Easy Tips to Clean Plastic Boxes: ప్రస్తుతం చాలా ఇళ్లల్లో ప్లాస్టిక్ డబ్బాల్ని ఉపయోగిస్తున్నారు. స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి, కూరలు పెట్టడానికి, పప్పులు వంటి నిత్యావసరాలు భద్రపరచుకోవడానికి.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రతి దానికి వీటిని వాడుతున్నారు. అయితే వీటిని వాడడమే కాదు.. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడమూ ముఖ్యమే అంటున్నారు నిపుణులు. లేదంటే వాటిల్లో నిల్వ చేసిన పదార్థాల వాసన ఓ పట్టాన వదలదని.. అలాగని సబ్బు నీటితో కడిగేసి ఇతర పదార్థాల్ని ఆ డబ్బాలో నిల్వ చేసినా మరో రకమైన వాసన వస్తుంటుందని అంటున్నారు. అలా జరగకూడదంటే వీటిని క్లీన్ చేసే సమయంలో ఈ చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు.
బేకింగ్ సోడా: ప్లాస్టిక్ డబ్బాల నుంచి వచ్చే వాసనను తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అందుకోసం ప్లాస్టిక్ డబ్బాలను ఓసారి చల్లటి నీటితో కడిగాలి. ఆ తర్వాత ఆ డబ్బాలో గోరువెచ్చని నీరు పోసి..అందులో ఓ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దీన్ని ఓ రోజంతా అలాగే ఉంచి.. ఆపై డిష్‌వాష్ సోప్‌తో కడిగేస్తే సరిపోతుంది. బేకింగ్ సోడా పాత్రల్లోని దుర్వాసనను దూరం చేయడంలో సహకరిస్తుందని అంటున్నారు.
నిమ్మరసం: నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం పాత్రలకు అంటుకున్న పదార్థాల వాసనను దూరం చేయడంలో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం నిమ్మచెక్కతో ఆ పాత్రను రుద్ది.. ఆపై సబ్బు నీటితో కడిగేస్తే ఫలితం ఉంటుందంటున్నారు.
స్టెయిన్లెస్ స్టీల్ సింక్‌ని ఎలా శుభ్రం చేస్తున్నారు ? - ఇలా చేస్తే జిడ్డు పోయి కొత్తదానిలా!
వెనిగర్: కొన్ని ప్లాస్టిక్ డబ్బాలను ఎంత శుభ్రం చేసినా వాటిలోని పదార్థాల వాసన అస్సలు పోదు. అలాంటప్పుడు వెనిగర్‌తో వాటిని క్లీన్ చేస్తే ఫలితం ఉంటుందంటున్నారు. అందుకోసం ప్లాస్టిక్ డబ్బాల్లో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో పావు కప్పు వెనిగర్ వేసి.. ఐదు గంటల పాటు పక్కన పెట్టి.. ఆపై సబ్బు నీటితో కడిగేయాలని అంటున్నారు.
2020లో జర్నల్ ఆఫ్ కెమికల్ ఎడ్యుకేషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం వెనిగర్.. ప్లాస్టిక్ డబ్బాలలో బ్యాక్టీరియాను నాశనం చేసి వాటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించగలదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూజెర్సీ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (NJIT) లో రసాయన శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ Susan B. Nyquist పాల్గొన్నారు.
వెనీలా ఎక్స్‌ట్రాక్ట్: ఇది కూడా ప్లాస్టిక్ డబ్బాల నుంచి వచ్చే వాసనల్ని తొలగించడంలో సహకరిస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో డబ్బాలో గోరువెచ్చటి నీటిని నింపి.. అందులో కొద్దిగా వెనీలా ఎక్స్‌ట్రాక్ట్ వేసి.. ఓసారి షేక్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక రోజంతా పక్కన పెట్టేయాలి. ఆపై నార్మల్ వాటిలాగే సోప్ వాటర్‌తో కడిగేస్తే సరిపోతుందని అంటున్నారు.
కాఫీ పిప్పి: దీనితో కూడా ప్లాస్టిక్ డబ్బాల నుంచి వచ్చే దుర్వాసనల్ని దూరం చేసుకోవచ్చు. ఇందుకోసం కొద్దిగా ప్లాస్టిక్ డబ్బాలో కాఫీ పిప్పిని వేసి ఓ రోజంతా అలాగే ఉంచేయాలి. తద్వారా కాఫీ పిప్పి ఆ దుర్వాసనను పీల్చేసుకుంటుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
సూపర్ ఐడియా - కిచెన్ గోడలపై నూనె మరకలా? - ఈ టిప్స్ పాటిస్తే నిమిషాల్లో మాయం!