ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? - మీ బాడీలో జరిగే మార్పులివేనట!
-ఇంట్లో తిన్నా ఫుడ్ పాయిజనింగ్ - అందుకు కారణం కిచెన్‌లో మీరు తెలియక చేసే పొరపాట్లేనట!

Published : September 25, 2025 at 3:40 PM IST
Risk of Poisoning from Repeatedly Heating Food: నాణ్యత లేదనో, నిల్వ ఉంచారనో, ఫుడ్ పాయిజన్ అవుతుందనో బయటి తిండిపై కొన్ని సార్లు విముఖంగా ఉంటాం! కానీ, మన ఇంట్లో వండిన ఆహారం కూడా విషతుల్యమైతే? ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపితే? అందుకే అవగాహన అవసరమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఆహారం వండేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
బయట తింటేనే కాదు, ఆహార పదార్థాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యం వహిస్తే ఇంట్లో తిన్నా ఫుడ్ పాయిజన్ అవుతుందంటున్నారు. మారిన జీవనశైలి, ఉరుకులు, పరుగుల జీవితంలో చాలా ఇళ్లల్లో రెండు, మూడు రోజులకు సరిపడా వండుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవడం, అవసరమైనప్పుడు తిరిగి వేడి చేసుకుని తినడం సర్వసాధారణమైంది. ఈ విషయంలో ఎక్కువ మందిలో సరైన అవగాహన లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారని చెబుతున్నారు. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను రోజుల తరబడి నిల్వ ఉంచి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండానే వేడి చేసి తినడం సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు.
పండిన ఆహారాన్ని రెండు గంటల్లోపే ఫ్రిజ్‌లో ఉంచాలి. లేనిపక్షంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆహార పదార్థాలను వీలైనంత వరకు పదే పదే వేడి చేయడం మానుకోవాలి. ఎన్ని సార్లు వేడి చేస్తున్నామంటే, అంత ఎక్కువ ముప్పు పొంచి ఉందన్న మాట. తప్పనిసరైతే ఒక్కసారి మాత్రమే వేడి చేసుకోవాలి. అధిక సార్లు వేడి చేసి తినాల్సి వస్తే, ఆహార పదార్థాన్ని ఒకే పాత్రలో కాకుండా, చిన్న వాటిల్లో నిల్వ ఉంచుకోవాలి. అవసరమైనప్పుడు ఫ్రిజ్ నుంచి తీసి, అంత వరకే వేడి చేసుకుని తింటే సరిపోతోంది- సుష్మ, పోషకాహార నిపుణురాలు
బంగాళాదుంపలు : మిగిలిపోయిన బంగాళాదుంప కూరను తిరిగి వేడిచేసి తినడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. వండిన బంగాళాదుంపలను సరిగా నిల్వ చేయాలని, లేనిపక్షంలో గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత క్లోస్ట్రీడియం బోటులినం బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తిరిగి వేడి చేసినా ఈ బ్యాక్టీరియా ముప్పు తొలగదని, ఆలూలో ఉండే నైట్రేట్ల కారణంగా వికారం, వాంతులు అవుతాయని హెచ్చరిస్తున్నారు.

కూరగాయలు నీళ్లలో ఉడికిస్తున్నారా?, ఆవిరి పడుతున్నారా? - ఎలా తింటే మంచిదో తెలుసా?
కోడిగుడ్లు : వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. కానీ, వండిన గుడ్లను వేడి చేసి తినడం వల్ల వాటిలోని పోషక విలువలపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలు కనిపిస్తాయని తెలిపారు. అంతేకాకుండా, పూర్తిగా ఉడికించని గుడ్లను వేడి చేసి తింటే, వాటిలో ఉండే సాల్మనెల్లా బ్యాక్టీరియా కారణంగా డయేరియా, జ్వరం, వాంతులు వస్తాయని పేర్కొన్నారు.
పాలకూర : మిగిలిన పాలకూర వంటకాన్ని ఫ్రిజ్‌లో పెట్టడం, తినే ముందు వేడి చేయడం మంచిది కాదంటున్నారు. వీటిలో ఉండే నైట్రేట్లు అమినో యాసిడ్లతో కలసి క్యాన్సర్ కారకాలైన నైట్రేట్లు, నైట్రోసమైన్లుగా మారే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. వండిన వెంటనే తినడం ఉత్తమం.

పుట్టగొడుగులు : పుట్టగొడుగుల్లో ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయని, ఎక్కువ సమయం గది ఉష్ణోగ్రత వద్ద ఉంచిన అనంతరం వేడి చేసి తింటే, బ్యాక్టీరియా పెరుగుతుందంటున్నారు. అంతేకాకుండా రంగు, రుచి మారుతుందని, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. వీటితో పాటు గుండె జబ్బులకు దారి తీస్తుందని వెల్లడించారు.
మాంసం : మాంసాన్ని ఎక్కువగా వేడి చేయడం వల్ల దాని ప్రోటీన్ల క్రియాత్మక లక్షణాలు గణనీయంగా ప్రభావితమవుతాయని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది. ఫ్రిజ్‌లో ఉంచి, తర్వాత వేడి చేసి తినడం వల్ల అందులోని ప్రొటీన్ గట్టిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు సరిగా నిల్వ చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన మాంసం తినాలంటే, 74 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తప్పనిసరిగా వేడి చేయాలని పేర్కొన్నారు. దీంతో బ్యాక్టీరియా చాలా వరకు చనిపోతుందని సూచిస్తున్నారు.
అన్నం : మనం తరచూ వేడి చేసే వాటిలో అన్నం కూడా ఒకటి. ఇందులో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుందని, చల్లారిన అన్నాన్ని తిరిగి వేడి చేస్తే, ఈ బ్యాక్టీరియా మరింత పెరిగి, విషపదార్థాలను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీని వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

"గొంతు బొంగురు" పోవటం క్యాన్సర్ సంకేతమా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!
మీ ఆరోగ్యం మీ ఫ్రిజ్‌పై ఆధారపడి ఉంటుందని తెలుసా? - అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

