High Blood Pressure Linked to Alzheimer: ప్రస్తుత బిజీ లైఫ్స్టైల్తో పాటు ఒత్తిళ్లతో కూడుకున్న ఉద్యోగాలు చేస్తుండడం వల్ల అనేక మంది అధిక రక్తపోటుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్న వయసులోనే చాలా మంది ఉద్యోగులు హై బీపీ సమస్యతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కానీ ఇది చిన్న సమస్యే అని చికిత్స తీసుకోకుండా ఉంటున్నారు. ఇంకా కొందరు వారిలో తలెత్తిన దృష్టి లోపాలను సరిచేసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల జ్ఞాపకశక్తి, తెలివితేటలు, వివేచన క్షీణించే (డిమెన్షియా) ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నట్టే అని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఐదు డిమెన్షియా కేసుల్లో ఒకటి దృష్టి లోపాలతో ముడిపడి ఉంటున్నట్టు జామా పత్రికలో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. "Visual Impairment and Dementia: A Systematic Review and Meta-analysis" అనే అంశంపై చేపట్టిన అధ్యయనంలో జర్మనీలోని University of Hamburg ప్రొఫెసర్ Elżbieta Kuźma పాల్గొన్నారు.
ప్రధానంగా మూడు చూపు సమస్యలు (హ్రస్వదృష్టి, దూరదృష్టి, వస్తువుల మధ్య తేడా గుర్తించలేకపోవటం) గల వృద్ధుల్లో డిమెన్షియా తీరుతెన్నులను పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో సుమారు 19శాతం డిమెన్షియా కేసులు ఒకటి, అంతకన్నా ఎక్కువ రకాల దృష్టి లోపాలతో ముడిపడి ఉంటున్నట్టు నిపుణులు గుర్తించారు. చూపును సరిచేసుకున్నట్టయితే దాదాపు 20శాతం డిమెన్షియా కేసులను నివారించుకోవచ్చన్నని ఈ అధ్యయనంలో తేలింది.
మరోవైపు అధిక రక్తపోటుకు చికిత్స తీసుకోకపోవడం వల్ల అల్జీమర్స్ ముప్పు పెరుగుతున్నట్టు న్యూరాలజీ పత్రికలో ప్రచురితమైన మరో అధ్యయనంలో బహిర్గతమైంది. మొత్తం 14 దేశాలకు చెందిన 31,250 మందిని పరిశీలించి ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. హైబీపీ లేనివారితో పోలిస్తే అధిక రక్తపోటుకు చికిత్స తీసుకోనివారికి అల్జీమర్స్ ముప్పు 36% పెరుగుతున్నట్టు వెల్లడైంది. అధిక రక్తపోటుకు మందులు వేసుకునేవారితో పోలిస్తే హైబీపీకి చికిత్స తీసుకోనివారికి అల్జీమర్స్ ముప్పు 42శాతం ఎక్కువగా ఉంటున్నట్టు తేలింది.
నిజానికి వృద్ధాప్యంలో వచ్చే దృష్టి దోషాలను 90శాతం వరకూ నివారించుకోవచ్చు లేదా సరిచేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు నియంత్రణకూ మంచి మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని.. కాబట్టి వీటిని నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. సరైన చికిత్స తీసుకుంటే వృద్ధాప్యంలో డిమెన్షియా బారినపడకుండానూ కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది
నడుస్తుంటే కాళ్లు, పిక్కల్లో తీవ్రమైన నొప్పా? లేట్ చేస్తే కట్ చేయాల్సి వస్తుందట!
చిగుళ్ల నొప్పితో బాధపడుతున్నారా? కీళ్లవాతం వచ్చే ఛాన్స్ ఉందట జాగ్రత్త!