Good and Bad Cholesterol : డాక్టర్ వద్దకు వెళ్తే "కొలెస్ట్రాల్ పెరిగింది వాకింగ్ చేయాలని" సూచిస్తుంటారు. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏమిటో మీకు తెలుసా? కణ నిర్మాణంతో పాటు హార్మోన్ల ఉత్పత్తిలో కొలెస్ట్రాల్ కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలోని మైనం లాంటి ఈ పదార్థం శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎంతో అవసరం. అయితే శరీరానికి ఉపయోగపడే మంచి కొలెస్ట్రాల్, హాని చేసే చెడు కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే దీన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం!

అనేక శారీరక విధులు నిర్వహించడానికి కొలెస్ట్రాల్ అవసరమని నిపుణులు అంటున్నారు. మంచి లేదా చెడు కొలెస్ట్రాల్ మధ్య అసమతుల్యత ఉన్నప్పుడు శరీరంలో సమస్య తలెత్తుతుందని చెబుతున్నారు. శరీరంలో అవసరాన్ని మించిన కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ధమనుల్లో గోడలు ఏర్పడటానికి దారితీస్తుందని తెలిపారు. దీంతో గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందని వివరించారు.
మంచి కొలెస్ట్రాల్ : శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను హై-డెన్సిటీ లిపోప్రోటీన్ (HDL) అని అంటారు. ఇది రక్తప్రవాహంలోని అదనపు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి సహాయపడుతుందని నిపుణులు తెలిపారు. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని mayoclinic అధ్యయనంలో పేర్కొంది. హెచ్‌డీఎల్ అనేది ధమనులను శుభ్రం చేయడానికి సహాయపడుతుందని వివరించారు.

చెడు కొలెస్ట్రాల్ : తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రొటీన్(LDL) లేదా చెడు కొలెస్ట్రాల్ అనేది ధమనుల్లో జిగట లేదా గట్టి నిక్షేపం ఏర్పడటానికి దోహదం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఎల్డీఎల్ అనేది ధమనుల నాళాలను ఇరుకుగా చేసి రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుందని చెబుతున్నారు. శరీరంలో ఎల్డీఎల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు రక్త నాళాల్లో వాపును ప్రేరేపిస్తుందని తెలియజేశారు. దీంతో అథెరోస్ల్కెరోసిస్‌కు దారితీయడం వల్ల గుండె పోటు లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. శరీరంలో కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి జీవనశైలిలో తీవ్రమైన మార్పులు అవసరం లేదని, కొన్ని ఆచరణాత్మకమైన వ్యూహాలను పాటిస్తే సరిపోతుందని నిపుణులు అంటున్నారు.
స్మార్ట్‌గా తినండి : కొలెస్ట్రాల్‌ను నిర్వహించడానికి గుండెకు అనుకూలమైన ఆహారం తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ప్రోటీన్లు, ఓట్స్, బీన్స్ వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సంతృప్తు కొవ్వులను పరిమితం చేయడం, ట్రాన్స్ఫ్యాట్లను నివారించడం లాంటి చిన్న మార్పులు చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించకోవచ్చనని Harvard health Publishing అధ్యయనంలో పేర్కొంది.

వ్యాయామం : క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం వల్ల శరీరంలో ఎల్డీఎల్ తగ్గి, హెచ్‌డీఎల్ అనేది పెరుగుతుందని mayoclinic పేర్కొంది. నడక, సైక్లింగ్ లేదా ఈత లాంటివి వ్యాయామలు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి దోహదపడతాయని వివరించారు. వ్యాయామం అనేది కొలెస్ట్రాల్‌ను నివారించడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. రోజుకు కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం వల్ల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
ధూమపానం, మద్యానికి దూరంగా ఉండటం : ధూమపానం అనేది మంచి కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని National Library of medicine పేర్కొంది. అయితే అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగడంతో పాటు రక్తనాళాలను దెబ్బతీస్తుందని నిపుణులు తెలిపారు. ధూమపానం, ఆల్కహాల్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండటం అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయని తెలిపారు.

బరువు చెక్ చేసుకోవడం : అధిక బరువు కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని NIHMedlinePlus Magazineలో ప్రచురితమైంది. దీని వల్ల శరీరంలో హెచ్‌డీఎల్ స్థాయి తగ్గి, ఎల్‌డీఎల్‌ను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చనని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గడంతో పాటు గుండె సంబంధ ప్రమాదాలు తగ్గుతాయని వివరించారు.
రెగ్యులర్ చెకప్ : ఒబెసిటీ, డయాబెటిస్, గుండె జబ్బుల లాంటి సమస్యలతో బాధపడుతున్నవారు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎంత ఉందో క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : కొలెస్ట్రాల్‌కు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గొంతు వాపు, మింగడంలో ఇబ్బందిగా ఉందా? - "థైరాయిడ్" హెచ్చరికలు ఎలా ఉంటాయంటే!
బెండకాయలు తింటే 'డయాబెటిస్' తగ్గుతుందా? - నిపుణులు ఏమంటున్నారంటే!