Food Increase you Risk of Diabetes : ప్రస్తుత పరిస్థితుల్లో షుగర్ అనేది సర్వసాధారణ సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్తో బాధపడుతున్నారు. అయితే, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడానికి ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.. అలా కాకుండా కొన్ని పదార్థాలు రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు ఎక్కువ తిన్నా : సాధారణంగా చక్కెర లేదా చక్కెరతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఉప్పు ఎక్కువగా తినే వారికి డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ అధ్యయనంలో తేలింది.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? : సాల్ట్ ద్వారా లభించే సోడియాన్ని తక్కువగా తీసుకునే వాళ్లుతో పోలిస్తే రోజుకు 1.25 స్పూన్ల కంటే ఎక్కువగా తీసుకునే వారికి షుగర్ వచ్చే అవకాశం 72% కన్నా ఎక్కువగా ఉంటుందని NIH పరిశోధనలో తెలింది. ఉప్పు మూలంగా ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఫలితంగా మధుమేహానికి దారి తీస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
పొట్టు తీసేసిన ఆహారం : వైట్ రైస్, మైదా, చక్కెర తినడం వల్ల షుగర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో ఘగర్ స్థాయిని పెంచుతాయని హెచ్చరిస్తున్నారు. ఆహార పదార్థాలను ఎక్కువగా ప్రాసెస్ చేయడం వల్ల వాటిల్లో ఉండే ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పోతాయని అంటున్నారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగే అవకాశం అధికంగా ఉందని తెలిపారు. ఎక్కువ ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 21 శాతం పెంచుతాయని ఓ అధ్యయనంలో తేలింది.

కూల్ డ్రింక్స్ : షుగర్ స్థాయిలు ఎక్కువగా ఉన్న కూల్ డ్రింక్స్ తాగినా టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉందని NIH తెలిపింది. సోడా, తియ్యటి నిమ్మరసం, ప్రాసెస్డ్ జ్యూస్‌లు, సాఫ్ట్ డ్రింక్స్ వంటివి తాగితే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇలాంటి డ్రింక్స్‌ను రోజూ తీసుకోవడం వల్ల త్వరగా బరువు పెరగడమే కాకుండా, రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగి ఇన్సులన్పై ప్రభావం పడుతుందని చెప్పారు. ప్రతిరోజూ ఒకసారి లేదా రెండు సార్లు స్వీట్ డ్రింక్స్ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 26 శాతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఎక్కువగా ఫ్రైలు చేసిన ఆహారం : ప్యాకెట్ ఫుడ్, ఫ్రైలు ఎక్కువగా తీసుకునే వారు ఎక్కువగా షుగర్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉందని NIH అధ్యయనంలో తేలింది. వీటిలో ఎక్కువగా సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ప్యాట్ ఎక్కువగా ఉంటాయని తెలిపారు. రక్తంలో కొలెస్ట్రాల్ నిల్వలు ఎక్కువగా ఉంటే టైప్ 2 షుగర్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ సంతృప్త కొవ్వు, వెన్న, క్రీమ్ మిల్క్, చీజ్‌లలోనూ ఉంటుందని అంటున్నారు. ఈ ఆహార పదార్థాలు తినడం తగ్గిస్తే మధుమేహం బారి నుంచి తప్పించుకోవచ్చనని సూచిస్తున్నారు.
కొవిడ్ 19 మహమ్మారి అనంతరం ఫాస్ట్ ఫుడ్ వినియోగం బాగా పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వీటి వల్ల టైప్ 2 డయాబెటిస్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుందట. ప్రస్తుతం రెడీ టూ ఈట్ భోజనం, స్నాక్స్‌పై ఆధారపడటం పెరిగిపోవడంతో డయాబెటిస్ సమస్యతో పాటు గుండె పోటు, ఫ్యాటీ లివర్ ప్రమాదాలు కూడా ఎక్కువగా పెరుగుపోతున్నాయని నిపుణులు అంటున్నారు.
రెడ్ మీట్ : ప్రాసెస్ చేసిన రెడ్ మీట్, రెడ్ మీట్ రెండూ ఎక్కువగా తీసుకున్నా టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. హాట్ డాగ్‌లు, బేకన్, డెలి మీట్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాల్లో సోడియం, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ 3 ఔన్సుల రెడ్ మీట్ తినడం వల్ల టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 19 శాతం పెరుగుతుందని ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ పరిశోధనల్లో వెల్లడైంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎండల్లో గుండె జబ్బుతో భద్రం - హార్ట్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
యువతలో లక్షణాలు లేకుండా హార్ట్ ఎటాక్ - సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎందుకవుతుంది?