How Many Meals Should a Diabetic Eat: మీరు టైప్ 2 డయాబెటిస్ లేదా ప్రీ డయాబెటిస్తో బాధపడుతున్నారా? మరి రోజుకు ఎన్ని సార్లు ఆహారం తింటున్నారు? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా ప్రతి రోజును మూడు భాగాలుగా విభజించుకుని తింటున్నారా? కానీ ఇలా కాకుండా రోజుకు మూడు సార్లకు మించి ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. 2018లో Diabetes & Metabolism జర్నల్లో ప్రచురితమైన "Eating three meals a day may not be optimal for everyone with diabetes: A randomized controlled trial" అనే అధ్యయనంలో ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ నేపథ్యంలోనే అసలు ఎన్ని సార్లు తినాలి? అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
అధ్యయనంలో భాగంగా ఊబకాయంతో ఉన్న 47మందిని తీసుకుని మూడు గ్రూపులుగా విభజించారు. ఇందులో రెండు గ్రూపులు ప్రీ డయాబెటిస్తో బాధపడేవారు ఉండగా, మరో గ్రూప్లో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిని పెట్టారు. అనంతరం వీరిని బరువు అదుపులో ఉండేలా డైట్ పాటిస్తూనే.. 12 వారాల పాటు కొందరిని మూడు, మరికొందరిని ఆరు పూటల ఆహారం తినమని సూచించారు. ఆ తర్వాత పద్ధతి మార్చి మరో 12 వారాలు కొనసాగించారు. ఇలా 24 వారాల తర్వాత వీరిని పరిశీలించగా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తిన్నవారిలో మెరుగైన ఫలితాలు కనిపించినట్లు తేలింది. అందరూ ఒకే మోతాదులో కెలరీలు తీసుకున్నప్పటికీ వీరి చక్కెర స్థాయులు అదుపులో ఉన్నట్లు వెల్లడైంది. అదే ప్రీ డయాబెటిస్ రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయులు పెరగడానికి చాలా సమయం తీసుకున్నట్లు బయటపడింది. దీంతో పాటు మూడు సార్లు తిన్నవారితో పోలిస్తే ఆరు సార్లు తిన్నవారిలో ఆకలి వేయడం తగ్గిందని పరిశోధకులు వివరించారు.

ఇలా తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, మధుమేహం, ప్రీ డయాబెటిస్ లేకుండా బరువు తగ్గేందుకు ఈ పద్ధతిని ఉపయోగించకూడదని సూచిస్తున్నారు. ఆరు సార్లు తినడం వల్ల అంతగా బరువు తగ్గలేదని అంటున్నారు. 2017లో Journal of Nutritionలో ప్రచురితమైన Meal Frequency and Timing Are Associated with Changes in Body Mass Index in Adventist Health Study అనే అధ్యయనంలోనూ ఈ విషయం తేలింది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ప్రీ డయాబెటిస్తో బాధపడేవారు రోజుకు ఆరు సార్లు ఆహారం తీసుకోవడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ఛాన్స్ తగ్గుతుందని తెలిపారు. అయితే, కేవలం ఇదే కాకుండా వ్యాయామం, వారానికి 150 నిమిషాలు చేయడం వల్ల కూడా ఫలితం ఉందని వివరించారు. కానీ, ఇలా ఆరు సార్లు తినడం వల్ల కొందరిలో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇంకా కుటుంబం మొత్తం మూడు సార్లు ఆహారం తింటుంటే.. మీరు ఆరు సార్లు తీసుకోవడం కొద్దిగా ఇబ్బంది ఉంటుందని తెలిపారు. అయితే, చక్కెర స్థాయులు అదుపులో ఉండేందుకు అనేక ఆహార పద్ధతులు ఉన్నాయని.. అందులో ఇది ఒకటి మాత్రమేనని వివరించారు. ఈ పద్ధతిని ఒక నెల పాటు పాటించాలని.. ఆ తర్వాత పరిస్థితుల ఆధారంగా కొనసాగించాలని సూచిస్తున్నారు.


NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
యూరిక్ యాసిడ్తో ఇబ్బందా? అసలు గౌట్ ఎలా వస్తుందో తెలుసా? తాజా పరిశోధనలో కీలక విషయాలు
రోజుకు ఎంత ఉప్పు తినాలో తెలుసా? అంతకుమించితే గుండెకు ముప్పు తప్పదట!