Diabetic Diet in Dinner : ఒక్కసారి షుగర్ నిర్ధారణ అయ్యిందంటే చాలు! ఇక ఉదయం ఏం తినాలి? మధ్యాహ్న భోజనం ఎలా ఉండాలి? ఏఏ పదార్థాలు తినకూడదు? ఎంత సేపు వ్యాయామం చేయాలి? ఇలా సవాలక్ష సందేహాలుంటాయి. అడుగు వేయాలన్నా, తినాలన్నా ప్రతీది ఒక లెక్కుంటుంది. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో డయాబెటిస్ కూడా సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజూ సరైన సమయంలో సరైన ఆహారం తీసుకోవడం తప్పనిసరి అని, లేదంటే సమస్య మరింత క్షిష్టంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు రాత్రి భోజనంలో ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదో సూచిస్తున్నారు. షుగర్ పేషెంట్లకు National Library of Medicine కూడా పలు ఆహార నియమాలను సూచించింది.

ఆరోగ్యానికి ప్రమాదకరం : డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా రాత్రి వేళల్లో ఆహారాన్ని పూర్తిగా మానేస్తారు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి లేదా పడిపోతాయని Cleveland clinic పేర్కొంది. ఇవి రెండూ ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు అంటున్నారు.

వాటితో గ్లూకోజ్ రెట్టింపు : రాత్రిళ్లు ఆహారం అధికంగా తీసుకున్నా జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫలితంగా తిన్న ఆహారం తొందరంగా జీర్ణం అవ్వదని పేర్కొంటున్నారు. దీంతో రక్తంలో షుగర్ స్థాయి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి రిఫైండ్ చేసే పిండి పదార్థాలను అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తున్నారు. అన్నం, బ్రెడ్, పాస్తా, మైదాతో చేసినవి తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ రెట్టింపు అవుతుందని అంటున్నారు.
డయాబెటిస్ పేషెంట్లు రాత్రివేళల్లో తియ్యటి పండ్ల రసాలు, కేకులు, ఐస్‌క్రీములను తీసుకుంటే సాధారణ సమయంలో కంటే రాత్రి వేళల్లోనే చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనంలో ప్రొటీన్, ఫైబర్ తక్కువగా ఉంటే ఆహారం తొందరగా జీర్ణమవుతుందని, దీంతో శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ఆలస్యంగా తినడం వల్ల : రాత్రి వేళ ఆలస్యంగా తినడం వల్ల ఇన్సులిన్ స్థాయిల మీద ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రకు ఉపక్రమించడానికి కనీసం 2-3 గంటల ముందే ఆహారం తీసుకోవడం మంచిదని Cambridge university అధ్యయనంలో తేలింది. డయాబెటిక్ పేషెంట్లు రాత్రిళ్లు పిండి పదార్థాలను తగ్గించడం మేలని అంటున్నారు. రోజూ తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎంత శాతం ఉన్నాయో తెలుసుకోవడం ఉత్తమమని mayoclinic వెల్లడించింది. కప్పు కొలతతో అన్నం తినడం మంచిదని సూచిస్తున్నారు.
ఫ్రైడ్ చికెన్, సాస్, చీజ్ ఉపయోగించిన పదార్థాలను రాత్రివేళల్లో తీసుకుంటే వాటి వల్ల శరీరంలో కొవ్వు పేరుకుంటుందని నిపుణులు వివరించారు. దీని కారణంగా రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరుగుతాయని Cleveland clinic తెలిపింది. దీనితో పాటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. డీహైడ్రేషన్ కూడా గ్లూకోజ్ స్థాయిలు పెరిగేందుకు కారణం అవుతుందని చెబుతున్నారు.

క్రమం తప్పకుండా : అదే విధంగా డయాబెటిక్ పేషెంట్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడానికి సరైన సమయం లేకపోతే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడిస్తే మంచిదని చెప్తున్నారు. అలాగే కూల్ డ్రింక్స్‌కు పూర్తిగా దూరంగా ఉండడంతో పాటు పరోటా, పాస్తా, పిజ్జా, షుగర్ ఎక్కువగా ఉన్నా పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : డయాబెటిస్‌కు సంబంధించి ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ ప్రాణాంతక మహమ్మారి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? - అయితే నిర్లక్ష్యం చేయకండి!
ఉప్పు ఎక్కువగా వాడినా షుగర్ వస్తుందా? - నిపుణులు ఏమంటున్నారంటే?