రోజూ 'యాలకులు' తింటున్నారా? - మీ శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా?
-వంటింట్లో ఉండే యాలకులతో కూరలకు రుచి మాత్రమే కాదు - ఈ ప్రయోజనాలు లభిస్తాయని నిపుణుల వెల్లడి!

Published : May 12, 2025 at 5:04 PM IST
Cardamom Health Benefits: సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను టీ, స్వీట్స్, కూరల్లో సువాసన, రుచి కోసం ఉపయోగిస్తాం. వీటిని వేయడం వల్ల వంటలు చాలా టేస్టీగా వస్తాయి. అయితే ఇవి కేవలం రుచిని అందిచడమే కాకుండా ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిలో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయని అంటున్నారు. ఇదిలా ఉంటే వీటిని కేవలం వంటల్లో ఉపయోగించడమే కాకుండా, కొద్దిమంది ప్రతిరోజూ నేరుగా తింటుంటారు. ఇలా ప్రతిరోజూ యాలకులు తినడం వల్ల శరీరంలో కరిగే మార్పులు ఏంటో మీకు తెలుసా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
శ్వాసకోశ సమస్యలను : యాలకుల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే ఎక్స్‌పెక్టొరెంట్ లక్షణాలు శ్లేష్మం (కఫం) చిక్కదనాన్ని తగ్గించి, దానిని సులభంగా బయటకు పంపించడానికి సహాయపడతాయని, ముఖ్యంగా దగ్గు, జలుబు లేదా బ్రోంకైటిస్ వంటి పరిస్థితులలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
నోటి ఆరోగ్యం : యాలకులలో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇందులో ఉండే సినోల్ అనే పదార్థం నోటి దుర్వాసన, ఇతర ఇన్ఫెక్షన్లను ఉత్పత్తి చేసే బాక్టీరియాతో పోరాడుతుందని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. అలాగే చిగుళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : రాత్రి భోజనం తర్వాత యాలకులు తినడం వల్ల జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరిచి ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గిస్తాయని తెలుపుతున్నారు. అలాగే వాంతులు, అజీర్ణం, కడుపునొప్పిని తగ్గించడంలో కూడా యాలకులు ప్రయోజనకరంగా ఉంటాయని వివరిస్తున్నారు.
క్యాన్సర్‌ను తగ్గించడంలో: క్యాన్సర్‌ను నివారించడంలో కూడా యాలకులు సమర్థవంతంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు. యాలకులలో ఉన్న యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని National Library of Medicine ఓ అధ్యయనంలో పేర్కొంది.

రక్తపోటును తగ్గిస్తుంది: యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. అలాగే ఇందులోని పోషకాలు మూత్రవిసర్జనను పెంచడం ద్వారా శరీరంలోని అదనపు నీటిని తొలగించి రక్తపోటును తగ్గిస్తుందని వివరిస్తున్నారు.
నిద్రను ప్రోత్సహిస్తుంది : యాలకులు ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గించడంతో పాటు మంచి నిద్రను ప్రోత్సహిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
షుగర్ లెవల్స్ : డయాబెటిస్తో బాధపడుతున్న వారికి యాలకులు మంచి ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని, National Library of Medicine పేర్కొంది. అలాగే వీటిని తినడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని అంటున్నారు. క్రమం తప్పకుండా యాలకులు తినడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుందని సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యాన్ని: యాలకులు రక్తపోటును తగ్గించడమే కాకుండా, కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రించడంలో సహాయపడతాయని, తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అలాగే యాలకులు ఆకలిని నియంత్రించడంలో ఉపయోగపడతాయని, బరువు తగ్గాలనుకునే వారికి వీటిని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుందని అంటున్నారు.
చర్మ ఆరోగ్యానికి : యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాకుండా, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్‌తో పోరాడి వృద్ధాప్యఛాయలు తగ్గిస్తుందని, అలాగే అనేక చర్మ సమస్యల నుంచి రక్షిస్తాయని వివరిస్తున్నారు. ఇవి రక్తప్రసరణను మెరుగయ్యేలా చేయడంతో పాటు చర్మకణాలకు న్యూట్రియంట్లు, ఆక్సిజన్ సరఫరాకు దోహదం చేస్తాయని పేర్కొంటున్నారు. ఇందులో ఉన్న విటమిన్లు, ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని వివరిస్తున్నారు.
ఎన్ని తీసుకుంటే మేలు: అయితే మంచివి కదా అని యాలకులను ఎక్కువ పరిమాణంలో తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. మంచి క్వాలిటీని కలిగిన వాటిని రోజుకు రెండు లేదా మూడు తీసుకోవడం మంచిదంటున్నారు.
NOTE : యాలకులకు సంబంధించిన ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రోజూ ఉదయాన్నే నెయ్యి తింటే ఏమవుతుంది? - ఈ సమస్యలున్నవారు తినకూడదా!
వంటింటి పదార్థాలతో "హెల్దీ లివర్" - కాలేయం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్న నిపుణులు

