International Yoga day 2025 : ప్రస్తుతం ఎక్కడ చూసినా యోగా, ధ్యానం, ఆసనాలు అంటూ చిన్న పిల్లాడి నుంచి ఆరు పదుల వయసు ఉన్నవారు కూడా నిత్యం సాధన చేస్తున్నారు. ఇది శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని, శ్వాసపై నియంత్రణ, ధ్యానం, వివిధ ఆసనాలు ఇందులో భాగమంటున్నారు నిపుణులు. దీని వల్ల ఎన్నో రోగాలు, నొప్పులను నివారించడం, రక్తపోటును అదుపులో ఉంచడం, నిద్రలేమి సమస్యలు, మానసిక రుగ్మతల నుంచి బయటపడవచ్చునని చెబుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం(జూన్ 21) నేపథ్యంలో శరీర అన్ని అవయవాలకు ఆరోగ్యాన్ని అందించే యోగాను ఎప్పుడు సాధన చేయాలి? ఎవరు చేయకూడదు? ఆఫీసు టైంలో ఎలాంటి ఆసనాలు వేయవచ్చు, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
ఏ టైంలో చేయాలి : యోగా సాధన చేసేటప్పుడు శరీర వేడి పెరుగుతుందని, అందుకే దీన్ని మరీ చల్లగా, అధిక తేమతో కూడిన ప్రదేశాలు, అత్యంత వేడిగా ఉన్న ప్రాంతాల్లో సాధన చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 8.30 గంటలకు ముందు లేదా సాయంత్రం 5 గంటల తర్వాత సాధన చేయడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తున్నారు. ఎక్కువ శబ్దం లేకుండా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో యోగా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుందని వివరించారు.
"మెదడుపై పెరుగుతున్న ఒత్తిడి" - "బ్రెయిన్ పవర్" పెంచుకునే మార్గాలివీ!

యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- ఒత్తిడి నిర్వహణ, మానసిక/భావోద్వేగ ఆరోగ్యంగా ఉంటుంది.
- మెడ నొప్పి, మైగ్రేన్, మోకాలి ఆస్టియో ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని National Institute of Health అధ్యయనంలో పేర్కొంది.
- అధిక బరువు సమస్యను అధిగమించడం.
- శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన ప్లీహం, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు సజావుగా పనిచేసేలా చేస్తుంది.
- ఎముకలను బలపరుస్తుంది.
- రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
- మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
- రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.
- రాత్రిపూట ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతమైన నిద్రను ప్రొత్సహిస్తుంది.
- మద్యం, ధూమపాన వ్యసనాన్ని నియంత్రించడానికి సహాయపడుతుంది.
- పని సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యాలు పెరుగుతాయి.

ఎవరు చేయకూడదు : నెలసరి టైంలో కొన్ని రకాల ఆసనాలు వేయకూడదని, అలాగే గర్భిణులు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కచ్చితంగా సంబంధిత వైద్యుల సూచనలు, సలహాల మేరకే యోగ సాధన చేయాలని National Institutes of Health పేర్కొంది.
ప్రస్తుతం వర్క్‌లైఫ్‌లో భాగంగా గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. దీంతో కనీస శారీరక శ్రమ లేక అనారోగ్యం పాలవుతున్నారని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో కూర్చున్న చోటే అంటే కుర్చీ మీదే చేసే కొన్ని యోగాసనాలు గురించి ప్రముఖ యోగాథెరపిస్ట్ సుభద్ర భూపతిరాజు తెలియజేస్తున్నారు.

కటిచక్రాసనం : ఎడమచేతితో కుడివైపు ఉన్న ఆర్మ్‌రెస్ట్ పట్టుకుని మెల్లగా ఎడమ వైపునకు వంగమని సుభద్ర భూపతిరాజు సూచిస్తున్నారు. ఈ క్రమంలో కుడిచేతిని తలమీదుగా ఎడమవైపునకు వంచమని, కొద్ది క్షణాలపాటు ఇలాగే ఉండి నెమ్మదిగా యథాస్థితికి తీసుకురావాలని తెలిపారు. అదే విధంగా మరో పక్కకి చేతులు మార్చి ఆసనం వేయాలని, దీని వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని వివరించారు.
పశ్చిమోత్తాసనం : మోచేతులను డెస్క్‌పై ఉంచి అరచేతులను భుజాలను తాకేలా ఉంచాలని, పాదాలను నేలకు అదిమిపెట్టి, మెల్లగా కుర్చీతో సహా నెమ్మదిగా వెనక్కి వెళ్లాలని సుభద్ర భూపతిరాజు తెలిపారు. ఇలా మీ వెన్ను నేలకు సమాంతరంగా వచ్చే వరకూ చేయొచ్చనని, ఇలా కొద్ది క్షణాలపాటు ఉండి మెల్లగా కుర్చీని ముందుకు లాక్కొంటూ యథాస్థితికి రావాలని సూచిస్తున్నారు. ఇది నడుము భాగంపై ఒత్తిడి తగ్గించి నొప్పుల్ని అదుపులో ఉంచుతుందని పేర్కొన్నారు.
తాడాసనం : కుర్చీ మధ్యలో వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చొని చేతులను చెవుల మీదగా పైకి పూర్తిగా చాచి ఉంచి రెండు చేతుల వేళ్లను ఒకదానికొకటి బంధించి సాగదీయాలని సుభద్ర భూపతిరాజు చెబుతున్నారు. చూపుని నిటారుగా ఉంచి ఆ భంగిమలో కొంత సేపు ఉండి చేతులను దించేయాలని సూచిస్తున్నారు. వెన్నుపూస మీద ఒత్తిడి తగ్గి, అక్కడి నుంచి విస్తరించే నరాలన్నీ ఉత్తేజితమై ఉత్సాహంగా ఉంటారని తెలిపారు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
యోగా ఎక్కడ పుట్టింది? ఆద్యుడు ఎవరు? రోజూ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీరు రోజూ ఈ వస్తువులు వాడుతున్నారా? - వీటితో క్యాన్సర్ ముప్పు ఉందంటున్న నిపుణులు!