులపై ఆధారపడి ఉంటే, మొదటి సంవత్సరం జీవించడానికిఅవకాశం 50 శాతం మాత్రమే, రెండో సంవత్సరం 20 శాతం అవకాశం ఉంటుందని తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డీజే సౌండ్ ఎక్కువ పెట్టుకొని డాన్స్ చేస్తున్నారా? - ప్రమాదం పొంచి ఉందంటున్న నిపుణులు!
"గొంతు బొంగురు" పోవటం క్యాన్సర్ సంకేతమా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

