Managing Diabetes in Summer : సమ్మర్లో విహార యాత్రలకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. కానీ డయాబెటిస్ ఉన్నవారికి మాత్రం ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. వీరికి వేడి వాతావరణంలో ఇంకాస్త త్వరగా డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంటుంది. సమయానికి తగినంత నీరు తాగకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరిగి మూత్రం మరింత ఎక్కువగానూ రావొచ్చు. ఇది మరింత నీటిశాతం తగ్గటానికీ దారి తీస్తుంది. రక్తనాళాలు, నాడులు దెబ్బతినటం వంటి సమస్యలతో చెమట గ్రంథులు సరిగా పని చేయక శరీరం అంతగా చల్లబడుతుంది. అయితే, ఈ నేపథ్యంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎండాకాలంలోనూ యాత్రలను ఆస్వాదించొచ్చుని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
వీటి జోలికి పోవద్దు : మధుమేహం ఉన్నవారు దాహం వేయకపోయినా సరే నీరు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా ఉండటానికి చాలా ముఖ్యమని తెలిపారు. కెఫీన్‌తో కూడిన కాఫీ, కూల్ డ్రింకులు, ఎనర్జీ డ్రంక్స్, మద్యం తాగొద్దన్నారు. ఇవి శరీరంలోని నీరు బయటకు వెళ్లేలా చేస్తాయని, దీంతో గ్లూకోజు మోతాదులు పెరుగుతాయని అంటున్నారు.
నీడ పట్టున్నే ఉండేలా జాగ్రత్త : ముఖ్యంగా ఎండవేడికి గ్లూకోజు మోతాదులు పెరుగుతూ, తగ్గుతూ వస్తుంటాయి. అలాగే అధిక ఉష్ణోగ్రతలు బాడీలో ఇన్సులిన్‌ను వాడుకునే తీరును మార్చేస్తాయి. మిగతా రోజుల్లో కన్నా ఎండకాలంలో తరచూ డయాబెటిస్‌ను పరీక్షించుకోవాలి. ఇన్సులిన్ వాడుతున్నా వారు అవసరాన్ని బట్టి మోతాదులను నిర్ణయించుకోవాలి. డయాబెటిస్ గలవారు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో వీలైనంత వరకూ నీడ పట్టున్నే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీ అందుబాటులో ఉంటే మరి మంచిది అని సూచిస్తున్నారు.
గ్లూకోజ్ అదుపులో : వదులైన, లేత రంగు దుస్తులు ధరించాలి. నూలు దుస్తులైతే మేలని, ఇవి శరీరానికి బాగా గాలి తగిలేలా చూస్తాయని అంటున్నారు. సౌకర్యవంతమైన, సరైన సైజు షూ, సాక్స్ ధరించాలని, ఇవి పాదాలు దెబ్బతినకుండా కాపాడతాయని చెబుతున్నారు. ఎండ తక్కువగా ఉండే వేళల్లోనే వ్యాయామాలు చేయాలి. లేదా నీడలోనైనా చేయొచ్చు. గ్లూకోజు టాబెట్లు, ప్యూట్ జ్యూస్ వంటివి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడైనా ఉన్నట్టుండి గ్లూకోజు పడిపోతే వీటిని తీసుకుంటే వెంటనే మోతాదులు పెరుగుతాయి. ఇన్సులిన్‌ను చల్లటి, ప్రత్యేకమైన పెట్టెలోనే భద్రపరచుకోవాలని, లేకపోతే వేడికి ఇన్సులిన్ చెడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. యాత్రలకు వెళ్లే ముందే డాక్టర్‌ను సంప్రదించి మందులను మార్చుకోవాల్సిన అవసరముందేమో తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు.
నీరు మాత్రమే కాదు : ప్రతి ఒక్కరు సగటున రోజుకు 2 లీటర్ల నీరు తాగాలి. డయాబెటిస్ రోగులకు ఇది మరింత ముఖ్యం. నీరు ఒక్కటే కాకుండా ఇతరత్రా ద్రవాలూ తీసుకోవచ్చు. పలుచటి మజ్జిగ తీసుకోవచ్చు. నిమ్మ లేదా టమాటా రసాన్ని చక్కర లేకుండా తాగొచ్చు. తులసి/జీరా/పుదీనా నీళ్లు తాగొచ్చు. పీచు దండిగా ఉండే క్యాబేజీ, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవటం మంచిది. డయాబెటిస్ నియంత్రణలో ఉన్నప్పుడు ఓ పుచ్చకాయ ముక్క కూడా తినొచ్చు. కేలరీలు తక్కువగా ఉండే కీర దోసను సలాడ్, రైతా, చక్కెర లేని లస్సీలో అయినా కలపితినవచ్చు. రోజూ గుమ్మడి, పొట్లకాయ, సొరకాయ, కాకర కూడా సేవించవచ్చు.
చిరుతిళ్లు వెంట : అయితే, ట్రావెల్ చేస్తున్నప్పుడు అన్ని సార్లూ పోషక నిపుణులు సూచించిన ఆహారం అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి పొట్టు తీయని గోధుమ బ్రెడ్డు, అటుకులు, పలు ధాన్యాల బ్రెడ్డు, వంటివి వెంట తీసుకెళ్లటం మంచిదని సూచిస్తున్నారు. ఆహారంలో భాగంగా వేపుళ్లును పరిమితం చేసుకోవాలి. చువ్వల మీద కాల్చిన ఆహార పదార్థాలు తినకపోవటమే మంచిది. ఇవి రుచిగానే ఉన్నా, బాగా మాడినవి క్యాన్సర్ కారకంగా పరిణమించొచ్చని హెచ్చరిస్తున్నారు. మైదా, పాలిష్ పట్టిన బియ్యం కన్నా పొట్టుతో కూడిన గోధుమ పిండి, దంపుడు బియ్యం ఉపయోగించటం శ్రేయస్కరం. తక్కువ కేలరీలతో కూడిన రకరకాల ఆకుకూరలు, కూరగాయలలతో పళ్లాన్ని ఇంద్రధనుసు రంగులో ఉండేలా చూసుకోవాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రంజాన్‌లో ఖర్జూరం ఎందుకు తింటారో తెలుసా? వీటి వల్ల కలిగే ప్రయోజనాలివే!
హాట్ సమ్మర్లో కూల్ కూల్ డ్రింక్స్- ఇవి తాగితే డీహైడ్రేషన్‌కు చెక్!