Are Pickles Good for You : దాదాపు మనందరి ఇళ్లలో ఆవకాయ పచ్చడి కచ్చితంగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని.. పచ్చడితో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఉసిరి, నిమ్మకాయ, చింతకాయ వంటి వివిధ రకాల పచ్చళ్లు కూడా ఉంటాయి. ఇంట్లో ఏ కూర వండినా కూడా ఒక రెండు ముద్దలు పచ్చడితో కలుపుకుని తినకపోతే చాలా మందికి తృప్తిగా అనిపించదు. అయితే.. రోజూ పచ్చళ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? కానే కాదు అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ 'డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి'. ఆ వివరాలు మీ కోసం..
పచ్చడి అనగానే మనకు ఆవకాయ గుర్తుకొస్తుంటుంది. వేసవికాలంలో ప్రతి ఇంట్లోనూ సంవత్సరానికి సరిపడా ఆవకాయ పచ్చడిని జాడీల్లో నిల్వ పెడుతుంటారు. అలాగే కాలానికి అనుగుణంగా ఉసిరి, నిమ్మకాయ, చింతకాయ పచ్చళ్లను కూడా పెడుతుంటారు. అయితే.. పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి అధిక మోతాదులో ఉప్పు, నూనె అవసరమవుతాయి. వీటిని రోజూ తినడం వల్ల కొన్ని రకాల దుష్ప్ర భావాలు కలుగుతాయని డాక్టర్ రవిశంకర్ అంటున్నారు.
ఎక్కువ తింటే ఈ సమస్యలు తప్పవు!
పచ్చళ్లలో నూనె ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారని డాక్టర్ రవిశంకర్ చెబుతున్నారు. అలాగే ఎక్కువ ఉప్పు కారణంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముందు నుంచి గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది.
పోషకాలు అందవు!
కేవలం పచ్చడితో అన్నం కలుపుకుని తింటే శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. దీనివల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా కూరలతో కలిపి తినాలని డాక్టర్ రవిశంకర్ సూచిస్తున్నారు.
పచ్చళ్లు ఎక్కువగా తినేవారిలో కారం, మసాలాల వల్ల కడుపులో మంట, జీర్ణ సమస్యలు, లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా పచ్చళ్లు అధికంగా తినేవారిలో కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి, పచ్చళ్లను వీలైనంత వరకు తక్కువగా తీసుకుంటే మంచిదని డాక్టర్ రవిశంకర్ చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
వర్షాకాలం పచ్చళ్లు బూజు పడుతున్నాయా? - అయితే, ఇలా చేయండి! - ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి! -