ETV Bharat / health

భోజనం చేశాక ఆకలేస్తోందా? - శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు ఏం చేస్తుందంటే!

నీరు ఎక్కువగా తాగే అమ్మాయిల్లో నెలసరి నొప్పి తక్కువే - తలనొప్పి, కడుపునొప్పికీ "అదే కారణం" కావచ్చేమో!

best_time_to_drink_water
best_time_to_drink_water (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : April 23, 2025 at 1:32 PM IST

3 Min Read
Choose ETV Bharat

​​Drinking Water at the Right Time : రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? అని మీరు ఆలోచిస్తున్నట్లయితే అసలు ఎప్పుడు తాగాలి? అనే మరో సందేహం కూడా వస్తుంది. శరీరంలో నీటి శాతం తక్కువైతే మెదడు పంపే సంకేతాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా గుర్తించాలి అనే వివరాలతో పాటు శరీరానికి ఎంత నీరు అవసరమో అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం.

శరీరానికి నీరు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు ఎలాగోలా బతికేస్తాం కానీ, నీళ్లు తాగకుండా ఉండలేం. బాడీలో పనులు సజావుగా సాగటానికి నీరు తప్పనిసరి. కానీ నీరు ఎప్పుడు, ఏ టైంలో తాగాలనేది చాలా మందికి వచ్చే సందేహం.

వాటర్
వాటర్ (Getty image)

ఆకలిగా అనిపించినప్పుడు : ఆకలేస్తే నీరు తాగటం ఏంటని అనుకుంటున్నారా? దాహం వేస్తున్నప్పుడూ ఆకలిగా అనిపించొచ్చనని నిపుణులు అన్నారు. ఈ విషయాన్ని చాలా మంది అర్థం చేసుకోలేరని, దాహం, ఆకలి రెండింటి ప్రేరకాలనూ మెదడు ఒకేలా గుర్తిస్తుందని కారణాన్ని వెల్లడించారు. కాబట్టి ఆకలిగా అనిపించినా దాహమే కారణం కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

నిద్ర లేవగానే : ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నోరు పుక్కిలించి ఓ గ్లాసు నీళ్లు తాగటం మంచిదని National Library of Medicine అధ్యయనం ద్వారా తెలుస్తోంది. కాస్త నిమ్మరసం కలిపితే రాత్రంతా ఖాళీగా ఉన్న శరీరానికిది ఉత్తేజాన్నిస్తుంది. విటమిన్ సి, పొటాషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లూ శరీరానికి అందుతాయని వెల్లడించారు.

వాటర్
వాటర్ (Getty image)

చెమట పోస్తున్నప్పుడు : ఎండ వేడి, తేమ వాతావరణం, వ్యాయామం చేస్తున్నప్పుడు చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుందని తెలుసు. అయితే, ఉష్ణోగ్రత పెరుగుతున్నప్పుడు చల్లబరచడానికి శరీరం చేసే ప్రయత్నం అని నిపుణులు చెప్తున్నారు. దీనిని తిరిగి భర్తీ చేసుకోవడానికి తగినంత నీరు తాగటం తప్పనిసరి. వ్యాయామానికి ముందూ, తర్వాత నీళ్లు తాగాలని mayoclinic పేర్కొంది.

జబ్బుల బారిన పడినప్పుడు : జబ్బుల నుంచి కోలుకోవటంలో నీరు కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు. జ్వరం, వాంతులు, విరేచనాల సమయంలో ఒంట్లోంచి చాలా నీరు పోతుంది. వీటికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నప్పుడే కొద్ది కొద్దిగా నీరు తాగటం మొదలుపెట్టాలని, దాహంగా లేకున్నా నీరు తాగాలని స్పష్టం చేస్తున్నారు. కాఫీ, కూల్​డ్రింకులు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలని, అవి ఒంట్లోంచి మరింత ఎక్కువ నీరు బయటకు వెళ్లేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వాటర్
వాటర్ (Getty image)

నెలసరి సమయంలో : మహిళల రుతుక్రమ సమయంలో, రుతుక్రమానికి ముందు తగినంత నీరు తాగడం తప్పనిసరి. నెలసరి నొప్పి వల్ల కలిగే ఇబ్బందులు తగ్గుతాయని, తలనొప్పి, కడుపునొప్పికి దారితీసే ప్రధాన కారణాల్లోనూ ఒంట్లో నీరు తగ్గటం ఒకటని వివరించారు. ఎక్కువగా నీరు తాగే అమ్మాయిల్లో నెలసరి నొప్పి తగ్గుతున్నట్లు National Library of Medicine అధ్యయనంలో వెల్లడైంది. ఈ సమయంలో తగినంత నీరు తీసుకోవడం వల్ల నొప్పి మందుల అవసరమూ తగ్గుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

మధ్యాహ్న బడలిక వేళ : పని ఒత్తిడిలో నిరుత్సాహంగా అనిపిస్తే చాలా మంది కాఫీ, టీ తాగటం చేస్తుంటారు. వీటి కన్నా గ్లాసు నీరు తాగటం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో కాస్త నిమ్మరసం పిండుకుంటే శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. పైగా ఉత్సాహంగా ఉంటుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

తలనొప్పి వస్తున్నప్పుడు : నీటి శాతం తగ్గటం తలనొప్పి ప్రేరకాల్లో ఒకటి అని నిపుణులు వెల్లడిస్తున్నారు. కొందరిలో కాస్త నీరు తగ్గినా తీవ్రమైన తలనొప్పి వస్తుందని, అది తికమక పడటానికీ దారితీయొచ్చనని తెలిపారు. తరచూ తలనొప్పితో బాధపడేవారు వెంట నీళ్ల బాటిల్ తీసుకెళ్లటం మంచిదని సూచిస్తున్నారు. పనుల మధ్యలో అప్పుడప్పుడూ గొంతు తడుపుకొంటే నొప్పుల నుంచి ఉపశమనం ఉంటుందని తెలిపారు.

వాటర్
వాటర్ (Getty image)

భోజనానికి ముందు : ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు నీరు తాగడం వల్ల బరువు తగ్గుతున్నట్లు Harvard Health Publishing అధ్యయనాల్లో తేలింది. భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి ఉంటారని నిపుణులు పేర్కొన్నారు.

ఏకాగ్రత కుదరనప్పుడు : పనిలో, ముఖ్యంగా చదువుకునేటప్పుడు చాలా మందికి ఏకాగ్రత ఉండదు. ఈ సమయంలో ఓ గ్లాసు నీరు తాగమని నిపుణుల సలహా. ఒంట్లో నీరు తగ్గితే మెదడులోని రక్తనాళాలు ముడుచుకుపోతాయని, దీని వల్ల ఏకాగ్రత, స్వల్పకాల జ్ఞాపకశక్తి, శక్తి మీద ప్రభావం చూపుతుందని వివరించారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

శరీరంలో ఇదొక "సైలెంట్ కిల్లర్"! - గుర్తించేలోగా గుండె జబ్బులకు దారి తీస్తుంది

రోజుకు ఎంత 'షుగర్' అవసరమో తెలుసా? - చక్కెర వెనుక చేదునిజాలెన్నో!