ETV Bharat / health

రోజూ ఎన్ని లీటర్ల నీరు తాగాలి? - మోతాదుకు మించి తాగితే ఏమవుతుంది? - నిపుణుల ఆన్సర్​ ఇదే!

-శరీరంలో తగినంత నీరు లేకపోతే ఏమవుతుందో తెలుసా? - రోజుకు ఎంత వాటర్ తాగాలి?

DRINKING WATER
DRINKING WATER (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : October 9, 2025 at 4:15 PM IST

3 Min Read
Choose ETV Bharat

How Much Water Drink Per Day: మనిషి రోజుకు కనీసం 7 నుంచి 8 గ్లాసులు తాగాలనేది సాధారణ సిఫారసు. అయితే, అందరికీ ఈ నీటి సూత్రం వర్తించదంటున్నారు నిపుణులు. వయసు, శారీరక శ్రమ, ఆరోగ్య పరిస్థితులతో పాటు ఉష్ణోగ్రతలు, వాతావరణాలపై నీటి మోతాదు ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో నీరు ఎక్కువ తాగినా, తక్కువ తాగినా ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం!

తగినంత నీరు తాగితే :

  • చెమట, మూత్రం ద్వారా మలినాలు బయటకు పోతాయి.
  • శరీరంలో ప్రతి కణం, కణజాలం అవయవం సక్రమంగా పనిచేస్తాయి.
  • శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • మెదడు, జీర్ణక్రియ పనితీరు మెరుగుపడతాయి.
  • చర్మం, కీళ్లు, కండరాలు, కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఒంట్లో నీటి శాతం తగ్గితే :

  • శరీరంలో ఎలక్ట్రోలైట్లు బ్యాలెన్స్ తప్పుతాయి.
  • శక్తి సన్నగిల్లి తలనొప్పి, నీరసం, ఒత్తిడి, చిరాకు లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • మూత్రం వాసనతో ముదురు పసుపు రంగులో రావడంతో పాటు మలబద్ధకం లాంటి సమస్యలూ వస్తాయి.

కారులో 'వాటర్ బాటిల్' పెట్టడం ప్రమాదకరమా? - నిపుణులు ఏమంటున్నారంటే!

ఎప్పుడు తాగాలి :

  • ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అందులో అరచెక్క నిమ్మరసం పిండుకుంటే శరీరానికి అవసరమైన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైటో పోషకాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.
  • వెదర్ వేడిగా ఉన్నప్పుడు, ఎక్సర్​సైజ్ చేసినప్పుడు చెమట రూపంలో ద్రవాలు బయటకు పోతాయని, ఇలాంటి పరిస్థితుల్లో నీరు తాగాలని సూచిస్తున్నారు.
  • అలాగే, భోజనం చేయడానికి అరగంట ముందు, భోజనం చేసిన అరగంట తర్వాత నీరు తాగాలని National Library of Medicine అధ్యయనం పేర్కొంది. ఈ నేపథ్యంలో భోజనం చేస్తున్నప్పుడు, చేసిన వెంటనే నీరు తాగకూడదని హెచ్చరిస్తున్నారు.
  • తలనొప్పి, అలసట, ఒత్తిడి ఉన్నప్పుడు టీ, కాఫీల కంటే మంచినీరు తాగడం మేలంటున్నారు.
  • ఒకేసారి ఎక్కువ నీరు తాగితే వాటర్ ఇన్​టాక్సికేషన్ వచ్చే అవకాశం ఉందని, శరీరంలో సోడియం స్థాయి పడిపోయి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
  • చల్లని నీరు కంటే, గోరు వెచ్చని నీరు తాగితే జీర్ణక్రియకు మంచిదని సిఫార్సు చేస్తున్నారు.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?:

  • వాతావరణం, ఆహార పద్ధతుల దృష్ట్యా పురుషులు 3 లీటర్లు, మహిళలు 2.2 నుంచి 2.5 లీటర్ల నీళ్లు తాగాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం పేర్కొంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు అదనంగా 0.5 నుంచి లీటరు వరకు తీసుకోవాలని తెలిపింది.
  • ఆహారం ద్వారా లభింటే నీటితో కలిపి పురుషులు రోజుకు 3.7 లీటర్లు, మహిళలు 2.7 లీటర్ల నీరు తాగాలని mayoclinic అధ్యయనం పేర్కొంది.
  • తగినంత నీరు తాగేవారిలో కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల సమస్యలు తగ్గుతాయని జర్మల్ ఆఫ్ హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్ జర్నల్​ ప్రచురించింది.
  • ఒక శాతం డీహైడ్రేషన్ కూడా దృష్టి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై ప్రభావం చూపుతుందని యూరోపియన్ హైడ్రేషన్ ఇన్​స్టిట్యూట్ నివేదికలో పేర్కొంది.

దీర్ఘకాలిక డయాబెటిస్, బీపీతో బాధపడుతున్నవారు నీళ్లు అవసరానికి మించి తాగితే కిడ్నీ, గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో నీళ్లు తాగితే గుండెకు రక్తం పంప్ కావడం తగ్గిపోతుంది. గుండె, ఊపిరితిత్తుల చుట్టూ నీరు చేరడం, కాళ్ల వాపులు వస్తాయి-డాక్టర్ అమ్మన్న నలమాటి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, విజయవాడ

ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది : అనారోగ్య సమస్యలు లేనివారు ఒక్కసారిగా ఎక్కువ నీరు తాగితే రిసెప్టార్లు యాక్టివేట్ అయి తాగిన దానికంటే ఎక్కువ నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లి డీహైడ్రేట్ అవుతారని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నీరు తాగినప్పుడు, మూత్రపిండాలు అదనపు నీటిని తొలగించలేవని mayoclinic అధ్యయనం పేర్కొంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదని సూచిస్తున్నారు. గంటకు 250-350 మి.లీ చొప్పున నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అలాగే, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వృద్ధులు ఎక్కువ నీరు తాగకూడదని, మిగిలిన వారు రోజుకు 1.8 నుంచి 2.8 లీటర్లు తాగొచ్చని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో కాళ్లు, ముఖం వాపు ఉన్నా, నడిస్తే ఆయాసం వచ్చినా నీళ్లు తాగడం తగ్గించి డాక్టర్లు సూచనలతో జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

షుగర్​ లెవల్స్​ కంట్రోల్లో ఉండాలా? - ఈ టిప్స్ పాటిస్తే సహజంగానే అదుపులో!

చేతులు, కాళ్లలో 'ఈ లక్షణాలు' కనిపిస్తున్నాయా? - లివర్ డేంజర్​లో ఉందని అర్థమట!